Andhra Pradesh: రాములోరికి గోటి తలంబ్రాలు.. కోటి ఆక్షితలు, భద్రాద్రితోపాటు ఒంటిమిట్టకు కూడా..
ఏప్రిల్ 17న శ్రీరామ నవమిని ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజు శిల్పకళాశోభిత కల్యాణ మండపంలో సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మరుసటి రోజు 18న మహాపట్టాభిషేకం, రథోత్సవం జరుపుతారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 9 నుంచి 23 వరకు వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు... ఈ కళ్యాణోత్సవాల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సాంప్రదాయబద్దంగా గోటితో ఒలిచిన తలంబ్రాలను పంపించి రామభక్తులు తమ భక్తిని చాటుకుంటారు..
ఒంగోలు, ఫిబ్రవరి 01; పెళ్ళిళ్లలో వాడే తలంబ్రాల కోసం సాధారణంగా మామూలు బియ్యాన్ని ఎవరైనా వాడతారు… అయితే అదే సీతారాముల కళ్యాణమైతే ఆ తలంబ్రాలకు విశిష్టత, సాంప్రదాయపు సొబగులు అద్దాలి కదా… అందుకే సాక్షాత్తూ కృతయుగంలో సీతారాముల వారి కళ్యాణం కోసం తలంబ్రాలు ఎలా సిద్దం చేశారో, ఇంచుమించు అదే భక్తిభావనతో, అకుంఠిత దీక్షతో తలంబ్రాలు తయారు చేసి భద్రాచలం, ఒంటిమిట్టలో ఉన్న శ్రీరాముల వారి ఆలయానికి భక్తులు పంపించడం గత కొన్న శతాబ్దాలుగా ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు… అందులో భాగంగా బాపట్లజిల్లాలోని పర్చూరు, చీరాల నుంచి పెద్ద ఎత్తున తలంబ్రాలు తయారుచేసి పంపిస్తున్నారు… ఈ ఏడాదికూడా ఒక మహా క్రతువులా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు… భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 17న శ్రీరామ నవమిని ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజు శిల్పకళాశోభిత కల్యాణ మండపంలో సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మరుసటి రోజు 18న మహాపట్టాభిషేకం, రథోత్సవం జరుపుతారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 9 నుంచి 23 వరకు వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు… ఈ కళ్యాణోత్సవాల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సాంప్రదాయబద్దంగా గోటితో ఒలిచిన తలంబ్రాలను పంపించి రామభక్తులు తమ భక్తిని చాటుకుంటారు… అందుకోసం ఇప్పటి నుంచే గోటితో కోటి తలంబ్రాలను ఒలిచే కార్యక్రమాలకు గ్రామాల్లో శ్రీకారం చుట్టారు…
తలంబ్రాలు చేయడంలో ప్రత్యేకత ఏంటి…
తలంబ్రాలు తయారు చేయడమంటే ఒడ్లు తెచ్చి రైస్‌మిల్లులో వేసి బియ్యం వేరు చేయడం కాదండోయ్… ఇలా చేస్తే ఇక భక్తులకు కలిగే మహాభాగ్యం ఏముంటుంది… అందుకే కృతయుగంలో ఏ విధంగా ఒడ్లను గోటితో వలిచి బియ్యాన్ని వేరు చేస్తారో… సరిగ్గా అలాగే గోటితో వలవాలి… అన్నీ ఒకే చోట నుంచి కాకుండా ఈ మహధ్బాగ్యంలో వీలయిన ఎక్కువ గ్రామాల నుంచి తయారుచేసేలా చూసుకుంటారు… అందులో భాగంగానే భద్రాద్రి రామయ్య కళ్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను బాపట్లజిల్లా పర్చూరులోని రామభక్తులు తమ వంతు ఉడతా భక్తిగా కోటి తలంబ్రాలను గోటితో వలిచి సిద్దం చేస్తున్నారు…
గోటి కోటి తలంబ్రాల్లో పాల్గొన్న మహిళలు…
బాపట్ల జిల్లా పర్చూరులోని రామాలయంలో శ్రీరాముల వారి గోటి కోటి తలంబ్రాల కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . పర్చూరులోని రామాలయంలో ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు . తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరు గ్రామానికి చెందిన రామదాసు తిరుపతి, తిరుపతమ్మ దంపతులు రసాయన ఎరువులను వినియోగించకుండా పండించిన ధాన్యాన్ని ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణానికి తలంబ్రాలుగా ఉపయోగిస్తారు . ఆ ధాన్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు పంపించి మహిళా భక్తుల చేత గోళ్ళతో వొలిపిస్తారు . ఈక్రమంలో అక్కడి నుండి పర్చూరు రామాలయానికి బుధవారం 140 ధాన్యపు చిన్న బస్తాలు చేరుకున్నాయి… రామాలయంలో వీటిని గోటితో ఒలిచే కార్యక్రమం చేపట్టారు… గ్రామంలోని మహిళలు ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు… జై శ్రీరాం నామ స్మరణతో ధాన్యాన్ని ఒలిచి అక్షింతలను తయారు చేస్తునట్లు పర్చూరుకు చెందిన రామభక్తుడు కఠారి సత్యనారాయణ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..