Agnipath scheme Agniveer: అసలేంటీ ఈ అగ్నిపథ్ పథకం? అగ్నిపథ్ పథకంతో ప్రయోజనం ఎవరికి? పూర్తి వివరాలు మీకోసం..
Agnipath scheme Agniveer: భారత సైన్యంలో చేరేందుకు కలలు కంటున్న యువతకు తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం అగ్నిపథ్ పథకం కింద..
Agnipath scheme Agniveer: భారత సైన్యంలో చేరేందుకు కలలు కంటున్న యువతకు తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం అగ్నిపథ్ పథకం కింద సువర్ణ అవకాశం కల్పిస్తుంది. 17.5 సంవత్సరాల నుంచి 23ఏళ్ల మధ్య ఉన్న యువతను అగ్నిపథ్ కింద ఏడాదికి 46 వేలమందిని రిక్రూట్ చేసుకుంటుంది. యువతకు నాలుగేళ్ల పాటు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం కల్పించి.. నెలకు 30 నుంచి 40 వేల రూపాయల మధ్య జీతం ఇస్తారు. నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని ఇండియన్ ఆర్మీలో కొనసాగించి మిగిలిన వారికి సేవా నిధి ప్యాకేజ్ అందిస్తారు.
అగ్నిపథ్ లో చేరి అగ్ని వీర్ లు సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా వారికి రూ. 48 లక్షల జీవిత బీమా కల్పిస్తుంది కేంద్రం ప్రభుత్వం. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తుంది. అలాగే సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం 100 శాతం ఉంటే రూ. 44 లక్షలు, 75 శాతమైతే రూ. 25 లక్షలు, 50 శాతమైతే రూ. 15 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తారు. ఎలాంటి సమస్యలు లేని అగ్ని వీర్ లకు వారి జీతంలో కొంత మొత్తాన్ని కార్పస్ ఫండ్ జమచేస్తారు. నాలుగేళ్ల తర్వాత కర్పస్ ఫండ్ రూ. 5లక్షలకు కేంద్రం మరో రూ. 5 లక్షలు కలిపి మొత్తం రూ. 11.71 లక్షలు చెల్లిస్తుంది.
యువతలో జాతీయ భావాన్ని బలోపేతం చేయడం, భారత సైన్యాన్ని యువసైన్యంగా మార్చడం, సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే యువత ఆకాంక్షను నెరవేర్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా భారత సైన్యాన్ని ఎలా అప్‌గ్రేడ్ చేయాలనే అంశంపై చాలా కాలంగా జరుగుతున్న చర్చలో భాగంగానే అగ్నిపథ్ పుట్టుకొచ్చిందని చెబుతున్నారు అధికారులు. కోవిడ్ కాలంలో భారతదేశంలో నిరుద్యోగం రేటు 25 శాతానికి చేరుకుంది. దేశంలో ఉద్యోగాలు రాకపోవడం పెద్ద సమస్యగా మారిన తరుణంలో వచ్చే ఏడాదిన్నర కాలంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం.
ఒకపక్క అగ్నిపథ్ పై దేశ వ్యప్తంగా హింసాత్మక ఘటనలు జరుగుతుంటే కేంద్రం వయో పరిమితి పెంపును 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు తమకు చేరాయని చెప్పారు భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే. అతి త్వరలోనే అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీరుల ఎంపిక కోసం ప్రకటనను విడుదల చేస్తామన్నారు. అగ్నివీరులుగా సైన్యంలో చేరే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యువతను కోరారు.