ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ లారీ కింద నలిగిన డీసీఎం.. ముగ్గురు మృతి!
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాచేపల్లి మండలం గామాలపాడు సమీపంలోని గోదాముల వద్ద రెండు భారీ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న డీసీఎం లారీని, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్న మట్టి లోడు కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న డీసీఎం లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కంటైనర్ లారీ డీసీఎం వాహనంపై పడిపోయింది. దీంతో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై అడ్డంగా పడిపోయిన భారీ వాహనాలను తొలగించి, మృతదేహాలతో పాటు క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రమాదానికి అతివేగమా? డ్రైవర్ల నిర్లక్ష్యమా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..