AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scorpion Festival: విచిత్రమైన సాంప్రదాయం.. తేళ్లతో సయ్యాటలు.. ఇలవేల్పుగా పూజలు

Scorpion Festival:: ఆ గుట్టపైనున్న ఏ చిన్న రాయిని కదిలించినా...ఓ తేలు కనిపిస్తుంది. వాటిని పట్టుకున్నా లేదా మన శరీరంపై పెట్టుకున్నా అవి ఎలాంటి హానీ కలిగించవు. అది కూడా ఒక్క నాగుల పంచమీ రోజు మాత్రమే.

Scorpion Festival: విచిత్రమైన సాంప్రదాయం.. తేళ్లతో సయ్యాటలు.. ఇలవేల్పుగా పూజలు
Scorpion Festival
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 14, 2021 | 7:03 PM

ఆ గుట్టపైనున్న ఏ చిన్న రాయిని కదిలించినా…ఓ తేలు కనిపిస్తుంది. వాటిని పట్టుకున్నా లేదా మన శరీరంపై పెట్టుకున్నా అవి ఎలాంటి హానీ కలిగించవు. అది కూడా ఒక్క నాగుల పంచమీ రోజు మాత్రమే. మిగతా రోజుల్లో ఆ గుట్టపైనున్న తేళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తే అవి కుట్టేస్తాయి. మిగతా ప్రాంతంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు నాగదేవతకు పూజలు చేస్తే ఇక్కడి ప్రజలు మాత్రం తేళ్లకు పూజలు(తేళ్ల పంచమి) చేస్తారు. నారాయణపేట జిల్లా నుంచి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరంలో కర్నాటకలోని యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామం ఉంది. ఆ గ్రామ శివారులోని గుట్టపై కొండ మహేశ్వరమ్మ అమ్మవారి గుడి ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. కర్నాటకతో పాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. తేళ్లతో సయ్యాటలు ఆడుతారు.  తేళ్లను ఇలవేల్పుగా కొలుస్తారు ఇక్కడి ప్రజలు. కొండపై వెలసిన కొండమహేశ్వరమ్మ అమ్మవారు మహిమ కలిగి, భక్తుల కోరికలు తీరుస్తుందని నమ్మకం.

శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు కందుకూరు గుట్టపై ఒక్క సారిగా తేళ్లు బయటికి వస్తాయి. గుట్టపై ఉన్న ప్రతి రాయి కింద ఓ తేలు ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఆ తేళ్లు ఎలాంటి హాని కలిగించవు. అమ్మవారి మహిమ వల్ల తేళ్లను పట్టుకున్నా అవి కుట్టవని భక్తుల నమ్మకం. కొండ మహేశ్వరమ్మ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులంతా గుట్టపై తేళ్లను పట్టుకోడానికి వెళ్తారు. చిన్న పెద్ద, ఆడ మగా తేడా లేకుండా అందరు గుట్టపై ఉన్న ప్రతి రాయిని కదిలిస్తారు. తేలు కన్పించగానే వాటిని చేతిలోకి తీసుకొని విన్యాసాలు చేస్తారు. ఎంత చేసినా ఆ తేళ్లు మాత్రం ఎవరినీ కుట్టవు. ఆ తేళ్ల మహిమను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.

ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తుండడంతో కర్నాటక ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఇతర మార్గాల ద్వారా గుట్టపైకి చేరుకున్నారు భక్తులు. కొండపైకి చేరుకున్న భక్తులను త్వరగా పంపించే ప్రయత్నం చేశారు పోలీసులు. దర్శనం పూర్తయిన వారు వెంటనే వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడా లేని విధంగా కొండమరేశ్వరమ్మ దేవాలయం వద్ద నాగపంచమీ సందర్భంగా తేళ్లను ముట్టుకున్నా, వాటిని చేతితో పట్టుకున్నా అవి ఎలాంటి హానీ కలిగించవని…ఇది ఈ దేవస్థానం విశిష్టత అని భక్తుడు గంగప్ప తెలిపారు.

నాగపంచమీ రోజున గుట్టపై ఉన్న తేళ్లు మత్తులో ఉంటాయి కాబట్టి భక్తులకు ఎలాంటి హానీ కలిగించవని, అమ్మవారి మహిమ మాత్రమేనని మరో భక్తురాలు శ్రీవల్లి చెబుతున్నారు. నాగపంచమీ రోజు ఉదయాన్ని నాగుపాము వచ్చి కొండమహేశ్వరమ్మ అమ్మవారిని దర్శించుకుని వెళుతుందని, ఆ తర్వాత గుట్టపైన తేళ్లు పెద్ద సంఖ్యలో బయటికి వస్తాయని, అవి భక్తులను హాని కలిగించవని చెబుతున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు.

గతంలో ఈ గుట్టపై పనులు నిర్వహించేందుకు వచ్చిన అధికారి రెండు కళ్లు కన్పించకుండా పోయాయి. దీంతో గ్రామస్తులులంతా వచ్చి అమ్మవారికి కోపం వచ్చిందని, అందుకు కళ్లు కనిపించడం లేదని చెప్పారు. దీంతో అమ్మవారికి గుడి కట్టిస్తాననని మొక్కుకోవడంతో మళ్లీ కళ్లు కనిపించసాగాయని స్థానికులు చెబుతున్నారు. నాటి నుంచి ఈ అమ్మవారి మహిమ వెలుగులోకి వచ్చింది చెబుతున్నారు.

(సమి, మహబూబ్‌నగర్ జిల్లా, TV9 తెలుగు)

Also Read..

Nag Panchami 2021: నాగుల పంచమి వేళ పాముకు హ్యపీ బర్త్ డే.. నెట్టింట రచ్చ చేస్తోన్న వీడియో

Viral Video: కెమెరా కళ్లకు చిక్కిన అత్యంత అరుదైన చేప.. సోషల్ మీడియాలో వీడియో వైరల్