అరుణాచలం, సింహాచలం తరహాలో యాదాద్రిలో గిరి ప్రదక్షణ.. ఈ నెల నుంచే ప్రారంభం..!
అరుణాచలం గిరి ప్రదక్షణ 14కిలోమీటర్లు ఉండగా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షణ ఐదు కిలోమీటర్లు ఉంటుంది. లక్ష్మీనారసింహుని గిరికి గిరిప్రదక్షిణా విధిని ఏర్పాటు చేయటం ఈ ఆలయానికి మరింత శోభ రానుంది. గిరిప్రదక్షిణలో భక్తుల సంకీర్తనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరయనుంది.
Yadagirigutta Temple: గుడికి వెళ్లిన వారు ముందుగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆలయంలోపలికి వెళ్లడం ఆనవాయితీ. తాము దర్శించే దేవస్థానం ఉన్న క్షేత్రానికంతటికీ ప్రదక్షిణ చేయటం సంప్రదాయం. గిరి ప్రదక్షిణ అనగానే మనకు గుర్తుకువచ్చేది 14 కిలోమీటర్ల అరుణాచల గిరిప్రదక్షిణ. మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఏళ్లుగా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ యాదాద్రి గిరి ప్రదక్షణకు కూడా అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
యాదగిరిగుట్ట కొండపై జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు స్వయంభువులుగా వెలసిన పంచ నారసింహక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి. ఎన్నో ఏళ్లుగా స్థానిక భక్తులు మాత్రమే గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. అయితే 2016లో కోట్లాది రూపాయలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికీ తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలుల వైభవం ఒకేచోట భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా పునర్నిర్మించారు. ఆలయ పూనర్ నిర్మాణంతో గిరి ప్రదక్షణ చేసేందుకు భక్తులకు ఇబ్బందికరంగా మారింది.
ఇటీవల రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే యాదగిరిగుట్టలో ఉన్న పాత ఆచారాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో బాగానే కొండపై స్వామివారి సన్నిధిలో భక్తులకు బస చేసే అవకాశం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం, కొండపైకి ఆటోలను అనుమతించడం వంటి అంశాలను పునరుద్ధరించింది.
అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణ..
యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామివారికి ఇప్పటివరకు స్థానిక భక్తులే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక నుంచి అరుణాచలం, సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరి ప్రదక్షిణ అవకాశాన్ని కల్పించాలని యాదగిరిగుట్ట అధికారులు సంకల్పించారు. స్వామి వారి ఆలయం చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అరుణాచలంతోపాటు తెలుగు రాష్ట్రంలోని సింహాచలం, శ్రీకాళహస్తి, ఇంద్రకీలాద్రి క్షేత్రాల్లో గిరిప్రదక్షిణలు కొనసాగుతున్నాయి.
ఈనెల 18న ఉదయం 5.30 గంటలకు ప్రారంభం..
గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కూడా గిరిప్రదక్షణ పెద్ద ఎత్తున చేపట్టేలా అధికారులు సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఉదయం 5.30గంటలకు స్వామివారి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు ఐదు వేల మందితో ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో భాస్కరరావు చెబుతున్నారు.
రాష్ట్రంలో తొలి గిరి ప్రదక్షణ ఆలయంగా రికార్డు..
అరుణాచలం గిరి ప్రదక్షణ 14కిలోమీటర్లు ఉండగా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షణ ఐదు కిలోమీటర్లు ఉంటుంది. లక్ష్మీనారసింహుని గిరికి గిరిప్రదక్షిణా విధిని ఏర్పాటు చేయటం ఈ ఆలయానికి మరింత శోభ రానుంది. గిరిప్రదక్షిణలో భక్తుల సంకీర్తనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరయనుంది. అయితే ”గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలవనుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..