Hyderabad Real-Estate: మొన్న కోకాపేట.. నిన్న బుద్వేల్.. భూములకు ఎక్కడా లేని డిమాండ్.. రియల్ బూమ్ తట్టుకోగలమా?

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోంది. పశ్చిమ, నైరుతీ హైదరాబాద్ నగర శివార్లు ఐటీ సంస్థల ఏర్పాటుతో న్యూయార్క్ వంటి సిటీలను తలపించేలా అభివృద్ధి చెందింది. పదుల సంఖ్యలో నిర్మాణమైన ఫ్లై ఓవర్లతో మాధాపూర్, మైండ్ స్పేస్, కొండాపూర్; గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రామ్‌గూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, కొల్లూరు, వట్టినాగుల పల్లి, శేరిలింగంపల్లి, నార్సింగి వంటి ప్రాంతాల రూపురేఖలు గత తొమ్మిదేళ్ళలో సమూలంగా మారిపోయాయి.

Hyderabad Real-Estate: మొన్న కోకాపేట.. నిన్న బుద్వేల్.. భూములకు ఎక్కడా లేని డిమాండ్.. రియల్ బూమ్ తట్టుకోగలమా?
Kokapet, Budvel Land Auction
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 11, 2023 | 9:44 PM

Hyderabad Real-Estate: తెలంగాణ విడిపోతే హైదరాబాద్ నగరం నుంచి సగం జనాభా వెళ్ళిపోతుందని, నగర అభివృద్ధి కుంటుపడుతుందని మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కుదేలైపోతుందని చాలా మంది రాష్ట్ర విభజన జరిగే దాకా చెబుతూ వచ్చారు. అయితే దానికి భిన్నంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోంది. పశ్చిమ, నైరుతీ హైదరాబాద్ నగర శివార్లు ఐటీ సంస్థల ఏర్పాటుతో న్యూయార్క్ వంటి సిటీలను తలపించేలా అభివృద్ధి చెందింది. పదుల సంఖ్యలో నిర్మాణమైన ఫ్లై ఓవర్లతో మాధాపూర్, మైండ్ స్పేస్, కొండాపూర్; గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రామ్‌గూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, కొల్లూరు, వట్టినాగుల పల్లి, శేరిలింగంపల్లి, నార్సింగి వంటి ప్రాంతాల రూపురేఖలు గత తొమ్మిదేళ్ళలో సమూలంగా మారిపోయాయి. వాహనాల సంఖ్య లక్షల్లో పెరుగుతండడంతో ఒకప్పుడు విశాలంగా కనిపించిన ఔటర్ రింగు రోడ్డు ఇపుడు ఇరుకుగా మారుతోంది. ముందుగా మాధాపూర్ హైటెక్ సిటీ.. ఆ తర్వాత మెల్లిగా మైండ్ స్పేస్ మీదుగా నానక్‌రామ్‌గూడ దిశగా ఐటీ సంస్థలు విస్తరించాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచి ప్రతీ సంస్థకు హైదరాబాద్ సిటీలో ఓ బ్రాంచీ వుందంటే అతిశయోక్తి కాదు. ఇంకా వెల్లువెత్తుతున్న ఐటి సంస్థ పెట్టుబడుల కారణంగా పశ్చిమ, నైరుతి హైదరాబాద్ శివార్లలో భూముల లభ్యత తగ్గిపోతోంది. దాంతో ఔటర్ రింగు రోడ్డుకు అవతల కూడా ఐటి సంస్థలకు భూములను కేటాయించడం మొదలైంది. కోకాపేట పరిధిలో ప్రస్తుతం నిర్మాణమవుతున్న నియో పోలిస్ మరో గేమ్ చేంజర్ కాబోతోంది. నియోపోలిస్ పూర్తయితే ఆ దిశగా శంకర్ పల్లి వరకు నగరం శరవేగంగా విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ రోడ్ల విస్తరణ ప్రణాళికను అమలు చేస్తోంది. ఈక్రమంలో తాజాగా కోకాపేట, బుద్వేల్ ప్రాంతాల్లో ప్రభుత్వం భూములను వేలం వేసింది. ఈ రెండు వేలం పాటల్లో పలు నిర్మాణ రంగ సంస్థలు పోటీకి దిగి భూములను వందల కోట్లల్లో కొనుగోలు చేశాయి. అప్‌సెట్ ప్రైస్‌ని దాటేసి భూములు వందల కోట్లలో అమ్ముడయ్యాయి. కోకాపేటలో అయితే ఎకరం కనీసం ధర 25 కోట్ల రూపాయలుగా హెచ్ఎండీఏ నిర్ణయించగా.. ఏకంగా 100 కోట్ల 75 లక్షలకు ఒక ఎకరం చొప్పున వేలంలో అమ్ముడయ్యాయి.

