వామ్మో.. బౌండరీ లైన్ లో ఫీల్డింగ్.. బంతిని పట్టుకోబోయి కుప్పకూలిన ఫీల్డర్.. ఎక్కడంటే?
Shivam Singh got injured: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు మరియు సౌరాష్ట్ర తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తమిళనాడు ఫీల్డర్ శివం సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీ దగ్గర క్యాచ్ పట్టడానికి ప్రయత్నిస్తుండగా, అతని తల నేరుగా నేలకు తగిలింది.

Shivam Singh got injured: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో భాగంగా సౌరాష్ట్ర, తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఫీల్డింగ్ చేస్తూ బంతిని పట్టుకునే క్రమంలో తమిళనాడు ఆటగాడు శివమ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులు కాసేపు ఆందోళనకు గురయ్యారు.
అసలేం జరిగింది?
ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఈ ప్రమాదం జరిగింది. సౌరాష్ట్ర బ్యాటర్ విశ్వరాజ్ జడేజా డీప్ మిడ్‌వికెట్ దిశగా గట్టి షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శివమ్ సింగ్, బంతిని క్యాచ్ పట్టుకోవడానికి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేశాడు.
దురదృష్టవశాత్తు, బంతి అంతకంటే ముందే నేలను తాకింది. కానీ డైవ్ చేసిన వేగానికి శివమ్ సింగ్ నియంత్రణ కోల్పోయి నేరుగా తలతో మైదానాన్ని ఢీకొట్టాడు. అతడి కణత భాగం బలంగా నేలకు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
మైదానం నుంచి నిష్క్రమణ..
శివమ్ సింగ్ కింద పడిపోవడంతో మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది. తమిళనాడు ఫిజియోలు, సహచర ఆటగాళ్లు వెంటనే మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. గాయం తీవ్రత చూసి అందరూ ఆందోళన చెందారు. అయితే, కాసేపటి తర్వాత శివమ్ సింగ్ కోలుకుని, సహచర ఆటగాళ్ల సాయంతో మైదానం నుంచి బయటకు నడిచి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
శివమ్ సింగ్ గురించి..
శివమ్ సింగ్ ఈ సీజన్‌లోనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఇది అతనికి మూడో మ్యాచ్. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌లలో అతను వరుసగా 10, 23 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న శివమ్ సింగ్, ఐపీఎల్ 2025లో ఒక మ్యాచ్ ఆడే అవకాశాన్ని కూడా పొందాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








