PM Modi: 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానం.. 75 గంటలపాటు ‘మోదీ జాతర’.. ఎక్కడంటే..
Modi Jatara: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 75 అడుగుల మోదీ కటౌట్‌ను ఆవిష్కరించడంతో పాటు 1,000 మంది వేద పండితులతో ఆశీర్వచనం నిర్వహించారు. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా 75 గంటల ‘మోదీ జాతర’కు శ్రీకారం చుట్టారు.

తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం, ఆయన 25 సంవత్సరాల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ తారకరామా స్టేడియంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పణతల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 75 అడుగుల భారీ ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తూ 1,000 మంది వేద పండితులతో ప్రత్యేక వేద ఆశీర్వచనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశ్రీశ్రీ మాతంగి మహా పీఠాధిపతి నందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందించారు. అలాగే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా 75 గంటల పాటు నిరంతరాయంగా నిర్వహించనున్న వినూత్న ‘మోదీ జాతర’ (డప్పు మోత) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పణతల సురేష్, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన, అభివృద్ధి చెందుతున్న దేశంగా సగర్వంగా ముందుకు సాగుతోందన్నారు. సమాజంలోని చిట్టచివరి నిరుపేద పౌరుడి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
రాజకీయాలు, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయుడిని తన కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. దేశ ప్రయోజనమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమం ప్రజల సంక్షేమానికి దోహదపడుతోందన్నారు.
