8 జట్ల తరపున బరిలోకి.. రూ. 25 కోట్ల శాలరీ.. కట్‌చేస్తే.. టీమిండియా ఛీ కొట్టిన ఈ ‘ఫ్యూచర్ జహీర్ ఖాన్’ ఎవరంటే?
Jaydev Unadkat: భారత క్రికెట్‌లో ఒకప్పుడు తదుపరి జహీర్ ఖాన్‌గా ప్రశంసలు అందుకున్న ఒక అద్భుతమైన బౌలర్, ప్రస్తుతం సెలెక్టర్ల నిర్లక్ష్యానికి గురై జట్టుకు దూరమయ్యాడు. ప్రమాదకరమైన యార్కర్లు, బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ఐపీఎల్‌లో ఏకంగా ఎనిమిది జట్లకు ప్రాతినిధ్యం వహించి కోట్ల రూపాయలు గడించినా, జాతీయ జట్టులో మాత్రం సుదీర్ఘ కాలంగా అనామకుడిగానే ఉండిపోయాడు.

Jaydev Unadkat: భారత జట్టులోకి మెరుపులా వచ్చి, ఆపై కనుమరుగైన ఆటగాళ్లలో జయదేవ్ ఉనద్కత్ ఒకడు. ఒకప్పుడు టీమ్ ఇండియా భవిష్యత్తు ఆశాకిరణంగా కనిపించిన ఈయనను, సెలెక్టర్లు ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారు. పాల నుంచి ఈగను తీసి పారేసినట్లుగా, ఉనద్కత్‌ను జట్టు నుంచి వెలివేసిన తీరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చివరిసారిగా 2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో కనిపించిన ఈ సౌరాష్ట్ర కెప్టెన్, అప్పటి నుంచి మళ్ళీ నీలి రంగు జెర్సీని ధరించే అవకాశం పొందలేదు.
ఐపీఎల్‌లో అరుదైన రికార్డు..
జయదేవ్ ఉనద్కత్ ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఏకంగా 8 వేర్వేరు జట్లకు ఆయన ఆడాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్న ఆయన, గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ వేలం ద్వారా ఆయన ఇప్పటివరకు సుమారు రూ. 25.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం విశేషం.
గణాంకాలు, అంతర్జాతీయ ప్రయాణం..
2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఉనద్కత్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ టీమ్ ఇండియాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఇప్పటివరకు ఆయన భారత్ తరపున:
టెస్టులు: 4 మ్యాచ్‌లు – 3 వికెట్లు
వన్డేలు: 8 మ్యాచ్‌లు – 9 వికెట్లు
టీ20లు: 10 మ్యాచ్‌లు – 14 వికెట్లు
మూడు ఫార్మాట్లలో కలిపి కేవలం 22 మ్యాచ్‌లే ఆడే అవకాశం లభించడం ఆయన దురదృష్టమనే చెప్పాలి. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించినా, జాతీయ స్థాయిలో మాత్రం ఆయనకు రావాల్సిన గుర్తింపు దక్కలేదు.
ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉండి, ఐపీఎల్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న ఆటగాడిగా ఉన్నప్పటికీ, భారత జట్టులో చోటు దక్కకపోవడం ఉనద్కత్ కెరీర్‌లో పెద్ద లోటు. 33 ఏళ్ల వయసులో ఉన్న ఈ బౌలర్ మళ్ళీ భారత జట్టులోకి పునరాగమనం చేస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
