Vaibhav Suryavanshi: పాముల పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు.! ఆ సిక్స్‌తోనే బొక్కబోర్లాపడిన వైభవ్.. ఎలాగంటే.?
రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో ఫెయిల్ అయ్యాడు. పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. సిక్సర్లు కొట్టడం వెనుక రహస్యం అడిగిన ఓ బౌలర్ అతడ్ని అవుట్ చేశాడు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి..

ఒమన్‌ను ఓడించి రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో ఇండియా-ఏ సెమీఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో ప్రభావం చూపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 13 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లుతో 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే.! ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్.. అతడి దగ్గర నుంచి సిక్సర్లు ఎలా కొట్టాలో నేర్చుకుని.. మడతెట్టేశాడు. నవంబర్ 18న దోహాలో జరిగిన ఈ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యచేధనను చేజ్ చేసే క్రమంలో బరిలోకి దిగిన వైభవ్.. బ్యాటింగ్‌లో బోల్తాపడ్డాడు. టీమిండియా ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో జే ఒడెదారా బౌలింగ్‌లో వైభవ్ అవుట్ అయ్యాడు. ఆర్యన్ బిష్ట్ క్యాచ్ పట్టి.. పెవిలియన్ చేర్చాడు.
సిక్స్ రహస్యం అడిగి.. సైడ్ ఇచ్చారు..
ఇండియా-ఏతో మ్యాచ్‌కు ముందు, డెహ్రాడూన్‌కు చెందిన ఒమన్ క్రికెటర్ ఆర్యన్ బిష్ట్ ఓ ఇంటర్వ్యూలో.. వైభవ్ సూర్యవంశీని కలవాలని తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. కేవలం 14 సంవత్సరాల వయసులో అతను లాంగ్ సిక్సర్లు ఎలా కొట్టగలిగాడో తెలుసుకోవాలనుకున్నాడు. ఒమన్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆ రహస్యాన్ని కనుగొన్న బిష్ట్.. వైభవ్ అవుట్ అవ్వడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, ఒమన్ మ్యాచ్‌లో ఇండియా-ఏ చివరికి 6 వికెట్ల తేడాతో గెలిచింది.




