AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

0-3తో ఘోర పరాభవం.. ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త ప్లేయింగ్ 11 అంటూ ఫ్యాన్స్ ఫైర్..

India vs England 4th T20I: యువ ఆటగాళ్లకు అవకాశాల పేరిట సీనియర్లను, ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం వల్లే భారత్‌కు ఈ గతి పట్టిందని స్పష్టమవుతోంది. బీసీసీఐ తక్షణమే స్పందించి జట్టు ఎంపిక విధానాన్ని మార్చకపోతే, రాబోయే రోజుల్లో భారత క్రికెట్ మరిన్ని దారుణమైన పరాజయాలను చవిచూడాల్సి వస్తుంది.

0-3తో ఘోర పరాభవం.. ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త ప్లేయింగ్ 11 అంటూ ఫ్యాన్స్ ఫైర్..
Ind Vs Eng Series
Venkata Chari
|

Updated on: Jul 10, 2026 | 6:44 AM

Share

India vs England 4th T20 Highlights: భారత క్రికెట్ జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ చేతులెత్తేసిన భారత్, ఇంగ్లండ్‌కు సిరీస్‌ను సమర్పించుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

అట్టర్ ఫ్లాప్ బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ కోసం సంజూ శాంసన్‌కు మొండిచేయి..!

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌గా వచ్చిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ వంటి మేటి ఆటగాడిని పక్కనపెట్టి మరీ ఇతనికి అవకాశమిస్తే, వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 4 పరుగులకే వెనుదిరగ్గా, స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ 16 పరుగులకే ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

మరోవైపు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 5 పరుగులకే అవుటై తన ఫామ్‌లేమిని చాటుకున్నాడు. అసలు ఇతడిని జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారో దేవుడికే తెలియాలంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శివమ్ దూబే (22 పరుగులు) కొద్దిసేపు నిలబడినా వేగంగా ఆడలేకపోయాడు.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం.. ఒకే ఒక్కడు!

ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సింహంలా పోరాడాడు. 49 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ చేసిన ఈ పరుగుల వల్లే భారత్ కనీసం ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది.

భారత బౌలర్లను చెడుగుడు ఆడుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు..!

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు మన బౌలర్లు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. అర్ష్‌దీప్ సింగ్ తన రెండో ఓవర్లో జోస్ బట్లర్‌ను అవుట్ చేసినా, ఆ తర్వాత ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ కలిసి భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. ప్రిన్స్ యాదవ్ వేసిన తొలి ఓవర్లోనే 15 పరుగులు రాబట్టారు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ 3 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

ముఖ్యంగా స్పిన్నర్లు అక్షర్ పటేల్ (2 ఓవర్లలో 24 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (1 ఓవర్లో 19 పరుగులు), శివమ్ దూబే (1 ఓవర్లో 15 పరుగులు) ధారాళంగా పరుగులు సమర్పించుకుని ఇంగ్లండ్ విజయాన్ని మరింత సులువు చేశారు. ఫిల్ సాల్ట్ (59 నాటౌట్), హ్యారీ బ్రూక్ (75 నాటౌట్) కేవలం 13.5 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ కోల్పోయి మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా ముగించారు.

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు!

కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడిన గత 6 మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం గమనార్హం. అయ్యర్ బ్యాటింగ్‌లో రాణించినా, కెప్టెన్సీ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు కూడా పూర్తిగా బెడిసికొడుతున్నాయి. అసలు గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడా లేడా, ఉంటే ఆటగాళ్లకు ఎలాంటి సలహాలు ఇస్తున్నాడనే అనుమానాలు క్రికెట్ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆడుతున్న జట్టు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన జట్టుగా కనిపిస్తోందని విమర్శకులు పెదవి విరుస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us