Asif Ali : నేను రోజుకు 150సిక్సర్లు కొడతాను.. మరి అలాంటోడివి రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చావు బాసూ !
ఆసియా కప్ 2025 ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, పాకిస్తాన్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఒకరు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏసియా కప్ 2022లో పాకిస్తాన్ జట్టులో ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆసిఫ్ అలీ, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు.

Asif Ali : ఆసియా కప్ 2025 ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందుగానే పాకిస్తాన్‌కు చెందిన ఒక స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసియా కప్ 2022లో పాకిస్తాన్ జట్టులో ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆసిఫ్ అలీ, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. గత రెండు సంవత్సరాలుగా పాకిస్తాన్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆసిఫ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ 2018లో అరంగేట్రం చేసి, పాకిస్తాన్ తరపున వన్డే, టీ20 ఫార్మాట్‌లలో మొత్తం 79 మ్యాచ్‌లు ఆడాడు.
33 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్
33 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఆసిఫ్ అలీ సోమవారం, సెప్టెంబర్ 1న తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసిఫ్ తన ప్రకటనలో “ఈ రోజు నేను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. పాకిస్తాన్ జెర్సీ ధరించడం నా జీవితంలో అతిపెద్ద గౌరవం. మైదానంలో నా దేశానికి సేవ చేయడం నాకు చాలా గర్వకారణం” అని రాశాడు. ఆసిఫ్ అలీ తన సహచరులకు, కోచింగ్ సిబ్బందికి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
రోజుకు 150 సిక్సర్లు కొడతా
ఆసిఫ్ అలీ 2018లో పాకిస్తాన్ తరపున టీ20 క్రికెట్‌లో, అదే సంవత్సరం వన్డే క్రికెట్‌లో కూడా అరంగేట్రం చేశాడు. ఆసిఫ్ అలీ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. ఈ నైపుణ్యంతోనే అతను పాకిస్తాన్ జట్టులో వరుసగా అవకాశాలు పొందాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్‌లో, ఫినిషర్ పాత్రలో అతనికి అవకాశాలు ఇచ్చారు. కానీ అతను ఈ పాత్రను సరిగ్గా నిర్వర్తించలేకపోయాడు. ఒకట్రెండు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు మినహా చాలా సందర్భాలలో జట్టును నిరాశపరిచాడు.
ఆసిఫ్ అలీకి ఈసారి ఆసియా కప్‌లో చోటు దక్కలేదు. కానీ 2022లో యూఏఈలో జరిగిన టీ20 ఆసియా కప్‌లో అతను పాకిస్తాన్ జట్టులో భాగం. ఆ టోర్నమెంట్‌కు ముందు, తాను రోజు ప్రాక్టీస్ సమయంలో 150 సిక్సర్లు కొట్టగలనని చెప్పాడు. దీని తర్వాత టోర్నమెంట్‌లో అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించారు. కానీ, అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో గెలిపించడం తప్ప అతను పెద్దగా ఏమీ చేయలేకపోయాడు. భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలో 15 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా, 2022 టీ20 ప్రపంచ కప్‌లో కూడా టీమిండియాపై కేవలం 2 పరుగులకే అవుటయ్యాడు.
ఆసిఫ్ అలీ కెరీర్ ఎలా ఉందంటే..
2018లో పాకిస్తాన్ జట్టులో అరంగేట్రం చేసిన ఆసిఫ్ అలీ గత 2 సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను తన చివరి టీ20 మ్యాచ్ అక్టోబర్ 2023లో, చివరి వన్డే మ్యాచ్ ఏప్రిల్ 2022లో ఆడాడు. మొత్తం మీద ఆసిఫ్ పాకిస్తాన్ తరపున 58 టీ20 మ్యాచ్‌లలో 15 సగటు, 133 స్ట్రైక్ రేట్‌తో కేవలం 577 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే, 21 వన్డే మ్యాచ్‌లలో 25 సగటుతో కేవలం 382 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




