BJP: లోక్ సభ ఎన్నికల వేళ కమలనాథుల సంకల్ప పత్రం.. మేనిఫెస్టో ఎలా ఉంటుంది?
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజాకర్షక హామీలు గుప్పిస్తున్నాయి. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండానే తమ మేనిఫెస్టోల్లో పొందుపరుస్తున్నాయి. ఎలాగైనా సరే కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో భారతీయ జనతా పార్టీ (BJP)ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ మేనిఫెస్టోను విడుల చేసింది. అన్యాయమైపోతున్న దేశానికి, దేశ ప్రజలకు తాము న్యాయం చేస్తామంటూ 'న్యాయ్ పత్ర్' పేరుతో 5 న్యాయాలు, 25 గ్యారంటీలు (పాంచ్ న్యాయ్ - పచ్చీస్ గ్యారంటీ) అంటూ హామీలవర్షం కురిపించింది.
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజాకర్షక హామీలు గుప్పిస్తున్నాయి. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండానే తమ మేనిఫెస్టోల్లో పొందుపరుస్తున్నాయి. ఎలాగైనా సరే కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో భారతీయ జనతా పార్టీ (BJP)ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ మేనిఫెస్టోను విడుల చేసింది. అన్యాయమైపోతున్న దేశానికి, దేశ ప్రజలకు తాము న్యాయం చేస్తామంటూ ‘న్యాయ్ పత్ర్’ పేరుతో 5 న్యాయాలు, 25 గ్యారంటీలు (పాంచ్ న్యాయ్ – పచ్చీస్ గ్యారంటీ) అంటూ హామీలవర్షం కురిపించింది. కాంగ్రెస్ బాటలో దేశంలోని అనేక ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా భారీ హామీలతో తమ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. కానీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్నా.. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ మాత్రం తమ మేనిఫెస్టో విడుదల చేయలేదు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఈ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. పైగా శ్రీరామ నవమి నవరాత్రుల్లోనే ఈ తేదీ ఉండేలా ముందే ప్రణాళికలు రచించుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ‘న్యాయ్ పత్ర్’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేస్తే.. బీజేపీ ‘సంకల్ప్ పత్ర్’ పేరుతో విడుదల చేయనున్నట్టు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సంయుక్తంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.
మేనిఫెస్టో కోసం మేథోమథనం..
మేనిఫెస్టో తయారీ కోసం బీజేపీ నాయకత్వం తీవ్ర కసరత్తు చేసింది. ఇందుకోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీని పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అనేక సమావేశాలు నిర్వహించింది. పార్టీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతీ రంగంపై లోతైన చర్చ, విశ్లేషణ చేసి దేశాన్ని ఆయా రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాల్సి ఉంటుందో ఒక అవగాహనకు వచ్చింది. అంతటితో సరిపెట్టకుండా ప్రజల నుంచి కూడా పార్టీ సలహాలు, సూచనలు కోరింది. లక్షన్నర మందికి పైగా వీడియో ద్వారా పార్టీకి తమ సూచనలను పంపించారు. ఇది మాత్రమే కాదు, ‘నమో యాప్’ ద్వారా 40 వేలకు పైగా సూచనలు వచ్చాయి. అన్నిరూపాల్లో కలిపి బీజేపీ తన మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సుమారు 5 లక్షల సూచనలు అందుకుంది. రాజకీయ ప్రత్యర్థుల మేనిఫెస్టోను, హామీలను సైతం విశ్లేషించినట్టు తెలిసింది. తద్వారా ప్రజలను ఆకట్టుకోవడం కోసం తప్పుడు హామీలు లేకుండా, చేసేదే చెప్పాలని, చెప్పిందే చేసి చూపించామని ప్రజలకు అర్థమయ్యేలా ఈ మేనిఫెస్టో రూపొందించినట్టు తెలిసింది.
