AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: వాయనాడ్.. అమేఠీ.. ఇంతకీ లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ పోటీ ఎక్కడ?

ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోయినా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయాయి. పార్టీలు, సిద్ధాంతాలు చూసి ఓటేసే రోజులు పోయి ప్రధాని లేదా సీఎం అభ్యర్థి ఎవరు అన్నది చూసి ఓటేసే రోజులు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని అధికార 'నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్' (NDA) కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ కనిపిస్తున్నారు. 'ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్' (I.N.D.I.A) పేరుతో జట్టుకట్టిన విపక్ష కూటమి అధికారికంగా తమ ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు.

Congress: వాయనాడ్.. అమేఠీ.. ఇంతకీ లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ పోటీ ఎక్కడ?
Rahul GandhiImage Credit source: ANI
Mahatma Kodiyar
| Edited By: Srikar T|

Updated on: Feb 29, 2024 | 11:57 AM

Share

ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోయినా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయాయి. పార్టీలు, సిద్ధాంతాలు చూసి ఓటేసే రోజులు పోయి ప్రధాని లేదా సీఎం అభ్యర్థి ఎవరు అన్నది చూసి ఓటేసే రోజులు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని అధికార ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్’ (NDA) కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ కనిపిస్తున్నారు. ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్’ (I.N.D.I.A) పేరుతో జట్టుకట్టిన విపక్ష కూటమి అధికారికంగా తమ ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదన్న విషయం అందరికీ తెలుసు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీలో గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీయే తమ కాబోయే ప్రధాని అంటూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతుంటారు. అవకాశం దొరికితే ప్రధాని పీఠంపై కూర్చునేందుకు మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్ వంటి నేతలు ఎదురుచూస్తున్నప్పటికీ.. మొత్తంగా దేశంలో ఎన్నికల వాతావరణం నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగా తయారైంది. ఈ ఇద్దరిలో ప్రజలు ఎవరిని ప్రధానిగా కోరుకుంటారో ఆ పార్టీకి లేదా కూటమికి ఓటు వేయాలి అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ప్రధాని అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచే మళ్లీ పోటీ చేస్తారన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. కానీ విపక్ష కూటమి అప్రకటిత ప్రధాన అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ పోటీ చేసే నియోజకవర్గం విషయంలోనే సందిగ్ధత నెలకొంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని గాంధీ-నెహ్రూ కుటుంబ కంచుకోటగా చెప్పుకునే అమేఠీతో పాటు కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, కంచుకోటలో ఓటమిపాలై వాయనాడ్ విజయంతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఆయన ఎక్కణ్ణుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది.

ఉత్తరాదిని విస్మరిస్తే మొదటికే మోసం

ఢిల్లీ పీఠం ఎక్కాలంటే యూపీ గెలవాలి అన్నది రాజకీయాల్లో చాలాకాలంగా కొనసాగుతున్న నానుడి. అత్యధిక జనసంఖ్య, అత్యధిక పార్లమెంటు స్థానాలతో ఉత్తర్‎ప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాలను నిర్దేశిస్తూ వస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులోనూ ఈ రాష్ట్రం పాత్రను విస్మరించలేనిది. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా రాయ్‌బరేలి, అమేఠీ వంటి గాంధీ-నెహ్రూ కుటుంబ కంచుకోట స్థానాల్లో మినహా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన సందర్భాలు పెద్దగా లేవు. గత ఎన్నికల్లో ఆ కంచుకోటకు కూడా బీటలు పడ్డాయి. రాహుల్ గాంధీయే స్వయంగా అమేఠీలో ఓటమిపాలవగా.. చావుతప్పి కన్నులొట్టపోయిన స్థితిలో సోనియా గాంధీ రాయ్‌బరేలీలో గట్టెక్కారు. ఈ ఐదేళ్లలో ఈ ప్రాంతంలో గాంధీ-నెహ్రూ కుటుంబం తమ పట్టును నిలబెట్టుకునే ప్రయత్నాలు కూడా పెద్దగా చేయలేదు. దీంతో సర్వే ఫలితాల్లోనూ ప్రతికూలతే కనిపిస్తోంది. అయితే ఇండి-కూటమి మిత్రపక్షాల బలంతోనైనా తమ కంచుకోట స్థానాలను నిలబెట్టుకుంటామన్న నమ్మకం ఆ పార్టీ పెద్దలకు కలగడం లేదు. అందుకే అమేఠీ నుంచి మళ్లీ పోటీ విషయంలో ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. కేరళలోని వాయనాడ్ మాత్రం తమకు ‘సేఫ్ సీట్’ అనుకుంటున్నారు. కానీ ‘దేశంలో ఎక్కడైనా మిత్రులమే.. కేరళలో మాత్రం కాదు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్‌కు తంటా వచ్చింది. రాహుల్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వాయనాడ్ లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థిగా ‘అన్నీ రాజా’ను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) సోమవారం ప్రకటించింది. కాంగ్రెస్, సీపీఐ రెండూ బీజేపీ వ్యతిరేక ఇండి-కూటమిలో భాగమే అయినప్పటికీ, కేరళలో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించడానికి దాదాపు నెల రోజుల ముందే రాహుల్ గాంధీకి సీపీఐ అగ్రనేత డి. రాజా ఒక సలహా ఇచ్చారు. రాహుల్ గాంధీ ఉత్తరాది రాష్ట్రాల్లోనే పోటీ చేసి బీజేపీని ఢీకొట్టాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాది రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు రెండు పార్టీలపై విరుచుకుపడటం మరిచిపోలేదు. ఈ రెండు పార్టీలు కేరళలో మాత్రం శత్రువులని, రాష్ట్రం వెలుపల మంచి స్నేహితులని మోదీ అన్నారు. అందుకే కమ్యూనిస్టులు యువరాజు రాహుల్ గాంధీని తమ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుకోవడం లేదని, తలుపులు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

