AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తనను జైలుకు పంపమని వేడుకున్నా పోలీసులు వినడం లేదని..

హైదరాబాద్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ అస్లాం ప్రాణభయంతో తనను జైలుకు పంపించాలని వారం రోజులుగా పోలీసులను వేడుకున్నాడు. పోలీసులు నిరాకరించడంతో ఉద్దేశపూర్వకంగా ఓ హోటల్‌లో బీభత్సం సృష్టించి, ఆస్తులను ధ్వంసం చేశాడు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad: తనను జైలుకు పంపమని వేడుకున్నా పోలీసులు వినడం లేదని..
Sheikh Aslam
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2026 | 1:19 PM

Share

సాధారణంగా నేరం చేసినవారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. జైలు శిక్ష తప్పించుకునేందుకు ఎన్నో మార్గాలు వెతుకుతారు. కానీ హైదరాబాద్‌లో ఓ రౌడీషీటర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించాడు. “బయట ప్రాణభయం ఉంది.. నన్ను జైలుకు పంపించండి సార్.. అక్కడే ప్రశాంతంగా ఉంటాను” అంటూ వారం రోజులుగా పోలీసులను వేడుకున్నాడు. చివరకు తన కోరిక నెరవేరాలంటే నేరం చేయాల్సిందేనని భావించి హోటల్‌లో బీభత్సం సృష్టించి పోలీసుల చేతికి చిక్కాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగాపురా ప్రాంతానికి చెందిన షేక్ అస్లాంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ నమోదైంది. ఇటీవల తన ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన అస్లాం తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. బయట తిరిగితే ఎప్పుడు, ఎక్కడ తనపై దాడి జరుగుతుందోనన్న ఆందోళనతో జైలులోనే ఉండటం సురక్షితమని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత వారం రోజులుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని పోలీసులను కోరాడు. అయితే ఎలాంటి నేరం చేయని వ్యక్తిని కేవలం అతడి అభ్యర్థన మేరకు అరెస్ట్ చేయడం చట్టపరంగా సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేసి తిరిగి పంపించేవారు.

దీంతో ఎలాగైనా జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతో అస్లాం మంగళవారం సాయంత్రం ఆగాపురాలోని చార్‌కందీల్ ప్రాంతంలో ఉన్న ఓ సెంట్రల్ హోటల్ అండ్ బేకరీకి వెళ్లాడు. అక్కడ సిబ్బందితో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగాడు. అనంతరం హోటల్‌లోని వంట పాత్రలు, గ్యాస్ సిలిండర్లను బయటకు విసిరేసి బీభత్సం సృష్టించాడు. బేకరీ కౌంటర్‌కు అమర్చిన అద్దాలను ధ్వంసం చేయడంతో అక్కడున్న కస్టమర్లు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు.

ఈ సందర్భంగా “నన్ను చంపేందుకు కొందరు వెంబడిస్తున్నారు.. నేను జైలులోనే సురక్షితంగా ఉంటాను.. అందుకే ఇలా చేస్తున్నా” అంటూ అస్లాం పెద్దగా కేకలు వేస్తూ విధ్వంసానికి పాల్పడ్డాడు. హోటల్ యాజమాన్యం సమాచారం మేరకు హబీబ్‌నగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అస్లాంను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల విచారణలో షేక్ అస్లాంపై ఇప్పటికే నగరంలోని హబీబ్‌నగర్, సైఫాబాద్, సనత్‌నగర్, బేగంపేట, హుమాయున్‌నగర్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 13 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడైంది. తాజా ఘటనలో హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని జైలుకు పంపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us