యాదగిరిగుట్టకు మహార్థశ.. టీటీడీ తరహాలో పాలనా, సదుపాయాలు.. సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు

యాదగిరి గుట్ట ఆలయం అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకున్నారు సీఎం. పాత ఆచార, సంప్రదాయాలను మళ్లీ అమలు చేయాలని సూచించారు.

యాదగిరిగుట్టకు మహార్థశ.. టీటీడీ తరహాలో పాలనా, సదుపాయాలు.. సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు
Yadagiri Gutta Temple
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Nov 08, 2024 | 7:09 PM

అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా… అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకున్న మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహఆస్వామి దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇక నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి గడిపారు. తన బర్త్డే సందర్భంగా స్వామివారిని దర్శించుకొని సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ పాదయాత్ర నిర్వహించారు. అది కూడా సీఎం రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు నాడే చేపట్టడం విశేషం.

హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ కు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధానాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు.

తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్ లో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ తిరుపతిగా పేరుందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక ఆలయ మండలిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులు ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని రేవంత్ అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధికి కావాల్సిన ప్రపోజల్సు వారం రోజుల్లో పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. యాదగిరిగుట్ట పై భక్తులను నిదుర చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు.

అంతేకాదు యాదగిరి గుట్ట పాలనా వ్యవహారాలను చూసుకునేందుకు ప్రత్యేక పాలకమండలి ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. టిటిడి తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానానికి పాలకమండలి ఏర్పాటు చేయడంతో పాటు యాదాద్రిని ఇక నుంచి యాదగిరిగుట్టగా అన్ని రికార్డుల్లో నమోదు చేయాలని సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక, ఆలయం అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకున్నారు సీఎం. పాత ఆచార, సంప్రదాయాలను మళ్లీ అమలు చేయాలని సూచించారు. ఇప్పటికే యాదాద్రిని యాదగిరిగుట్టగా పిలవాలన్న రేవంత్‌ సర్కార్… ఆలయంలో మరిన్ని మార్పుల చేర్పులు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే భక్తులకు డ్రెస్‌ కోడ్‌ను తప్పనిసరి చేసింది. ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్‌ కోడ్‌ను పాటిస్తున్నారు. స్వామి సన్నిధిలో భక్తులు బస చేసే విధంగా డార్మెంటరీ హాల్‌ను ఏర్పాటు చేశారు. అలాగే కొబ్బరి కాయలు కొట్టడం, కొండపైకి ఆటోలు వెళ్లడం వంటి పలు నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. అంతేకాదు స్వామివారి క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు… ఇటీవలే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించారు. అలాగే ఏళ్లుగా వస్తున్న గిరిప్రదక్షిణ సంప్రదాయాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. ఇక తాజాగా ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానానికి అనుమతించారు. మొత్తానికి ప్రభుత్వాలు మారడంతో… యాదగిరిగుట్టపై ఆచారాలు, సాంప్రదాయాలు, భక్తుల సౌకర్యాల కల్పనలోనూ మార్పులొస్తున్నాయి. ఇక కొండపై పాత ఆచార సాంప్రదాయాలను పునరుద్ధరించడం పట్ల భక్తులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని అద్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…