AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ చరిత్రలోనే వింత.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్.. ఆస్ట్రేలియాలో ఐపీఎల్‌కు రంగం సిద్ధం..!

BBL in India: దేశాల సరిహద్దులు దాటి క్రికెట్ లీగ్‌లు విస్తరిస్తున్న తీరు క్రీడా ప్రపంచంలో సరికొత్త విప్లవానికి సంకేతం. ఆస్ట్రేలియా పిచ్‌లపై మన ఆటగాళ్లు అదరగొట్టడం చూశాం, కానీ ఆస్ట్రేలియా దేశీ టోర్నీ మన చెన్నై వేదికగా జరగడం నిజంగా ఒక వింతైన, అద్భుతమైన అనుభూతి. ఈ సరికొత్త ప్రయోగం ఎలాంటి విజయాలను అందుకుంటుందో, అభిమానులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

క్రికెట్ చరిత్రలోనే వింత.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్.. ఆస్ట్రేలియాలో ఐపీఎల్‌కు రంగం సిద్ధం..!
Bbl In India, Ipl In Australia
Venkata Chari
|

Updated on: Jul 10, 2026 | 11:28 AM

Share

IPL in Australia: క్రికెట్ ప్రపంచంలో ఎవరూ ఊహించని ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవబోతోంది. ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ ‘బిగ్ బాష్ లీగ్’ (BBL) తొలిసారి భారత గడ్డపై అడుగుపెడుతుంటే.. భారతీయుల గుండె చప్పుడు ‘ఐపీఎల్‘ (IPL) మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్‌గా మారింది.

చైన్నై వేదికగా ఆస్ట్రేలియా సమరం..!

క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాబోయే 2026-27 బిగ్ బాష్ లీగ్ సీజన్ ప్రారంభ మ్యాచ్‌ను భారతదేశంలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 12న చెన్నైలోని చారిత్రాత్మక ఎంఏ చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్ల మధ్య ఈ చారిత్రాత్మక పోరు జరగనుంది. ఆస్ట్రేలియా వెలుపల, ముఖ్యంగా భారత గడ్డపై ఒక బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా కాలమానానికి అనుగుణంగా ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:40 గంటలకే ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి: గౌతమ్ గంభీర్‌కి గుడ్ బై.. కొత్త కోచ్ రేసులో ముగ్గురు దిగ్గజాలు.. సంచలన నిర్ణయం దిశగా బీసీసీఐ..?

ఇవి కూడా చదవండి

భారత్‌ను ఎంచుకోవడానికి అసలు కారణం ఇదే..

క్రికెట్‌ను ఒక మతంగా, ఆటగాళ్లను దేవుళ్లుగా ఆరాధించే కోట్ల మంది అభిమానులు ఉన్న భారతదేశంలో ఈ లీగ్‌ను ప్రదర్శించడం ద్వారా సరికొత్త మార్కెట్‌ను సృష్టించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా లీగ్‌కు భారత్‌లో భారీగా ఆదరణ ఉంది. చెన్నై స్టేడియానికి దాదాపు 38,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉంది. అంతేకాకుండా, ఇక్కడి అభిమానులు కేవలం స్వదేశీ ఆటగాళ్లనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌ను, మంచి ప్రతిభను మనస్ఫూర్తిగా అభినందిస్తారనే మంచి పేరుంది. ఈ మ్యాచ్ ద్వారా భారీగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి, లీగ్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం చేయాలనేది ఆస్ట్రేలియా బోర్డు అసలు వ్యూహం.

బదులుగా ఆస్ట్రేలియాకు ఐపీఎల్ పండుగ..!

క్రికెట్ ఆస్ట్రేలియా వేసిన ఈ ముందడుగు కేవలం ఏకపక్షం కాదు. దీనికి ప్రతిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం ఒక సంచలన నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ‘ది ఏజ్’ పత్రిక కథనం ప్రకారం.. భవిష్యత్తులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోని కొన్ని లీగ్ మ్యాచ్‌లను ఆస్ట్రేలియా గడ్డపై నిర్వహించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇదే కనుక నిజమైతే, ప్రతి ఏటా భారత్‌లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్, ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడం ఒక ఆనవాయితీగా మారే అవకాశం ఉంది. ఇది రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది.

ఇది కూడా చదవండి: వాడిని వద్దని చెప్పినా అంటగట్టేశారు.. వాని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..

ఎక్కడ వీక్షించవచ్చు..?

ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను భారత్‌లోని క్రీడాభిమానులు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ‘జియో స్టార్’ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. ఆస్ట్రేలియాలోని అభిమానుల కోసం ఛానల్ సెవెన్, ఫాక్స్ క్రికెట్ వంటి ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐపీఎల్ ద్వారా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత్‌కు ఇప్పుడు ఆస్ట్రేలియా బోర్డు స్వయంగా తరలిరావడం భారత క్రికెట్ మార్కెట్ సత్తాను ప్రపంచానికి చాటిచెబుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us