ఒకవైపు ఐటీ సంస్థలు పోటీ పడుతూ వుండడం, ఆ సంస్థల్లో పెరిగిపోతున్న ఉద్యోగులకు వసతి సౌకర్యాల కల్పన కోసం రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద ఎత్తున స్కైస్క్రాపర్ల వంటి బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్స్ నిర్మిస్తూ వుండడంతో హైదరాబాద్ నగర నైరుతి, పశ్చిమ దిశగా శరవేగంగా విస్తరిస్తోంది. దానికి అనుగుణంగానే భూముల రేట్లు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దీనికి హైదరాబాద్ సిటీ ఐటీ సంస్థలను, రియల్ ఎస్టేట్ డెవలపర్లను ఆకట్టుకుంటూనే ఉంది. హైదరాబాద్ సిటీలో భూములు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి అనడానికి కోకాపేట్, బుద్వేల్ ప్రాంతాల్లో వేలం పాటలే నిదర్శనం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఒక్క కోకాపేట ప్రాంతంలో 45 ఎకరాల భూమిని వేలం వేయడం ద్వారా సుమారు 3,300 కోట్ల రూపాయలను ఆర్జించింది. దీనికి కారణం కోకాపేట పరిసరాల్లో చాలా పెద్ద ఐటి కంపెనీలు తమ ప్రాంగణాలను ఏర్పాటు చేసుకోవడమేనని విశ్లేషకులు అంటున్నారు. ఎంఎస్ఎన్ ఫార్మాకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, నవత్రీస్ ఇన్వెస్ట్‌మెంట్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, డి బ్లూయోక్ అండ్ పీ మంగత్రామ్, ప్రాపర్టీస్ ఎల్ఎల్పీ, హ్యాపీ హైట్స్ నియోపోలిస్ వంటి సంస్థలు తమ కంపెనీల అభివృద్ధి కోసం హైదరాబాద్ భూములను వందల కోట్లకు కొనుగోలు చేశాయి. మరోవైపు సివిక్ అథారిటీ కోకాపేట్‌లోని నియోపోలిస్‌లో ఓపెన్ ప్లాట్లకు కూడా ఈ-వేలం నిర్వహించింది. ఈ వేలం ద్వారా హెచ్ఎండీఏకు 1,586.50 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

