Team India: ప్రపంచకప్ 2027లో రోహిత్, కోహ్లీ ఆడతారా.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన గవాస్కర్
2027 ODI World Cup: వన్డే ప్రపంచ కప్ 2027 కోసం భారత జట్టులో చేరే విషయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే తమను తాము బలంగా నిరూపించుకున్నారని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో వీరిద్దరి ప్రదర్శనతో కీలక కామెంట్స్ చేశారు.

Rohit Sharma, Virat Kohli: క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు గురించి భిన్న సమయాల్లో వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో, వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటం కష్టమని తాను భావిస్తున్నానని, ఎందుకంటే టోర్నమెంట్ నాటికి వారికి వయసు పెరుగుతుందని (రోహిత్‌కు 40, కోహ్లీకి 38) ఆయన పేర్కొన్నారు. టెస్ట్, టీ20 ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అయిన తర్వాత, వన్డేలకు మాత్రమే సిద్ధంగా ఉండటం, తక్కువ వన్డే మ్యాచ్‌లు ఉండటం వలన ఫామ్, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం సవాలుగా మారుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఇటీవల ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో వారి అద్భుతమైన ప్రదర్శన తర్వాత, గవాస్కర్ తన అభిప్రాయాన్ని బలంగా మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.
‘2027 ప్రపంచకప్ కోసం వారి పేర్లు రాసి పెట్టుకోండి’
తాజాగా ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శన తర్వాత సునీల్ గవాస్కర్ మరింత సానుకూలమైన, దృఢమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి సీనియర్ ఆటగాళ్లు 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టులో ఖచ్చితంగా ఉంటారని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు.
ఒక ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ, “దక్షిణాఫ్రికాలో 2027 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో వారిద్దరి పేర్లను ఇప్పుడే రాసి పెట్టుకోవచ్చు” అని బల్లగుద్ది చెప్పారు. జట్టు ఫీల్డింగ్‌పై ప్రధాన ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, అనుభవజ్ఞులైన ఈ ఇద్దరు బ్యాటర్ల ఆటతీరుపై ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఫామ్, ఫిట్‌నెస్ కీలకం..
రోహిత్ (40), కోహ్లీ (38) వయస్సు దృష్ట్యా, ప్రపంచ కప్ వరకు అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్, ఫామ్ కొనసాగించడం అత్యంత కీలకం.
ఈ ఇద్దరు దిగ్గజాలు టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికినప్పటికీ, వన్డేలపై దృష్టి సారించడం, ముఖ్యంగా ఇటీవల చూపిన అద్భుతమైన ప్రదర్శనలు వారి సామర్థ్యాన్ని, పట్టుదలను నిరూపించాయి.
అలాగే, “వచ్చే సంవత్సరం లేదా ఆ తరువాత కూడా వారు వరుసగా సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఉంటే, ఆ దేవుడు కూడా వారిని జట్టు నుంచి తప్పించలేడు” అని గతంలో చేసిన వ్యాఖ్యను గుర్తుచేసుకోవాలి.
సునీల్ గవాస్కర్ తాజా వ్యాఖ్యలు రోహిత్-కోహ్లీ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. అయితే, రాబోయే రెండు సంవత్సరాలలో వారి ప్రదర్శన మరియు దేశవాళీ క్రికెట్‌లో వారి చురుకుదనం 2027 ప్రపంచ కప్ టికెట్‌ను నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








