AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mansas Trust: మాన్సస్ లో హీట్ పెంచిన లింగవివక్ష అంశం..సంచయిత ఫిర్యాదుతో అశోక్ గజపతి రాజు పై పోరుకు మహిళ కమిషన్ రెడీ!

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ వివాదం థ్రిల్లర్ సినిమా ను తలపిస్తోంది.. రోజుకో అంశం తెర మీదకి వస్తూ వివాదాలు సీరియల్ ఎపిసోడ్స్ తరహాలో సాగుతున్నాయి.

Mansas Trust: మాన్సస్ లో హీట్ పెంచిన లింగవివక్ష అంశం..సంచయిత ఫిర్యాదుతో అశోక్ గజపతి రాజు పై పోరుకు మహిళ కమిషన్ రెడీ!
Mansas Trust
KVD Varma
|

Updated on: Jul 02, 2021 | 8:36 PM

Share

(గమిడి కోటేశ్వరరావు, టివి9, విజయనగరం)

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ వివాదం థ్రిల్లర్ సినిమా ను తలపిస్తోంది.. రోజుకో అంశం తెర మీదకి వస్తూ వివాదాలు సీరియల్ ఎపిసోడ్స్ తరహాలో సాగుతున్నాయి.. ఎవరికి వారే మాన్సస్ ట్రస్ట్ నాదంటే నాదంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కోర్టు తీర్పు తో ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించినా అధికారులు మాత్రం సహాయ నిరాకరణ చేస్తూనే ఉన్నారు. భాధ్యతలు స్వీకరించిన రోజే తనకు ట్రస్ట్ కు సంభందిన కీలక సమాచారం రెండు రోజుల్లో ఇవ్వాలని ఆఫీస్ ఆర్డర్ ద్వారా మాన్సస్ ఈవో ని అడిగినా ఇప్పటికీ తిరుగు సమాచారం లేదు. మరో వైపు మాన్సస్ నుండి ఉద్యోగులను కూడా బదిలీ చేసి ఉద్యోగులు తమ విధానాల మేరకే పనిచేస్తారు అనే సంకేతం ఇచ్చింది ప్రభుత్వం. అశోక్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి విజయసాయిరెడ్డి అశోక్ గజపతి రాజుల మధ్య ట్విట్టర్ వేదిక గా ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాన్సస్ వ్యవహారం మరింత హాట్ గా మారింది.

ఈ తరుణంలోనే అనూహ్యంగా మరో అంశం తెర మీదకి తెచ్చింది మాన్సస్ మాజీ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు. హై కోర్టు తీర్పు తరువాత ఇంతవరకు మౌనంగా ఉన్న సంచయిత తొలి సారిగా నోరు విప్పారు. నేరుగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను కలసి తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు. మహిళ పై అశోక్ గజపతి రాజు వివక్ష చూపిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. దీనితో ఇప్పుడు ప్రభుత్వానికి లింగ వివక్ష అనే ఆయుధం దొరికినట్టయింది. సంచయిత ఫిర్యాదుతో అశోక్ గజపతి పై లింగ వివక్ష ఆరోపణలు మొదలయ్యాయి.

ఆనంద గజపతి రాజు మరణానంతరం 2016 లో మాన్సస్ బై లాస్ ప్రకారం గజపతి రాజుల కుటుంబంలోనే పెద్ద మగ సంతానం ఛైర్మన్ గా కొనసాగాలన్న నిబంధన మేరకు అశోక్ గజపతి రాజుకు మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గా నియామకం జరిగింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పదవి నుంచి అశోక్‌ గజపతిరాజును తొలగించి ఆ బాధ్యతల్ని ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచయిత గజపతిరాజుకు అప్పగించింది ఏపీ సర్కార్‌. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అశోక్‌ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ సంచయిత నియామకానికి సంబంధించిన జీవోను కొట్టి వేసింది. దీంతో మాన్సాస్‌ ట్రస్ట్‌తో పాటు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త బాధ్యతల్ని తిరిగి చేపట్టారు అశోక్‌ గజపతిరాజు. అయితే ఈ వివాదానికి అంతటితో ఫుల్ స్టాప్ పడలేదు.. హైకోర్టు తీర్పు పై డివిజన్ బెంచ్ కి వెళ్తున్నామని ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జూన్ 30 న విశాఖలో పర్యటించిన రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను సంచయిత కలవటం సంచలనంగా మారింది.. తనకు మాన్సస్ వ్యవహారంలో అన్యాయం జరిగిందంటూ వాసిరెడ్డి పద్మకు ఫిర్యాదు చేసింది సంచయిత. తన నియామకంతో పాటు వారసత్వం అంశాన్ని కించపరిచేలా అశోక్‌ గజపతిరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపింది.