మూడో పర్యాయం గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్న కమలనాథులు.. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించుకున్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం, యువత, మహిళలు, పేదలు మరియు ముఖ్యంగా రైతులకు సంబంధించి పెద్ద ప్రకటనలను బీజేపీ చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి మేనిఫెస్టో థీమ్‌గా ‘మోదీ హామీ: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం’ నినాదాన్ని నిర్ణయించినట్టున్న తెలిసింది. ఆ అభివృద్ధి సాధనలో ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని సూచిస్తూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ‘సంకల్ప్ పత్ర్’ సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభివృద్ధి – సంక్షేమం సమతూకం..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ గత పదేళ్ల పాలనను గమనిస్తే.. దేశాభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చినట్టు స్పష్టమవుతుంది. దేశాభివృద్ధిలో మౌళిక వసతులు, మెరుగైన రవాణా వ్యవస్థదే కీలక పాత్ర అని బీజేపీ విశ్వసిస్తుంది. అందుకే గత యూపీఏ పాలనతో పోల్చితే నిర్మించిన జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ రహదారుల సంఖ్యా ఎక్కువే.. పరిమాణమూ ఎక్కువే. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లలో నిర్మించిన జాతీయ రహదారుల పొడవు 25.7 వేల కి.మీ కాగా.. ఎన్డీఏ హయాంలో నిర్మించిన జాతీయ రహదారుల పొడవు 54.9 వేల కి.మీ. అలాగే కొన్ని అంచనాల ప్రకారం 2014 నాటికి రోజుకు 11.6 కి.మీ రహదారుల నిర్మాణం జరిగితే, నేడు రోజుకు 30 కి.మీ రహదారుల నిర్మామం జరుగుతోంది. ప్రస్తుతం అమెరికా తర్వాత రోడ్ నెట్‌వర్క్‌లో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. రైల్వే నెట్‌వర్క్ బలోపేతం చేయడంలోనూ ఇదే వేగం కనిపించింది. అలాగే దేశంలోని దాదాపు 95% రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ పూర్తిచేసుకుంది. మరిన్ని సదుపాయాలతో శరవేగంగా ప్రయాణించే ‘వందే భారత్’ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదే తరహాలో విమానయానం పుంజుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే, విమాన ప్రయాణ సదుపాయాలు మెరుగయ్యాయి. దేశవ్యాప్తంగా కొత్త విమానాశ్రయాలు, ద్వితీయ శ్రేణి నగరాలను దాటుకుని పట్టణాలకు కూడా విస్తరించాయి. దీంతో పాటు అంతరిక్ష రంగంలోనూ భారత్ తనదైన ముద్ర వేసుకుంది.
యావత్ ప్రపంచాన్ని కోవిడ్-19 మహమ్మారి కుదిపేసినా.. భారత్ నిలదొక్కుకుని, పీపీఈ కిట్లు, మాస్కుల నుంచి మొదలుపెట్టి.. సొంతంగా వ్యాక్సిన్ తయారుచేసుకునే వరకు భారత్ అనుసరించిన విధానం ప్రపంచానికే దిక్సూచిగా నిలిచింది. తన అవసరాలతో పాటు ప్రపంచ అవసరాలను తీర్చేలా భారత్ ఎదిగింది. దేశాభివృద్ధి సూచీల్లో ఇవన్నీ కీలకమైన మైలురాళ్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. కోవిడ్-19 సమయం నుంచే అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకం ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’, ఉజ్వల తదితర పథకాలతో నిరుపేదలకు సంక్షేమం అందజేసినట్టు వివరిస్తున్నారు. కొన్ని గణాంకాల ప్రకారం దేశంలో అత్యంత పేదరికం నుంచి 20 కోట్లకు పైగా జనాభాను బయటకు తీసుకొచ్చినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ వంటి పార్టీలు నిరుద్యోగ సమస్య, అధిక ధరలు, అప్రజాస్వామిక విధానాలు, పార్టీ ఫిరాయింపులకు కళ్లెం వేయడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో వాటన్నంటికీ జవాబు చెప్పేలా తమ మేనిఫెస్టో ఉండాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాలతో పాటు, దేశంలో ధనిక, పేద మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించే దిశగానూ అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా బీజేపీ విడుదల చేయబోయే మేనిఫెస్టో కోసం యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..