Extreme Weather: ప్రాణాలు తీస్తున్న ప్రకృతి విపత్తులు.. 50 ఏళ్లలో ఎంతమంది చనిపోయారంటే
ప్రపంచంలో తుపానులు, కరవులు, వరదలు, అధిక ఉష్ణోగ్రతల వంటి వాతావరణ విపత్తులు ఏటా సంభవిస్తూనే ఉంటాయి. ఇలా దాదాపు 11,788 వేల విపత్తుల కారణంగా 50 ఏళ్లలో 20 లక్షలకుపైగా మరణాలు నమోదైనట్లు ఐరాస వాతావరణ సంస్థ తాజాగా వెల్లడించింది. అలాగే 4.3 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం జరిగినట్లు పేర్కొంది.
ప్రపంచంలో తుపానులు, కరవులు, వరదలు, అధిక ఉష్ణోగ్రతల వంటి వాతావరణ విపత్తులు ఏటా సంభవిస్తూనే ఉంటాయి. ఇలా దాదాపు 11,788 వేల విపత్తుల కారణంగా 50 ఏళ్లలో 20 లక్షలకుపైగా మరణాలు నమోదైనట్లు ఐరాస వాతావరణ సంస్థ తాజాగా వెల్లడించింది. అలాగే 4.3 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం జరిగినట్లు పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల మరణాలు.. వరదల వల్ల ఆర్థిక నష్టాలు ప్రధాన కారణాలయ్యాయని తెలిపింది. ఇక భారత్ విషయానికొస్తే 1970- 2021 మధ్యకాలంలో 573 విపత్తులు సంభవించాయి. ఇందులో దాదాపు 1.38 లక్షల మంది మృతి చెందారు. ఆసియాలో అత్యధికంగా బంగ్లాదేశ్‌లో 281 విపత్తులు రాగా అందులో 5.20 లక్షలమంది ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూఎంవో తెలిపింది.
అయితే ఈ వాతావరణ విపత్తుల కారణంగా 1970- 2021 మధ్య కాలంలో జరిగిన ఆర్థిక నష్టంలో అత్యధికంగా అమెరికాలోనే నమోదైందని డబ్ల్యూఎంవో పేర్కొంది. దాదాపు 1.7 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం జరిగినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన 10 మరణాల్లో తొమ్మిది మరణాలు అభివృద్ధి చెందుతోన్న దేశాల్లోనే సంభవించినట్లు వెల్లడించింది. అయితే, వాతావరణ విపత్తుల వల్ల కలిగే మరణాలను తగ్గించడంలో ముందస్తు హెచ్చరికలు, విపత్తు నిర్వహణ వ్యవస్థలు చాలా దోహదపడ్డాయని తెలిపింది. గతంలో మయన్మార్, బంగ్లాదేశ్‌లలో ప్రకృతి విపత్తుల కారణంగా వేలమంది ప్రాణాలు కోల్పోయారని.. అయితే ఇప్పుడు మరణాల రేటు తగ్గినట్లు డబ్ల్యూఎంవో సెక్రెటరీ జనరల్ పెటేరి తాలాస్ పేర్కొన్నారు. ఇలాంటి హెచ్చరిక వ్యవస్థలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..