Chardham Yatra 2025: కుంభమేళా ముగిసింది.. చార్ ధామ్ సందడి మొదలు.. యాత్ర ప్రారంభ తేదీ ఎప్పుడంటే
ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర చార్ ధామ్ యాత్ర. శివ కేశవులు కొలువైన కేదార్‌నాథ్ , బద్రీనాథ్ లను దర్శించుకోవాలని కోరుకుంటారు. ఈ యాత్ర కోసం ఎదురుచూసే భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ సిబ్బంది గుడ్ న్యూస్ చెప్పింది. కేదార్‌నాథ్ , బద్రీనాథ్ ధామ్ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయి? చార్ ధామ్ యాత్ర తేదీ ఎప్పుడు అంటూ ఎదురు చూసేవారి కోసం యాత్ర ప్రారంభ తేదీని ప్రకటించింది. అంతేకాదు పవిత్ర కేదార్‌నాథ్ మందిరం తలుపులు తెరుచుకునే పవిత్ర రోజుని కూడా ప్రకటించింది.

కుంభ మేళా జాతర ముగిసింది.. త్వరలో చార్‌ధామ్ యాత్ర సందడి మొదలు కానుంది. చార్‌ధామ్ కోసం ఎదురు చూసే భక్తులకు శుభవార్త వినిపించింది. యాత్ర ప్రారంభ తేదీలను ప్రకటించింది. ఈ సంవత్సరం మే నెలలో చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. యాత్ర ప్రారంభ తేదీలతో పాటు ఆలయ తలుపులు తెరచుకునే తేదీలను శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ ప్రసాద్ తప్లియాల్ ప్రకటించారు. మే 2న ఉదయం 7 గంటలకు కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయని తెలిపారు. దీనితో పాటు బద్రీనాథ్, గంగోత్రి , యమునోత్రి ధామ్ ఆలయ తలుపులు తెరిచే తేదీలను కూడా ప్రకటించారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి పవిత్ర క్షేత్రాల సందర్శనం కోసం చేసే యాత్రను చార్‌ధామ్ యాత్ర అని అంటారు. ఈ పర్యటన తేదీలు ప్రకటించారు విజయ్ ప్రసాద్ తప్లియాల్. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ శుభ సందర్భంగా గంగోత్రి , యమునోత్రి ద్వారాలు తెరవబతాయని చెప్పారు. కాగా బద్రీనాథ్ మందిరం మే 4న తెరుచుకుంటుంది. చార్ ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
బాబా కేదార్‌నాథ్ పల్లకీని బయటకు తీస్తారు.
హిందూ మతంలో చార్ ధామ్ యాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒక్కసారైనా కేదార్‌నాధుడిని దర్శించుకోవాలని కోరుకుంటారు. కేదార్‌నాథ్ ధామ్ శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని తలుపులు మే 2న తెరవనున్నారు . ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత పండితులు, వేద పాఠకులు ఆలయం తెరచే రోజుని ప్రకటించారు. మే 1న ఆలయ తలుపులు తెరవడానికి ముందు, బాబా కేదార్‌నాథ్ పల్లకీని గౌరీకుండ్ నుంచి తీసుకుని కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంటారు.
వేసవిలో తెరచుకునే తలుపులు
శీతాకాలం రాగానే కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మూసుకుపోతాయి. వేసవి రాగానే తలుపులు తెరుచుకుంటాయి. చార్ ధామ్ యాత్ర కోసం భారీ సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర స్థలాల వద్దకు చేరుకుంటారు. చార్ ధామ్ యాత్ర తేదీలను ప్రకటించడంతో.. భక్తులు సన్నాహాలు ప్రారంభించారు. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరవడానికి శుభ సమయం మహాశివరాత్రి రోజున నిర్ణయించబడింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








