AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Rules : ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచిన ఐపీఎల్ రూల్.. గెలవాల్సిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఘోర పరాజయం

IPL Rules : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో కేవలం 1 పరుగు తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. అయితే, ఈ ఓటమికి కేవలం ఆటగాళ్ల ప్రదర్శన మాత్రమే కాదు, ఐపీఎల్‌లోని ఒక విచిత్రమైన నియమం కూడా కారణమని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

IPL Rules : ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచిన ఐపీఎల్ రూల్.. గెలవాల్సిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఘోర పరాజయం
David Miller
Rakesh
|

Updated on: Apr 09, 2026 | 6:26 PM

Share

IPL Rules : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో కేవలం 1 పరుగు తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. అయితే, ఈ ఓటమికి కేవలం ఆటగాళ్ల ప్రదర్శన మాత్రమే కాదు, ఐపీఎల్‌లోని ఒక విచిత్రమైన నియమం కూడా కారణమని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మాజీ క్రికెటర్లు సైతం ఈ నిబంధనపై మండిపడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఒక వింత సంఘటన జరిగింది. నితీష్ రాణా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎల్బీడబ్ల్యూ (LBW) అప్పీల్ రావడంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే, ఆ సమయంలో రాణా ఒక పరుగు పూర్తి చేశాడు. కానీ నితీష్ రాణా రివ్యూ తీసుకోగా, బంతి గ్లోవ్స్‌కు తగిలిందని తేలింది. డీఆర్ఎస్‌లో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నాటౌట్ ప్రకటించాడు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఐసీసీ నియమం ప్రకారం అంపైర్ అవుట్ అని వేలు ఎత్తగానే ఆ బంతి డెడ్ అయినట్లు లెక్క. దీంతో రాణా తీసిన ఆ ఒక్క పరుగును స్కోరు బోర్డులో చేర్చలేదు. ఒకవేళ ఆ రన్ ఇచ్చి ఉంటే మ్యాచ్ టై అయ్యేది లేదా ఢిల్లీ గెలిచేది. ఈ నిబంధనను మార్చాలని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పట్టించుకోకపోవడం ఇప్పుడు ఢిల్లీకి శాపంగా మారింది.

కేవలం రూల్ మాత్రమే కాదు, ఆఖరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ తీసుకున్న నిర్ణయం కూడా అందరినీ విస్మయానికి గురిచేసింది. ఢిల్లీ గెలవాలంటే చివరి ఓవర్లో 13 పరుగులు కావాలి. మిల్లర్ అప్పటికే మంచి ఊపులో ఉన్నాడు. చివరి రెండు బంతులకు 2 పరుగులు అవసరమైన దశలో.. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఐదో బంతిని మిల్లర్ ఆడాడు. కానీ విచిత్రంగా ఆయన పరుగు తీయడానికి నిరాకరించాడు. తనే స్ట్రైకింగ్‌లో ఉండి చివరి బంతికి ఫోర్ లేదా సిక్స్ కొట్టి గెలిపించాలనే అతివిశ్వాసంతో ఆయన పరుగు తీయలేదు. కనీసం ఆ రన్ తీసుంటే స్కోరు సమమయ్యేది.

చివరి బంతికి 2 పరుగులు కావాలి. మిల్లర్ కనీసం బంతిని తాకలేకపోయాడు. కనీసం బై రన్ తీసి మ్యాచ్‌ను టై చేద్దామని నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్ వేగంగా పరిగెత్తాడు. కానీ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అప్రమత్తంగా ఉండి కుల్దీప్‌ను రన్ అవుట్ చేశాడు. దీంతో గెలుపు ముంగిట ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడినప్పటికీ, అదృష్టం ఢిల్లీ వైపు లేదు.

ఈ మ్యాచ్ ఫలితం తర్వాత ఐపీఎల్ నిబంధనలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల ఒక పరుగు కోల్పోవడం ఏ రకమైన న్యాయమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అభిజిత్ గంగూలీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఆటగాళ్ల కష్టానికి ఫలితం దక్కకుండా ఇలాంటి సాంకేతిక నిబంధనలు అడ్డురావడం క్రికెట్ స్ఫూర్తికే విరుద్ధమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us