- Telugu News Photo Gallery Spiritual photos Diwali 2025: Best Places In India To Experience The Festival Of Lights
Diwali 2025: మన దేశంలో దీపావళి వేడుకలు ఇక్కడ వెరీ వెరీ స్పెషల్.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..
మన దేశంలో ఆ సేతు హిమాచలం దీపావళిని పండగను జరుపుకుంటారు. దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవి, గణపతి కి పూజ చేయడం, బాణాసంచా కాల్చడం ప్రతి చోటా దర్శనం ఇస్తుంది. అయితే మన దేశంలో దీపావళి పండగను ఒక ప్రత్యేకమైన రీతిలో జరుపుకునే ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భిన్నంగా జరిపే దీపావళి వేడుకలను జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. దీపావళి వేడుక అందమైన దృశ్యాలను అందించే కొన్ని ప్రదేశాలను పరిశీలిద్దాం
Updated on: Oct 08, 2025 | 1:01 PM

దీపావళి అంటే దీపావళి వరస అని అర్ధం. అమావాస్య చీకట్ల తొలగించి వెలుగులు పంచె దీపాల పండుగగా ప్రసిద్ధి చెందింది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేసుకునేందుకు దేశంలో దీపావళి జరుపుకుంటారు. మన దేశంలోని ప్రతి ప్రదేశంలో దీపావళిని వివిధ సాంప్రదాయ పద్దతుల్లో జరుపుకుంటారు. అయితే దీపావళిని ఒక ప్రత్యేకమైన రీతిలో జరుపుకునే ప్రదేశాలు కూడా ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఆప్రదేశాల్లో దీపావళి వేడుకలను చూసి తీరాల్సిందే..

అయోధ్య, ఉత్తరప్రదేశ్: రాముడి జన్మస్థలమైన అయోధ్యలో దీపావళి వేడుకలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ సమయంలో నగరం అంతటా అందమైన దీపాల ప్రదర్శనను చూడవచ్చు. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, లక్ష్మి దేవిని స్వాగతించడానికి రికార్డు స్థాయిలో దీపాలు, లక్షలాది మట్టి దీపాలతో నగరం పూర్తిగా ప్రకాశిస్తుంది. దీపావళి రోజున, దేవతల విగ్రహాలను అలంకరిస్తూ నగరం గుండా ఊరేగింపు కూడా జరుగుతుంది. అయోధ్యలో సరయు నది ఒడ్డున కూడా దీపాల ప్రదర్శనను చూడవచ్చు.

వారణాసి, ఉత్తరప్రదేశ్: వారణాసిలో దీపావళి రాత్రి దీపాల దృశ్యం ఎంతో అద్భుతంగ ఉంటుంది. ఈ రోజున వారణాసి ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఇక్కడ పగలు, రాత్రి అనే తేడ లేకుండా దీపావళి వేడుకను జరుపుకుంటారు. రంగురంగుల బాణసంచా కాల్చడం వేడుకకు మరింత అందాన్ని చేకూరుస్తుంది. దీపావళి వేడుకలకు వారణాసి ఖచ్చితంగా సందర్శించడానికి గొప్ప ప్రదేశం. పండుగ రోజున, వారణాసి నది ఒడ్డున ప్రత్యేక దృశ్యాలను చూడవచ్చు.

జైపూర్, రాజస్థాన్: దీపావళి సమయంలో జైపూర్‌ను సందర్శించడం ఒక అందమైన అనుభూతి. ఇక్కడ వీధులు, ఇళ్ళు, దుకాణాలను లైట్ల వెలుగుతో ప్రకాశిస్తాయి. దీపావళి సమయంలో లైట్ల కాంతితో ప్రకాశించే ఈ నగరం చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీపావళి సమయంలో జైపూర్ నుంచి వచ్చే స్వీట్లు చాలా ప్రసిద్ధి చెందాయి. అనేక సాంప్రదాయ, ప్రత్యేకమైన ఆచారాలను చూడటానికి ఇక్కడికి ఒక్కసారైనా వెళ్ళాల్సిందే.

ఉదయపూర్: 'సరస్సుల నగరం'గా ప్రసిద్ధి చెందిన ఉదయపూర్ లో దీపావళి వేడుకలు ఓ అద్బుతం. అలనాటి రాజభవనాల వైభవంతో కూడిన నగరంలో దీపావళి రోజున జరిగే లాంతర్న్ ఫెస్టివల్ చూసేందుకు రెండు కళ్ళు చాలవు. సరస్సులలో దీపాలు వెలుగుతూ ఆకర్షణీయమైన ప్రతిబింబం, మెరిసే లాంతర్లు, ప్రకాశవంతమైన గంభీరమైన రాజభవనాలు, దీపాల వెలుగులో రాజ హవేలీల చూడడం ఒక మంచి మధురమైన జ్ఞాపకం. దీపావళి రోజున బంగారు రంగులో, సంపన్నమైన రాజస్థానీ శైలి ప్యాలెస్ పైన బాణసంచా ప్రదర్శన ఒక అద్భుత వీక్షణం.

గోవా: రాత్రిపూట జరిగే రేవ్ పార్టీలు, బీచ్ షాక్‌లు, క్రూయిజ్‌లు, క్యాసినోలు , జల సాహసాలకు అతీతంగా.. దీపావళి సమయంలో గోవాను సందర్శించి గోవా సంప్రదాయాన్ని, దాని సాంస్కృతిక గొప్పతనాన్ని అనుభవించవచ్చు. గోవాలో చోటి దీపావళిని 'నరక చతుర్దశి'గా జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి రాక్షసుడు నరకాసురుడిపై సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి.. అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి నరకాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.

అమృత్‌సర్: బంగారు నగరంగా ప్రసిద్ధి చెందిన అమృత్‌సర్ లో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతాయి. దీపావళి సమయంలో స్వర్ణ దేవాలయం అందంగా ప్రకాశిస్తుంది. బంగారు ఆకర్షణ అనేక రెట్లు పెరుగుతుంది. పవిత్ర సరోవర్ చుట్టూ లెక్కలేనన్ని దీపాలను వెలిగిస్తారు. ఇది దీపావళి వేడుకలకు అమృత్‌సర్‌ను తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా మార్చింది. జహంగీర్ ఖైదు చేసిన సిక్కుల ఆరవ గురువు గురు హరగోబింద్ జీ విడుదలను స్మరించుకుంటూ అమృత్‌సర్‌లో దీపావళిని 'బంది చోర్ దివస్'గా జరుపుకుంటారు.

ఢిల్లీ: దీపావళి పండగ ను చూడడానికి ఢిల్లీకి ప్రయాణించడానికి ఉత్తమ సమయం. ఈ సమయంలో అక్కడి వీధులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. దీపావళి వేడుకల్లో భాగమైన మార్కెట్లు కూడా ఈ సమయంలో సందడి సందడిగా ఉంటాయి. షాపింగ్ ఇష్టపడేవారు దీపావళికి ఢిల్లీకి వెళ్లవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దీపావళి కార్నివాల్ వంటి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి.




