Air Pollution: దేశంలో వాయు కాలుష్యంతో ఎందరు చనిపోయారు..?.. కేంద్ర మంత్రి లోక్ సభలో చెప్పిన సమాధానం ఏంటంటే..
వాయు కాలుష్యం వల్ల సంభవించే మరణం లేదా అనారోగ్యంపై కచ్చితమైన డేటా లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అనేక శ్వాసకోశ వ్యాధులకు వాయు కాలుష్యం కారణంగా చెబుతున్నప్పటికీ.. ఎయిర్ పొల్యూషన్ కారణంగా మరణించి...
వాయు కాలుష్యం వల్ల సంభవించే మరణం లేదా అనారోగ్యంపై కచ్చితమైన డేటా లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అనేక శ్వాసకోశ వ్యాధులకు వాయు కాలుష్యం కారణంగా చెబుతున్నప్పటికీ.. ఎయిర్ పొల్యూషన్ కారణంగా మరణించిన కేసులపై నిర్దిష్ట సమాచారం అందుబాటులో లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ లోక్‌సభలో తెలిపారు. అయినప్పటికీ.. శ్వాసకోశ సమస్యలు, సంబంధిత వ్యాధులకు కారణమయ్యే అనేక కారణాలలో వాయు కాలుష్యం ఒకటని ఆయన తెలిపారు. పర్యావరణం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, సామాజిక-ఆర్థిక స్థితి, వైద్య చరిత్ర, రోగనిరోధక శక్తి, జన్యుపరమైన అంశాలు మొదలైన అనేక కారణాల వల్ల ఆరోగ్యం ప్రభావితమవుతుందని ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో పవార్ చెప్పారు. కాలుష్యం, ఆరోగ్యంపై లాన్సెట్ కమిషన్ ప్రకారం.. 2015 లో వాయు కాలుష్యం కారణంగా 9 లక్షల మంది మరణించారు. ఇంతలో, వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన పథకాలను పవార్ వివరించారు.
మహిళలు, పిల్లలకు స్వచ్ఛమైన వంట ఇంధనం ఎల్‌పీజీ అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు, మౌలిక సదుపాయాలను శుభ్రం చేయాలన్నారు. అంతే కాకుండా వ్యవసాయ పనుల్లో యాంత్రీకరణ ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏవిధంగా కృషి చేస్తున్నారో తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా 8.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే కొద్ది రోజులు దేశ రాజధానిలో పొగమంచు కురిసే అవకాశం ఉందని, డిసెంబర్ 16 నాటికి ఆరు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని పేర్కొంది. నగరంలో ఉదయం 9 గంటలకు 337 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) నమోదు చేసింది. 24 గంటల సగటు AQI శుక్రవారం 314 వద్ద ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..