తాజాగా ఆగస్టు 10వ తేదీన నైరుతి హైదరాబాద్ ప్రాంతంలోని బుద్వేల్‌లో భూములను హెచ్ఎండీఏ వేలం వేయగా అనూహ్య స్పందన వచ్చింది. అయితే కోకాపేట లాగా ఎకరం వంద కోట్ల కాకపోయినా మొత్తం వంద ఎకరాలను వేలం వేస్తే ఏకంగా 3,625 కోట్ల రూపాయల ఆదాయం హెచ్ఎండీఏకు సమకూరింది. అంటే భూములను అమ్ముకోవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోకాపేట, బుద్వేల్ కలిపి ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయలను కేవలం పది రోజుల వ్యవధిలో సమకూర్చుకుందన్నమాట. కోకాపేట స్థాయిలో బుద్వేల్ వేలం సాగకపోయినప్పటికీ ఆదాయం మాత్రం బాగానే సమకూరింది. ముందుగా ఆశించిన దానికంటే డబుల్ ఆదాయం రావడంతో హైదరాబాద్ భూములకున్న డిమాండ్ ఏమిటో అర్థమైపోయింది. నగర శివార్లలోని రాజేంద్ర నగర్ సమీపంలో వున్న బుద్వేల్ కొండ మీద వంద ఎకరాల భూములను రెండు సెషన్లలో వేలం వేశారు. వంద ఎకరాల భూమిని మొత్తం 14 ప్లాట్లుగా విభజించి వేలం నిర్వహించారు. మార్నింగ్ సెషన్‌లో మొత్తం 7 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించగా 2 వేల 57 కోట్లకు అవి అమ్ముడయ్యాయి. మధ్యాహ్నం సెషన్‌లో మరో ఏడు ప్లాట్లు వేలం వేశారు. వాటికి 1,568 కోట్లు వచ్చాయి. వీటిలో 15 నెంబర్ ప్లాటు అత్యధికంగా ఎకరం 41.75 కోట్లు పలికింది. 15వ ప్లాటులో మొత్తం 7.16 ఎకరాల భూమి వుంది. 298.93 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రియల్ ఎస్టేట్ పరంగా బుద్వేల్ అత్యంత కీలకం కావడం వల్లనే సంస్థలు పోటీ పడి మరీ బిడ్లు వేసినట్లు అర్థమవుతోంది. ఈ ప్రాంతానికి సమీపం నుంచి త్వరలో రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైలు మార్గం నిర్మాణం కాబోతోంది. స్ట్రాటెజికల్లీ ఈ ప్రాంతం కీలకమని భావించడం వల్లనే భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రాంతంలో విల్లాలు, హై లెవెల్ అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరిగితే పక్కనే వున్న హిమాయత్ సాగర్ వ్యూ సూపర్‌గా వుంటుందని అంటున్నారు.

ఓవైపు కోకాపేట, మరోవైపు బుద్వేల్ భూములు వందల కోట్ల రూపాయలకు అమ్ముడవడంతో హైదరాబాద్ సిటీలోని రియల్ ఎస్టేట్ సంస్థలు దానికి సొమ్ము చేసుకునేందుకు అప్పుడే రంగంలోకి దిగాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు తమ వెంచర్లను అమ్ముకోవడానికి ఈ వేలం పాటకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగులను విస్తృతంగా వాడుకోవడం మొదలైంది. ఈ ట్రెండు కోకాపేట వేలం నాడే మొదలైనా.. తాజాగా బుద్వేల్ భూముల వేలం తర్వాత మరింత ఊపందుకుంది. నైరుతి, పశ్చిమ హైదరాబాద్ శివార్లలో నగర విస్తీర్ణం చేవెళ్ళ, శంకర్‌పల్లి, సంగారెడ్డి మీదుగా సదాశివపేట దాకా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో మెట్రో రైలును ఏకంగా 415 కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన జరుగుతోంది. ముందుగా ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుత మెట్రోని నిర్మించిన ఎల్ అండ్ టీకే ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తుంది. సెప్టెంబర్ నెలలో నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారని అంటున్నారు. సిటీ నుంచి నలుమూలలా ఔటర్ రింగు రోడ్డు దాకా మెట్రో రైలు వేయాలని తలపెట్టిన నేపథ్యంలో వచ్చే నాలుగైదు సంవత్సరాలలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్‌కు రెక్కలు రావడం ఖాయంగా వుంది. దానికితోడు రియల్ ఎస్టేట్ సంస్థల జిమ్మిక్కులు తోడైతే భూముల ధరలతోపాటు ప్లాట్లు, ఫ్లాట్లతోపాటు కమర్షియల్ స్పేసెస్ ధరలు ఆకాశాన్నంటడం తప్పనిసరిగా కనిపిస్తోంది.