Shani Remedies: జాతకంలో శని దోషమా..! శనివారం ఈ పరిహారాలు చేయండి.. శనీశ్వరుడు మీ పట్ల ప్రసన్నం
నవ గ్రహాల్లో శనీశ్వరుడు ఒకరు. మంచి చేసే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే.. ఆ వ్యక్తి జీవితాంతం బాధపడాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితిలో జ్యోతిషశాస్త్రంలో సూచించిన కొన్ని పరిహారాలను చేయడం ద్వారా శని దోషం నుంచి బయట పడవచ్చు. శనివారం రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన పరిహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

హిందూ మతంలో శని దేవుడిని న్యాయ దేవుడు, కర్మ ప్రదాత అని పిలుస్తారు. శని దేవుడు మనిషి చేసిన కర్మల ప్రకారం మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తాడని నమ్మకం. హిందూ మత విశ్వాసం ప్రకారం శని దేవుడు ఎవరిపైన అయినా అనుగ్రహహిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఆనందం చోటు చేసుకుంటుంది. మరోవైపు శని దేవుడు ఎవరిపైనా అయినా కోపంగా ఉంటే.. అతని జీవితంలో ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయి. చాలా సార్లు ప్రజలు తెలిసి లేదా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తిపై అగ్రహిస్తాడు. అంతేకాదు జాతకంలో ఏలి నాటి శని, శని ధైయా లేదా శని మహాదశ వంటివి ఉన్న ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితిలో కొన్ని సులభమైన నివారణలు చేయవచ్చు. ఇలా చేయడం వలన శని దోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాదు శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది.
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పరిహారాలు
శనివారం శని దేవుడిని పూజించండి: శనివారం శని దేవుడిని పూజించడం, శని ఆలయాన్ని సందర్శించడం, శని దేవుని పాదాలకు ఆవ నూనెను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం శని ఆలయంలో ఆవ నూనె దీపం వెలిగించి శని చాలీసా పఠించండి.
హనుమాన్ చాలీసా పారాయణం: విశ్వాసం ప్రకారం శనీశ్వరుడికి హనుమంతుడి అంటే ఇష్టం. కనుక హనుమంతుడిని పూజించడం కూడా శని దేవుడిని సంతోషపరుస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం కూడా శని దేవుడిని సంతోషపెట్టడానికి ఒక ప్రయోజనకరమైన మార్గం.
పేదలకు దానం: శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం పేదలకు ఆహారం, బట్టలు లేదా ఇతర ముఖ్యమైన వస్తువులను దానం చేయాలి. శనివారం పేదలకు నల్లటి బట్టలు, మినపప్పు, నువ్వులు, ఇనుము, బూట్లు దానం చేయాలి.
జమ్మి చెట్టుకి పూజ: శని దేవుడికి శమీ వృక్షం అంటే చాలా ఇష్టం అని నమ్ముతారు. కనుక శనివారం శమీ వృక్షాన్ని పూజించి దానికి నీరు అర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది శని దేవుడిని త్వరగా సంతోషపరుస్తుంది.
రావి చెట్టు పూజ: శనివారం రావి చెట్టును పూజించి, దాని కింద నువ్వుల నూనె దీపం వెలిగించడం కూడా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక సులభమైన మార్గం. శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించి, రావి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయండి.
నల్ల కుక్కకు ఆహారం: శనివారం రోజున నల్ల కుక్కకు నువ్వుల నూనె తో చేసిన ఆహారం తినిపించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతి శనివారం ఆహారాన్ని నల్ల కుక్కకు తినడానికి ఇస్తే.. అది శని దోషం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
శని దేవుడిని ప్రసన్నం చేసుకునే మంత్రం శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ‘ఓం శం శనిశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాదు ఓం ప్రాం ప్రిం ప్రౌం సః శనిశ్చరాయ నమః’ , ‘ఓం నీలాంజనసమాభాసం రవిపుత్రం యమగ్రజం’ అని జపించవచ్చు. ‘ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం’ అనే మంత్రాన్ని పఠించి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
శని దేవుడిని పూజించడం వల్ల ఏమి జరుగుతుంది? శనివారం నాడు శని దేవుడిని పూజించడం వల్ల శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది, జీవితంలో శ్రేయస్సు వస్తుంది. శుభ ఫలితాలు లభిస్తాయి. శని దేవుడిని ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరతాయని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








