AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 CSK : సీఎస్‌కేకు బిగ్ షాక్.. కాలు విరిగి ఐపీఎల్ 2026 నుంచి యువ ఆల్‌రౌండర్ అవుట్

IPL 2026 CSK : చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ కాలు విరగడంతో ఐపీఎల్ 2026 నుంచి తప్పుకున్నాడు. ముంబై మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. రామకృష్ణ ఘోష్ దూరం కావడంపై చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

IPL 2026 CSK  : సీఎస్‌కేకు బిగ్ షాక్.. కాలు విరిగి ఐపీఎల్ 2026 నుంచి యువ ఆల్‌రౌండర్ అవుట్
Ramakrishna Ghosh
Rakesh
|

Updated on: May 04, 2026 | 6:31 AM

Share

IPL 2026 CSK : ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేలా కనిపించడం లేదు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టుకు గాయాల బెడద కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ తీవ్ర గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో గైక్వాడ్ సేనకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో రామకృష్ణ ఘోష్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లోనే డేంజర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేసి తన సత్తా చాటాడు. అంతేకాదు విల్ జాక్స్ కొట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ను పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, అదే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కుడి కాలుకు తీవ్రమైన గాయమైంది. పరీక్షల అనంతరం కాలు విరిగినట్లు (ఫ్రాక్చర్) నిర్ధారణ కావడంతో, అతను ఈ సీజన్ మొత్తానికి దూరమవుతున్నట్లు సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

రామకృష్ణ ఘోష్ దూరం కావడంపై చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక అద్భుతమైన ఆల్‌రౌండర్‌ను మేం కోల్పోయాం. తన తొలి మ్యాచ్‌లోనే మంచి టాలెంట్ చూపించాడు. అతను జట్టులో ఉంటే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలం ఉండేది. కానీ గాయాలు మా చేతుల్లో లేవు” అని ఫ్లెమింగ్ పేర్కొన్నారు. 2025 మెగా వేలంలో చెన్నై రామకృష్ణను కొనుగోలు చేసి, ఈ ఏడాది రిటైన్ చేసుకుంది. ఇప్పుడు అతను లేకపోవడం జట్టు సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది.

ఈ సీజన్‌లో చెన్నైని గాయాలు వెంటాడుతున్నాయి. టోర్నీ మొదలవ్వక ముందే ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ తప్పుకోగా, ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ గాయపడ్డాడు. స్టార్ ఓపెనర్ ఆయుష్ మ్హాత్రే కూడా హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. వీరందరి కంటే ముఖ్యంగా ఎంఎస్ ధోనీ కాలి గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

రామకృష్ణ ఘోష్ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. కీలక ప్లేయర్లు దూరం అవుతుండటంతో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై టీమ్ ఇప్పుడు కష్టాల్లో పడింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన ఆటగాళ్లు అద్భుతాలు చేయాల్సిందే. మరోవైపు రామకృష్ణ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us