క్యాబ్ డ్రైవర్లే టార్గెట్.. నలుగురు హత్య.. 24ఏళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్..
క్యాబ్ డ్రైవర్లను టార్గెట్ చేసి చంపేసిన సీరియల్ కిల్లర్ కేసు కీలక మలుపు తిరిగింది. 2001లో ఈ హత్యలు జరగ్గా.. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం గాలిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ పేర్లు మార్చుకుంటూ పోలీసుల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ఎట్టకేలకు అతడి పాపం పండింది.

క్యాబ్ డ్రైవర్లను చంపడం.. ఆ తర్వాత వాహనాలను వేరో చోట అమ్మేసుకోవడం.. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నాలుగు హత్య-దోపిడీ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజయ్ లాంబాను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. 2001లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో క్యాబ్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణమైన దోపిడి హత్యలకు పాల్పడ్డాడు. లాంబ, అతని ఫ్రెండ్స్ టాక్సీలను అద్దెకు తీసుకుని ఉత్తరాఖండ్‌కు ప్రయాణించేవారు. ఆ తర్వాత వారు డ్రైవర్‌కు మత్తు ఇచ్చి గొంతు కోసి చంపి, మృతదేహాన్ని కొండల్లో పడేసేవారు. క్యాబ్‌ను సరిహద్దు దాటించి నేపాల్‌లో అమ్మేవారు. అప్పటినుంచి అతడి కోసం గాలించినప్పటికీ.. వివిధ పేర్లు మార్చుకుని అతడు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అజయ్ లాంబా, అతని ముఠా సభ్యులు మరిన్ని హత్యలు చేసిండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురు బాధితులలో, ఒక క్యాబ్ డ్రైవర్ మృతదేహాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. లాంబా ముఠా సభ్యులలో ఇద్దరు గతంలోనే అరెస్టు అయ్యారు.
ఢిల్లీకి చెందిన లాంబా 6వ తరగతిలోనే స్కూల్ మానేశాడు. అతడిపై దొంగతనం నుండి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం వరకు అనేక ఇతర కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతను 2008 నుండి 2018 వరకు నేపాల్‌లో నివసించాడని, తరువాత తన కుటుంబంతో కలిసి డెహ్రాడూన్‌కు మకాం మార్చాడని పోలీసులు తెలిపారు. ‘‘2020లో అతను ఒడిశా నుండి ఢిల్లీతో సహా ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2021లో ఢిల్లీలోని PS సాగర్‌పూర్‌లో NDPS చట్టం కింద నమోదైన కేసుతో పాటు 2024లో ఒడిశాలోని బెహ్రాంపూర్‌లో జరిగిన నగల దుకాణ దోపిడీ కేసులో ఇటీవలే అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే తన గతం గురించి అతడు ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ చివరకు పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.