బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో రాబోయే రోజుల్లో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలు జారీ అయ్యాయి. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటగా, భారీ వర్షాలు, ఈదురుగాలులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. అరేబియా సముద్రం గుండా ప్రయాణిస్తూ సోలాపూర్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం మీదుగా పారాదీప్, ధన్‌బాద్, ముజఫర్‌పూర్ ప్రాంతాలకు ఇవి విస్తరిస్తున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు రుతుపవనాలు మరింతగా ముందుకు సాగడానికి అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వీటి కదలికల వల్ల రాబోయే రోజుల్లో వర్షపాతం గణనీయంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు మధ్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండి, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో జూన్ 15 సోమవారం నాడు మధ్యాహ్నం వరకూ ఎండ ప్రభావం ఉండి, సాయంత్రం సమయంలో హైదరాబాద్, మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కాస్త ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సమాచారం ప్రకారం.. సోమవారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సూర్యేపేట, వికారాబాద్, వరంగల్, వనపర్తి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూలు, నారాయణపేట ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో కూడిన పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఇక.. ఆదివారం తెలంగాణ లో ఉష్ణోగ్రతలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. జూన్ నెలలో సాధారణం కంటే చాలా ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హీట్ అలర్ట్ జారీ చేసింది.ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కంటే 4.5°C ఎక్కువగా, అంటే అత్యధికంగా 40.3°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రామగుండంలో 40.2°C, ఖమ్మంలో 40.0°C గా ఎండలు దంచికొడుతున్నాయి. నిజామాబాద్‌లో 39.5°C, హనుమకొండలో 39.0°C, నల్గొండలో 38.0°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఖమ్మంలో 3.2°C, రామగుండంలో 2.6°C మేర వేడి పెరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఉష్ణోగ్రత 35.0°C గా నమోదై సాధారణ స్థితిలోనే ఉంది. భద్రాచలం, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ఎండలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు ఆదివారం వర్షాలు దంచికొట్టాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పాలచెట్టు సమీపంలోని సోలార్ పవర్ ప్లాంట్ వద్ద 42.5 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. అలాగే నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ (సైనగర్) లో 32.0 మి.మీ., నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పులిచెర్లలో 30.8 మి.మీ. వర్షం కురిసింది. కుమురం భీం జిల్లా తిర్యాణిలో 27.5 మి.మీ., నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లైర్‌లో 24.5 మి.మీ., నల్గొండ జిల్లా యాచారంలో 23.3 మి.మీ. చొప్పున వర్షం పడింది. మహబూబ్‌నగర్ జిల్లా మొహమ్మదాబాద్‌లో 23.0 మి.మీ., సూర్యాపేట జిల్లా రెడ్డిగూడలో 22.5 మి.మీ., నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్, మంచిర్యాల జిల్లా అందుగులపేటల్లో చెరో 22.0 మి.మీ. వర్షం కురియగా, నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో 20.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం గుండా సోలాపూర్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం మీదుగా పారాదీప్, ధన్‌బాద్, ముజఫర్‌పూర్ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.రాబోయే నాలుగైదు రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రోజుల్లో వీటి కదలికలతో వర్షపాతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా దక్షిణ తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ గుర్తించింది. అయితే నిన్నటి వరకు ఉత్తర కోస్తా తమిళనాడు పై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు పూర్తిగా బలహీనపడింది. దాదాపుగా 11 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద నిన్నటి వరకు కొనసాగిన గాలుల కోత తీవ్రత కూడా ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. నైరుతి రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ ద్రోణి ప్రభావం కారణంగా సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు దూరంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయానికి పలు జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 38 మి.మీ. వర్షం కురిసింది. అదే జిల్లాలోని గుర్లలో 35.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాయలసీమ ప్రాంతమైన శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో 33 మి.మీ. వర్షం పడగా, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా లావేరులో 32 మి.మీ., మన్యం జిల్లా సీతంపేటలో 32 మి.మీ. వర్షం కురిసింది. అలాగే శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 30.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఆదివారం రాత్రి కురిసిన కుండపోత భారీ వర్షాలు తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. వానల తాకిడికి మండలంలోని వగరూరు చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయింది. నీటి ఉధృతి ఎక్కువ కావడంతో చెరువు కట్టకు ఒక్కసారిగా గండి పడింది. చెరువు నీరు గ్రామాల వైపు దూసుకువచ్చే ప్రమాదం ఉండటంతో వగరూరు, తిమ్మాపురం గ్రామస్థులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక అధికారులు రంగంలోకి దిగి గండిని పూడ్చేందుకు, నష్టాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. కర్నూలు తుంగభద్ర డ్యామ్‌కి ఈ సీజన్‌లో మొదటిసారిగా వరద మొదలైంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 365 క్యూసెక్కులు ఉంది. అన్ని గేట్లు కొత్తవి అమర్చిన తర్వాత డ్యామ్ పటిష్టంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 105 టీఎంసీలగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి టీబీ డ్యామ్‌కి ఇన్ ఫ్లో 8 వేల 269 క్యూసెక్కులు ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా! అంబానీ కోడలు రాధిక ఏం చెప్పారో తెలుసా?
పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..
రండి బాబూ రండి.. ప్రభుత్వ స్కూల్లో చేరండి.. గ్రామాల బాట పట్టిన బడిపంతుళ్లు.. డప్పు కొడుతూ..
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!
పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..
రండి బాబూ రండి.. ప్రభుత్వ స్కూల్లో చేరండి..
ఎద్దు స్థానంలో పొలం దున్నిన మహిళ.. ఆ తర్వాత!
బర్త్ డే రోజున కేక్ కొంటున్నారా.. అయ్యబాబోయ్..ఇది చూస్తే..

