Watch Video: స్విమ్మింగ్ పూల్‌లో స్టంట్.. 10 సెకండ్లలోనే పోయిన ప్రాణం! వీడియో వైరల్..
రాజస్థాన్‌లోని కోటాలోని ఓ ఫార్మ్ హౌస్‌లో జరిగిన స్విమ్మింగ్ పూల్ స్టంట్ ఒక్కసారిగా విషాదంగా మారింది. ముబారిక్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి శనివారం ఓ ఫామ్ హౌస్‌కి వెళ్లాడు. అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే..

రాజస్థాన్, జులై 6: కోటాలోని నాంతా ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌస్‌కి 20 నుంచి 22 మంది స్నేహితులతో కలిసి ముబారిక్ (35) శనివారం (జులై 6) మధ్యాహ్నం వెళ్లాడు. భోజనం తరువాత ముబారిక్ స్విమ్మింగ్ పూల్‌లో స్టంట్ చేస్తానని చెప్పి వీడియో తీయమన్నాడు. పరుగెత్తుకుంటూ పూల్‌లోకి దూకిన ముబారిక్ 10 సెకండ్లలోపే నీటిమీదకు అచేతన స్థితిలో తల కిందులుగా అతడి బాడీ తేలుతూ కనిపించింది. వెంటనే అతన్ని బయటకు తీసిన స్నేహితులు సమీపంలోని నయాపురాలోని ఎంబీఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటు వల్ల అతడు మృతి చెంది ఉండవచ్చని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మృతుడు ముబారిక్ ఘంటాఘర్ సమీపంలోని చష్మే కి బావ్డి ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడు స్థానికంగా ఫర్నిచర్ పనితో కుటుంబాన్ని పోషించేవాడు. అతడే కుటుంబంలో ఆదాయమూలం. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం అతని అన్న కూడా మృతి చెందాడు. ముబారక్ స్విమ్మింగ్ పూల్లో దూకుతున్న వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు, మరణానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి వైద్య నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా దిగ్ర్భాంతికి గురి చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.