Srisailam: శ్రీశైలం కుంభాభిషేకానికి కుదరని ముహూర్తం.. ఆగిన శ్రీ గిరి శివాజీ గోపురం ప్రారంభోత్సవం

శివాజీ గోపురం. అత్యంత పవిత్ర మహా నిర్మాణం. శక్తిపీఠము, జ్యోతిర్లింగం ఒకే ప్రాంగణంలో కొలువైన శ్రీశైల మహా క్షేత్రంలో ఉత్తర ద్వారంలో నిర్మితమైన శివాజీ గోపుర ప్రారంభ క్రతువు ఐదేళ్లయినా పూర్తి కాకపోవడం భక్తులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. చివరకు హైకోర్టు జోక్యం చేసుకునే వరకు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ప్రారంభానికి ఎంత కాలం పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇందుకోసం మహా కుంభాభిషేకం నిర్వహించాలని తలపెట్టి వాయిదా వేయడం పట్ల భక్తులకు మరింత బాధిస్తోంది.

Srisailam: శ్రీశైలం కుంభాభిషేకానికి కుదరని ముహూర్తం.. ఆగిన శ్రీ గిరి శివాజీ గోపురం ప్రారంభోత్సవం
Srisaila Devasthanam
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Feb 02, 2024 | 6:49 AM

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఆలయ ఉత్తరంవైపు పునర్నిర్మించిన శివాజీ గోపురానికి మహా కుంభాభిషేకం నిర్వహించకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణం పూర్తయి ఐదేళ్లు గడిచినా ఈ క్రతువు వాయిదాలు పడుతూ వస్తోంది. గోపురంపై బంగారు తాపడం చేసిన కలశాలను ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సి ఉంది. ఇంత ముఖ్యమైన కార్యాన్ని ప్రతిసారీ వాయిదా వేస్తుండటంతో ఈ వ్యవహారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి చేరింది. విచారణ జరిపిన న్యాయమూర్తులు ముహూర్తం తేదీలను త్వరగా ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది

దేశంలో రెండో జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి తూర్పున శ్రీకృష్ణదేవరాయ గోపురం, పశ్చిమాన బ్రహ్మానందరాయ గోపురం, దక్షిణాన హరిహరరాయ గోపురం, ఉత్తరాన శివాజీ గోపురాలు ఉన్నాయి శివాజీ గోపురం శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మించాలని 2010లో నిపుణుల కమిటీ నిర్ధారించింది. 2011లో వర్షాల వల్ల శివాజీ గోపురం పైభాగం కూలిపోయింది. 2015 లో పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2016లో అప్పటి ఐఏఎస్ అధికారి నారాయణ భరత్ గుప్తా చొరవతో రెండేళ్లలోనే గోపుర పునర్నిర్మాణం పూర్తయింది. గోపురంపై పునఃప్రతిష్టించాల్సిన కలశాలను సిద్ధం చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. కొందరు ఈవోల తప్పిదాల వల్ల మహా కుంభాభిషేకం క్రతువు చిక్కుముడిగా మారింది. అప్పటి నుంచి ఆగిన క్రతువు శివాజీ గోపురానికి మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు గతేడాది ఈవో లవన్న ఆధ్వర్యంలో రూ. కోట్లు వ్యయం చేసి ఏర్పాట్లు చేశారు శివాజీ గోపురంతో పాటు ప్రధానాలయాలు, ఉపాలయాలకు పరంజాలు సిద్దం చేశారు. రంగులతో అలంకారాలు, విద్యుద్దీపాల ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ముహూర్తాలు ఖరారు చేశారు. ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇక ప్రారంభమే తరువాయి అన్న క్షణంలో ముహూర్తం నిర్ణయించే విషయంలో పీఠాదిపతులకు ప్రాధాన్యం ఇవ్వలేదని వివాదం మొదలైంది. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారింది. ఉత్తరాయణంలో చేయాల్సిన కార్యాన్ని దక్షిణాయనంలో (కార్తికమాసం) చేస్తామని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ప్రకటించి అగ్నికి ఆజ్యం పోశారు. అప్పటినుండి వాయిదాలు పడుతూ వస్తున్న కర్నూలు చెందిన లింగాయత్ సంఘం అధ్యక్షుడు కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేశారని సకాలంలో కుంభాభిషేకం జరిపించాలని కోర్టుని ఆశ్రయించగా ఇప్పుడు కధ మళ్లీ మొదటికొచ్చింది. ఉన్నత న్యాయస్థానం కూడా మహా కుంభాభిషేకానికి ముహూర్తాలు ఖరారు చేసి వెంటనే కోర్టుకు సమర్పించాలని దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణకు శ్రీశైల దేవస్థానం ఈవో పెద్దిరాజుకు ఉత్తర్వులు జారీ చేశారు.

మహా కుంభాభిషేకం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఎందుకంటే

ఆలయాల పునర్నిర్మాణం, కుంభాభిషేకాలు, ప్రారంభోత్సవాల వంటి క్రతువులు చేపట్టడానికి శాస్త్ర ప్రకారం ఉత్తరాయణం, దక్షణాయనం కాలాలను పరిగణలోకి తీసుకోవాలి. మహాకుంభాభిషేకం వంటి క్రతువులను ఉత్తరాయణ పుణ్యకాలంలోనే నిర్వహించడం శుభకరమని పండితులు చెబుతున్నారు. శాస్త్ర ప్రకారం దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనాన్ని రాత్రిగా అభివర్ణిస్తారు.

ఇవి కూడా చదవండి

ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమైన కాలం కనుక పునర్నిర్మాణ పనులు, మహాకుంభాభిషేకం వంటి క్రతువుల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం ఈనెల నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. జూలై వరకు ఈ ఘడియలు ఉన్నాయి ఆ తర్వాత దక్షిణాయనం ఆరంభం కానుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..