AP News: ఏపీ అసెంబ్లీకి వేళాయే.. సభలో ప్రవేశపెట్టనున్న ‘ఓటాన్ అకౌంట్ బడ్జెట్’..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకూ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై వైఎస్సార్సీపీ అధిష్టానం వేగంగా ముందుకెళ్తుండగా..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకూ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై వైఎస్సార్సీపీ అధిష్టానం వేగంగా ముందుకెళ్తుండగా.. నాలుగైదు రోజుల్లో తమ అభ్యర్ధుల మొదటి విడత జాబితాను ప్రకటించేందుకు తెలుగుదేశం-జనసేన కూటమి కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీ ఉదయం పది గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ. బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఎన్నికలు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ నెల ఆరో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. అదే రోజు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఈ నెల ఏడో తేదీన బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. పలు బిల్లులను ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది సర్కార్. ఈ ప్రభుత్వంలో జరిగే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు సమావేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.
అనర్హత వేటుపై టీడీపీ, అభివృద్దిపై వైసీపీ..
ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు సిద్దమవుతున్నాయి. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్దిని అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఇక సమావేశాలకు తెలుగుదేశం పార్టీ సభ్యులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానన్న చంద్రబాబు.. ఈసారి సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. ఈ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం అంశంతో పాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో స్పీకర్ తీరుపై సభలో లేవనెత్తాలని ప్రాథమికంగా చర్చించారు. ఇక ప్రజా సమస్యలపైనా అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మొత్తానికి చివరి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే అవకాశం కనిపిస్తోంది.