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకి సంచయిత గజపతిరాజు లింగ వివక్ష పిర్యాదు చేయటం ఇప్పుడు కీలకంగా మారింది. ఆ తర్వాత వాసిరెడ్డి పద్మ మాన్సాస్ లింగ వివక్ష పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిష్ఠాత్మక మాన్సాస్ ట్రస్టుకు తొలి మహిళా ఛైర్ పర్సన్ గా వ్యవహరించిన సంచయితను దింపడానికి దుష్టప్రయత్నం జరిగిందని మహిళా కమిషన్ ఛైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఓ మహిళ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోతే సంబరాలు చేసుకున్నారని విమర్శించారు. మహిళకు అధికారం లేదనే వాదన ఈ కాలంలో చెల్లదన్నారు. రక్షణ రంగంలో మహిళలకు ప్రవేశం లేదన్న కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని పద్మ గుర్తుచేశారు. రక్షణ రంగంలో కూడా మ‌హిళ‌ల‌ను కోటా ప్రకారం తీసుకోవాల‌ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. లింగ వివక్షత‌ ఎక్కడ చూపినా నేరం అవుతుంద‌ని భార‌త రాజ్యాంగంలోనే ఉందని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మ‌హిళ‌ల‌కు అధికారం లేద‌ని చెప్పే ఏ వాద‌నా చెల్లదన్నారు. రాజ‌రికం ముసుగులో మాన్సాస్ ట్రస్ట్ లో మ‌హిళ‌ల హ‌క్కుల‌ పై దాడి జ‌రిగిందన్నారు. మహిళ‌ల‌కు కొన్ని ప్రదేశాల్లో ప్రవేశం లేదు, మ‌హిళ‌లకు కొన్ని ఛైర్స్ లో కూర్చొనే అర్హత‌ లేద‌ని చెప్తున్నామంటే.. కాలాన్ని మ‌నం వెన‌క్కి తీసుకెళ్తున్నామా?.. స‌తీస‌హ‌గ‌మ‌న కాలానికి, బ్రిటీష్ కాలానికి తీసుకెళ్తున్నట్లుందని పద్మ విమర్శించారు.

జ‌గ‌న్ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు స్వర్ణయుగం మొద‌లైందన్నారు. ప్రతి ప‌థ‌కంలోనూ, ప‌ద‌వుల్లోనూ మ‌హిళ‌కు 50శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో మాన్సాస్ స్టులో మ‌హిళ‌కు అర్హత లేద‌ని, టిడిపి దానిని భుజాన వేసుకుని మాట్లాడ‌డం అంటే మ‌హిళ‌ల ప‌ట్ల వారికున్న గౌర‌వం ఇదేనా? ఏం సంకేతం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు.. మ‌హిళ‌లు అన్న కార‌ణంతో వారికి ద‌క్కాల్సిన హక్కుల‌ను హ‌రించ‌వ‌చ్చా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. సంచయిత ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించారు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. మహిళల పట్ల అశోక్‌ గజపతిరాజు వివక్ష చూడం సరికాదన్నారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజు రాచరికపు వ్యవస్థలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు వాసిరెడ్డి పద్మ.

మరోవైపు వాసిరెడ్డి పద్మ కామెంట్స్ పై టిడిపి మహిళా విభాగం ఘాటుగానే స్పందించింది.. సైనిక స్కూల్ లో బాలికలు విద్యనభ్యసిస్తున్నారంటే అందుకు అశోక్ గజపతి రాజు చొరవే కారణమని అంటున్నారు.. అశోక్ గజపతి కేంద్ర రక్షణ శాఖ మంత్రికి రాసిన లేఖ కారణంగా ఇప్పుడు బాలికలు సైనిక స్కూల్లో చదువగలుగుతున్నారని అన్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరో మహిళలకు రాజకీయ భవిష్యత్తు ను కల్పించి వారికి రాజకీయంగా, సామజికంగా ఎదిగేలా చేసిన వ్యక్తి పై లింగవివక్ష ఆరోపణలు సరి కాదని అన్నారు. మొత్తానికి సంచయిత ఫిర్యాదు, దానిపై మహిళా కమిషన్‌ స్పందన చూస్తుంటే, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఇప్పట్లో వివాదాల నుంచి బయటపడే అవకాశం లేదనిపిస్తోంది.

మరోవైపు అశోక్‌ గజపతిరాజు పై ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. మాన్సస్, సింహాచలం భూముల్లో అవినీతి జరిగిందని, అవినీతి డబ్బుతో చంద్రబాబుకు అశోక్ గజపతి రాజు కప్పం కట్టాడని ఆరోపించారు. అశోక్ గజపతి ని వదలమని, మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ పదవి తాత్కాలికమేనని హెచ్చరించారు.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో మాన్సస్ వ్యవహారం ఎటూ దారి తీస్తుందో, ఎవరికి ఇబ్బందులు తెచ్చి పెడుతుందో అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Also Read: AP Disha Act: మహిళల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడొద్దు.. దిశ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

YS Vivekananda murder case: వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో తెరపైకి కొత్త వ్యక్తులు.. అసలు కృష్ణయ్య యాదవ్ ఎవరంటే..?