గుజరాతీ మోదీ యూపీ నుంచే ఎంపీ

దేశంలోని 543 స్థానాల్లో యూపీ, బిహార్ రాష్ట్రాల్లోనే 120 సీట్లున్నాయి. ఇక్కడ పట్టు సాధించకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని గ్రహించిన నరేంద్ర మోదీ 2014లోనే తన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదరతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరి వారణాసి నుంచి పోటీ చేశారు. హిందువుల పురాతన పవిత్ర నగరమైన వారణాసి, పవిత్ర గంగానది ప్రవహించే పరమశివుడి నగరి అని విశ్వసిస్తారు. అలాంటి ప్రాంతం నుంచి పోటీ చేయడం ద్వారా మతమరమైన సెంటిమెంటుకు తోడు రాజకీయంగా వారణాసి యూపీ, బిహార్ రాష్ట్రాలకు సరిగ్గా మధ్యలో ఉంది. ఇక్కడ ప్రజలు విభిన్న మాండలికాలతో కూడిన హిందీ మాట్లాడతారు. మోదీ వారణాసికి రావడం వల్ల యూపీతో పాటు పొరుగున ఉన్న బీహార్‌లోనూ ప్రభావం చూపుతుందని భావించారు. అనుకున్నట్టే రెండు రాష్ట్రాల్లో అప్పటి వరకు బీజేపీ ఎదుర్కొన్న ప్రతికూలత, వ్యతిరేకత దాదాపు తుడిచిపెట్టేయగల్గింది.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ లేదా విపక్ష ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, ఈ రెండు రాష్ట్రాల్లో కనీసం సగం లేదా దాదాపు 50 నుండి 60 సీట్లు గెలుచుకోవాలి. కూటమిలో అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఉత్తరాదిని వీడి దక్షిణాదిలో మాత్రమే పోటీ చేస్తే ఆయన కేవలం ఎంపీ మాత్రమే కాగలరు తప్ప ప్రధాని కాలేరు. ఎంపీగా గెలవాలంటే కేరళలోని వాయనాడ్‌ లేదా కాంగ్రెస్ బలంగా ఉన్న మరో దక్షిణాది రాష్ట్రం నుంచి పోటీ చేయవచ్చు. కానీ రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ నుంచి వైదొలిగితే, కాంగ్రెస్ ఆ రాష్ట్రం నుంచి మూటాముల్లె సర్దుకోక తప్పదు. అలా చేస్తే యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాయనాడ్ లేదా అమేఠీ.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే, రాహుల్ గాంధీ అమేఠీకే వెళ్లాలని సూచిస్తున్నారు. సోనియా గాంధీ కూడా రాయ్‌బరేలీ బరి నుంచి తప్పుకుని రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. ఆ స్థానంలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సోనియా లేదా ఆ కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కోరుతోంది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ, రాజకీయ పండితుల సూచనల సంగతెలా ఉన్నా.. రాహుల్ గాంధీ ఎక్కణ్ణుంచి పోటీ చేస్తారన్న విషయంలో కాంగ్రెస్ శ్రేణుల్లో సందిగ్దత కొనసాగుతోంది. దీనికి ఎంత త్వరగా తెరదించితే ఆ పార్టీకి, కూటమికి అంత మంచిదని గ్రహించాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..