Bhatti Vikramarka: బుజ్జగింపా? మందలింపా? అసలు భట్టి ఎందుకు ఢిల్లీ వచ్చినట్టు.!
తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన పార్టీలో ఊహాగానాలు తావిస్తోంది. తెలంగాణ పీసీసీ నాయకత్వ మార్పు..
(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ బ్యూరో)
తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన పార్టీలో ఊహాగానాలు తావిస్తోంది. తెలంగాణ పీసీసీ నాయకత్వ మార్పు నేపథ్యంలో భట్టి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఓవైపు ఆయనను అధిష్టానమే ఢిల్లీకి పిలిపించి బుజ్జగిస్తోందని, మరోవైపు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంపై ఆగ్రహించిన అధిష్టానం మందలించేందుకు పిలిపించిందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే సోషల్ మీడియా ప్రచారానికి, వాస్తవానికి అసలు పొంతనే లేదని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు భట్టీ విక్రమార్క ఢిల్లీకి ఎందుకు వచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీ వర్గాల కథనం ప్రకారం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ సహా పలువురు నేతలతో విడివిడిగా కలిసి మాట్లాడాలని భావించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ చేరుకున్నారని సమాచారం. గురువారం ఢిల్లీ చేరుకున్న ఆయన సీఎల్పీ నేతగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అధికారికంగా బస చేయవచ్చు. కానీ ఆయన మీడియా కంటపడకూడదన్న ఉద్దేశంతో బయట హోటల్‌లో బస చేస్తున్నారని తెలిసింది.
పర్యటనలో భాగంగా భట్టి విక్రమార్క ఇప్పటికే తెలంగాణ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ని కలిశారు. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా మరికొందరు నేతలనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఏఐసీసీ పెద్దలను కలిసి ఏం చెబుతున్నారన్నది పక్కన పెడితే.. బుజ్జగింపుల వ్యవహారమంటూ లేనేలేదని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. “రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడం పార్టీలో కొందరు నేతలకు నచ్చకపోవచ్చు. ఇది సహజం. ఆ మాటకొస్తే ఏ నేతను ఎన్నుకున్నా సరే, ఎంతో కొంత అసంతృప్తి, అసమ్మతి కొందరి నుంచి ఎదురవుతుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. గతంలోనూ ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది. అంతమాత్రాన అధిష్టానం అసంతృప్త నేతలను పిలిచి బుజ్జగిస్తూ కూర్చుంటే పని జరగదు” అని ఏఐసీసీలో ఓ నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు అసమ్మతి నేతలను సైతం కలుపుకుపోవాల్సిన బాధ్యత, అవసరం కొత్తగా ఎంపికైన అధ్యక్షుడిపైనే ఉంటుందని, ఆ మేరకు కొత్త పీసీసీ చీఫ్ స్వయంగా నేతల ఇళ్లకు వెళ్లి కలుస్తున్నారని కూడా ఏఐసీసీ నేతల్లో చర్చ జరుగుతోంది.
‘మందలింపు’ ప్రచారం విషయానికొస్తే…
ఇక ‘మందలింపు’ ప్రచారం విషయానికొస్తే.. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క ఓ ప్రజా సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడంలో తప్పేమీ లేదని ఏఐసీసీ భావిస్తోంది. పైగా రాష్ట్రాల్లో నేతలు ఎవరెవరిని కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? వంటి అంశాలపై మైక్రోలెవెల్ అబ్జర్వేషన్ పట్టేంత తీరిక ఏఐసీసీకి ఉండదని, ఒకవేళ అంతగా వివాదాస్పదమైన లోపాయకారి వ్యవహారాలో, ఇతర వివాదాలేవైనా ఉంటే వాటిని ముందుగా రాష్ట్ర నాయకత్వమే పరిశీలిస్తుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు భట్టి టీఆర్ఎస్‌కు దగ్గరవుతున్నారని వస్తున్న కథనాలను కూడా అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో భట్టీని మందలించడం కోసం అధిష్టానం పిలిచిందనే వార్తల్లోనూ నిజం లేదని స్పష్టమవుతోంది.
అసలు భట్టీ ఎందుకు ఢిల్లీ వెళ్లారు…
బుజ్జగింపు, మందలింపు లేనప్పుడు భట్టి ఢిల్లీ ఎందుకు వెళ్లారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న భట్టి విక్రమార్క, కొత్త నాయకత్వాన్ని అధిష్టానం ప్రకటించిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ మాట్లాడగా, మరికొందరు నేతలు తెరవెనుక తమ అసమ్మతిని ప్రదర్శించారు. ప్రకటనకు ముందు వ్యతిరేకించిన కొందరు నేతలు, ఆ తర్వాత సర్దుబాటు చేసుకుని సమ్మతిని తెలిపారు. సమ్మతి, లేక అసమ్మతి బహిరంగంగా చాటుకోలేని సందిగ్ధ స్థితిలో భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేసుకున్నారని, పెద్దలను కలిసి తదుపరి కార్యాచరణ నిర్ణయించుకోవాలని భావించినట్టుగా తెలుస్తోంది.
Also Read:
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..
సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!
రెస్టారెంట్‌ను పేల్చేస్తానంటూ కస్టమర్ ఫోన్.. కారణం ఆరా తీయగా మైండ్ బ్లాంక్.!