AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రణక్షేత్రంలో మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రయాణీకులు.. పూర్తి వివరాలివే

ఒకే ఒక్క గంటలో అగ్గిబుగ్గయ్యింది. నిత్యం ప్రయాణీకులతో నిండుకుండలా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) రణరంగంగా మారింది. ప్రతిధ్వనిస్తోన్న తుపాకీ తూటాల శబ్దం ఓ వైపు. వెల్లువలా దూసుకొస్తోన్న విద్యార్థులు మరోవైపు....

రణక్షేత్రంలో మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రయాణీకులు.. పూర్తి వివరాలివే
Secunderabad Riots News Upd
Ganesh Mudavath
|

Updated on: Jun 18, 2022 | 6:28 AM

Share

ఒకే ఒక్క గంటలో అగ్గిబుగ్గయ్యింది. నిత్యం ప్రయాణీకులతో నిండుకుండలా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) రణరంగంగా మారింది. ప్రతిధ్వనిస్తోన్న తుపాకీ తూటాల శబ్దం ఓ వైపు. వెల్లువలా దూసుకొస్తోన్న విద్యార్థులు మరోవైపు. అంతా అర్థగంటలోనే అల్లకల్లోలంగా మారింది. నిప్పులు కక్కుతోన్న రైలు బోగీలు ఓ వైపు. విధ్వంసానికి గుర్తుగా పోగుబడిన శిథిల వ్యర్థాలు మరోవైపు. ఏం జరుగుతోందో అర్థం కాని గందరగోళంలో కొట్టుమిట్టాడుతోన్న ప్రయాణికుల ఇక్కట్లపై టీవీ9 స్పెషల్‌ స్టోరీ.. సికింద్రాబాద్‌లో రాజుకున్న అగ్నిపథ్ అగ్ని కీలల సెగ సికింద్రాబాద్‌ మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు అలుముకుంది. ఆకలై ఏడుస్తోన్న బిడ్డకి పాలుపట్టే పరిస్థితి లేక ఏం చేయాలో పాలుపోక బిత్తర పోయి చూస్తోన్న ఓ ప్రయాణికురాలు. ఏదో అత్యవసర పనిమీద బయలుదేరిన ఓ నడివయస్కుడు. ఆరోగ్యం కోసం రైలెక్కేందుకు వచ్చిన ఓ వయోవృద్ధుడు. ఆసుపత్రికి వెళ్ళేందుకు అతికష్టం మీద అపాయింమెంట్‌ సాధించి నగరానికి బయలుదేరిన ఓ మహిళ రైల్వే స్టేషన్‌లో బిక్కు బిక్కుమంటూ ఉండిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి దృశ్యాలే ఇప్పుడు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎటు చూసినా కంగారు పెట్టిస్తున్నాయి. ప్రయాణీకుల అవస్థలకు అద్దం పడుతున్నాయి.

గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో సికింద్రాబాద్‌లో రాజుకున్న అగ్నిపథ్‌ జ్వాలలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాయి. రైల్వే స్టేషన్లలో జనం బెంబేలెత్తిపోయారు. ఏం చేయాలో తెలియక, ఏం జరుగుతుందో అర్థం కాక, పిల్లాపాపలను చంకనెత్తుకొని పరుగులు పెట్టారు. ఎటెళ్లాలో తెలియదు. రైల్వే స్టేషన్‌ రణరంగాన్ని తలపిస్తోంది. బయటకు పరుగులు పెడదామన్నా తుపాకుల మోత శబ్దం భయాందోళనలకు గురిచేస్తోంది. టియర్‌ గ్యాస్‌ ప్రయోగాలు, లాఠీ చార్జీలు, తోపులాట, పోలీసులు, అంతా అర్థగంటలోనే గందరగోళంగా మారింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ బయటున్న బస్‌ స్టాండులోనూ అదే పరిస్థితి. బస్సులను తగలబెట్టారు. పొగ, దుర్వాసన. పసిబిడ్డలను కాపాడుకోవడానికి తల్లులు పరుగులు పెట్టారు. ఓ తల్లి బిడ్డని ఒడిలో దాచుకుని ఈ గందరగోళం కళ్ళబడకుండా బెరుకు బెరుకుగా కాపాడుకుంటోంది. మరో చోట పొత్తిళ్ళలోని గుడ్డుని ఎత్తుకొని ఊరెళదామని రైల్వే స్టేషన్‌కి వచ్చిన మరో తల్లి పరిస్థితి అగమ్య గోచరం.

