Puri Temple Mystery: పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాల్లో వెల కట్టలేని సంపద.. తలుపులు తెరిచేందుకు సుప్రీం కోర్టులో విచారణ
1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం.. 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. ఒక భరీ అంటే..12 గ్రాములన్నమాట..వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి.
అప్పుడు అనంత పద్మనాభుడు.. ఇప్పుడు పూరీ జగన్నాథుడు..అక్కడ నేలమాళిగలు.. ఇక్కడ రత్న భాండాగారాలు.. అక్కడ వెలకట్టలేని సంపద.. ఇక్కడ ఎంతుందో చెప్పలేకపోయిన అపార ఐశ్వర్యం.. పద్మనాభుడి చెంత ఆరో గదికి నాగబంధం.. పూరీ జగన్నాథుడి చెంత తెరుచుకోని రహస్య గది.. కారణాలు ఏవైనా.. ప్రాంతాలు వేరైనా.. తీర ప్రాంతాల్లో వెలసిన ఈ.. ఇల వైకుంఠాల నిధులు, నిక్షేపాల గురించి ఎప్పుడూ ఆసక్తికరమే.. ఎప్పుడూ చర్చనీయాంశమే.. నకిలీ తాళాలతో రహస్య గది తెరవాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో..ఈ కేసు సుప్రీంకోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది.. కోర్టు ఏం చెబుతుందోనని అటు రాజకీయ పార్టీలు..ఇటు జగన్నాధుడి భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ రహస్య గదిలో ఏముంది.
పూరీ జగన్నాథ క్షేత్రంలో ఉన్న రత్న భాండాగారం తాళాలు మాయమైన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ బయట పెట్టాలని.. డూప్లికేట్ తాళాలతో గదిని తెరవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రంలో ఉన్న రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర వైడూర్యాలు.. రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనా.
అలాంటి ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్న తరుణంలో..రహస్యగదిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే భాండాగారంలోని కీలక విభాగ తాళాలు మాయం కావడం దుమారం రేపుతోంది.. దీనిపై దర్యాప్తు చేపట్టిన జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్.. 2018 నవంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రిపోర్ట్‌ను అందించింది. ఈ విషయం ఎంతవరకు వచ్చిందో తెలియజేయాలంటూ.. ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది.. దీంతో..ఈ పాయింట్ మళ్లీ హైలెట్ అయ్యింది. మళ్లీ చర్చకొచ్చింది..రహస్యగది తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. ఇలా చర్చ రచ్చకెక్కింది..
అనంత పద్మనాభుడి ఆలయం కింద నేల మాళిగల్లో అపార సంపద ఉన్నట్లు తేలింది. అయితే ఆరో గదికి నాగబంధం ఉందని..దాన్ని తెరిస్తే ఊహించని అరిష్టం జరుగుతుందని పండితులు చెప్పడంతో..అంతటితో ఆ పనులు ఆగిపోయాయి.. ఇప్పుడు మళ్లీ ఇలాంటిదే పూరీ జగన్నాధుడి సన్నిధిలో జరగనుందా అన్నదే చర్చనీయాంశం..
పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై భక్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో.. హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది.
భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ నిధులు, నిక్షేపాల లెక్క తేల్చలేకపోయారు. అసలు ఎన్ని ఉన్నాయో లిస్ట్ కూడా తయారు చేయలేదు..
1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం.. 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. ఒక భరీ అంటే..12 గ్రాములన్నమాట..వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు. ఈ లెక్కల ప్రకారమే దాదాపు 153 కిలోల బంగారంపైనే ఉన్నట్లు లెక్క తేలింది.. లెక్కపెట్టలేకపోయిన బంగారం విలువ…కొన్ని వేల కిలోలు ఉంటుందని అంచనా..అంటే..జగన్నాధుడి సంపద..అనంత పద్మనాభుడిని మించి ఉన్నట్లేనని భక్తుల అంచనా..
ఈ రత్న భాండాగారం విషయంలో..రఘుబీర్ దాస్ కమిషన్ నివేదికకు సంబంధించి..అభిప్రాయాన్ని జులై 10లోగా తెలియజేయాలంటూ ఇటీవల ఒడిశా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన భాజపా, కాంగ్రెస్‌లు.. ఆలయంలోని ఆ రత్న భాండాగారాన్ని తెరవాలని పట్టుబడుతున్నాయి. ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఆ నివేదిక చేరినప్పటికీ ప్రభుత్వం దాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేసిందని విపక్షాలు తూర్పెత్తుతున్నాయి..
డూప్లికేట్ తాళాలు దొరికినా.. గదిని తెరవడానికి ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోందని ప్రశ్నిస్తున్నారు.. పారదర్శకత పాటిస్తే వెంటనే ఆ నివేదికను బహిరంగపరచాలని కాంగ్రెస్ సీనియర్ నేత బిజయ్ పట్నాయక్ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికార బీజేడీ.. 38 ఏళ్లుగా ఆ రత్న భాండాగారాన్ని తెరవలేదని.. దీనిని విపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దని ఓ ప్రకటన విడుదల చేసింది. అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు.. జగన్నాధుడి సంపద లెక్క తేల్చాల్సిందేనని పట్టుబట్టాయి. ఇలాంటి సిచ్యుయేషన్‌లో.. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. మరి.. ఉన్నత న్యాయస్థానం.. నకిలీ తాళాలతోనే రహస్య గదిని తెరవమంటుందా..జగన్నాధుడి సంపద లెక్కించమంటుందా.. ప్రజల అనుమానాలను నివృత్తి చేసేలా తీర్పునిస్తుందా.. అని రకరకాల ఆలోచనలతో అటు ప్రభుత్వం..ఇటు ప్రతిపక్షాలు, భక్తులు ఎదురు చూస్తున్నారు. సంపదలో పూరీ జగన్నాథుడు..అనంత పద్మనాథుడికే పెద్దన్ననా.. జగన్నాథా.. ఈ లెక్క తేల్చు నువ్వే నాథా.. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..