U-19 World Cup 2026 : అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ పై ఐసీసీ సంచలన నిర్ణయం
అంతర్జాతీయ క్రికెట్ మండలి వచ్చే ఏడాది జరగబోయే అండర్-19 పురుషుల ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య గ్రూప్ దశలో ఎలాంటి పోరు ఉండబోదు.

U-19 World Cup 2026 : అంతర్జాతీయ క్రికెట్ మండలి వచ్చే ఏడాది జరగబోయే అండర్-19 పురుషుల ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య గ్రూప్ దశలో ఎలాంటి పోరు ఉండబోదు. ఈ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించగా ఇందులో రెండు దేశాలను వేర్వేరు గ్రూపుల్లో ఉంచడం గమనార్హం. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య రాజకీయ సంబంధాలు క్షీణించాయి. దీంతో తరచూ రెండు దేశాల మ్యాచ్‌లను నిలిపివేయాలని డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్, వచ్చే ఏడాది జరగబోయే పురుషుల టీ20 ప్రపంచ కప్‌లలో కూడా ఈ రెండు టీమ్స్ మ్యాచ్‌లకు ఐసీసీ ఆమోదం తెలిపింది. అయితే అండర్-19 స్థాయిలో మాత్రం ఐసీసీ ఈ రెండు టీమ్స్‌ను వేర్వేరు గ్రూపుల్లో ఉంచి, గ్రూప్ దశలో అవి తలపడకుండా చేసింది. గత రెండు అండర్-19 ప్రపంచ కప్‌లలో కూడా భారత్-పాక్ వేర్వేరు గ్రూపుల్లోనే ఉండటం గమనార్హం.
వరల్డ్ కప్ షెడ్యూల్, వేదికలు
ఐసీసీ బుధవారం (నవంబర్ 19) నాడు ఈ వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ టోర్నమెంట్ నమీబియా, జింబాబ్వే దేశాల్లో జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ ప్రపంచ కప్ జనవరి 15న మొదలై, ఫిబ్రవరి 6న ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి, వీటిని 4-4 జట్లతో నాలుగు గ్రూపులుగా విభజించారు.
భారత్, పాకిస్తాన్ గ్రూపులు
రికార్డు స్థాయిలో అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టును గ్రూప్ A లో ఉంచారు.
గ్రూప్ A (భారత్): ఇందులో టీమ్ ఇండియాతో పాటు న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అమెరికా ఉన్నాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్ జింబాబ్వేలోని బులావయోలో భారత్, అమెరికాల మధ్య జరగనుంది.
గ్రూప్ B (పాకిస్తాన్): పాకిస్తాన్‌ను ఆతిథ్య జట్టు జింబాబ్వే, ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌లతో పాటు ఈ గ్రూప్‌లో ఉంచారు.
గ్రూప్ C: ఇందులో ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్, జపాన్, శ్రీలంక ఉన్నాయి.
గ్రూప్ D: ఈ గ్రూప్‌లో టాంజానియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి.
టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్
గ్రూప్ దశలో టీమిండియా ఆడబోయే కీలక మ్యాచ్‌ల షెడ్యూల్ ఇది
జనవరి 15: భారత్ vs యుఎస్ఏ (బులావయో)
జనవరి 17: భారత్ vs బంగ్లాదేశ్ (బులావయో)
జనవరి 24: భారత్ vs న్యూజిలాండ్ (బులావయో)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