ఈ రోజు ప్రయాణం కోసం కొన్ని నెలల క్రితం ఎంతో శ్రమకోర్చి చేయించుకున్న రిజర్వేషన్లు వృధాప్రయాసగానే మిగిలిపోయాయి. సెలవులు.. పెళ్ళిళ్ళు.. కుటుంబ అవసరాలు.. ఎంతో ముందుచూపుతో ప్రయాణికులు ప్లాన్ చేసుకున్నదంతా ఒక్క గంటలో తారుమారయ్యింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసకాండతో రైళ్ళు రద్దయ్యాయి. దీంతో ప్రయాణీకుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కాల్పులు, రాళ్లదాడులతో రైల్వే స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. తాగడానికి చుక్క నీళ్ళు లేవు. కొనుక్కోడానికి ఒక్క షాపులేదు. గుక్కపెట్టి ఏడుస్తోన్న పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది.

ఇవి కూడా చదవండి

సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరాల్సిన రైళ్ళను కొన్ని రద్దు చేశారు. మరికొన్నిటిని రూట్లు డైవర్ట్ చేశారు. దీంతో ఏ రైలు ఉందో, ఏ రైలు రద్దయ్యిందో తెలియక జనం గందరగోళానికి గురయ్యారు. ఎటెళితే గమ్యం చేరతామో అర్థంకాని దయనీయమైన పరిస్థితిలో తిప్పలు పడ్డారు. సికింద్రాబాద్‌లో అగ్నిపథ్‌ నిరసన గళం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైలు ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తించింది. ఉన్నఫళంగా రైళ్ళు క్యాన్సిల్‌ కావడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. అసలు మొత్తం ఎన్ని రైళ్ళు క్యాన్సిల్‌ అయ్యాయి. వాటిని ఎప్పటికి పునరుద్ధరిస్తారు? ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితేమిటి? అనే విషయాలు తెలియక గందరగోళానికి గురయ్యారు.

ప్రయాణికుల సౌకర్యం కోసం విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఎంక్వయిరీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. రైల్వే ఉద్యోగులు రైళ్ళ రాకపోకల సమాచారాన్ని, ఇతర సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ మొత్తం ఆందోళనకారుల ఆగ్రహంలో ధ్వసంమయ్యింది. తుపాకీ తూటాలకు ఓ యువకుడు బలయ్యాడు. అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రయాణికులు ఎంత మంది ఎన్ని అవస్థలు పడ్డారో చెప్పడం ఊహకు అందడం లేదు. కనీసం స్టేషన్‌ నుంచి పసిబిడ్డలను ఎత్తుకొని తప్పించుకునే పరిస్థితి కూడా లేదు. వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

సికింద్రాబాద్‌లో జరిగిన భీభత్సానికి 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీగా పోలీసులను దించారు. స్టేషన్‌లోకి ఎవరినీ అనుమంతించడం లేదు. వరంగల్‌, నిజామాబాద్‌, డోర్నకల్‌, మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్లలో బందోబస్తు పెంచారు. రద్దయిన రైళ్లు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియదు. రిజర్వేషన్లు చేయించుకున్న వారి పరిస్థితేమిటో ఇంకా వెల్లడించాల్సి ఉంది. జనరల్‌ టిక్కెట్ల ఇక్కట్లేంటో అర్థంకాని పరిస్థితి ప్రయాణీకులను గందరగోళానికి గురిచేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..