Actor Sarath Babu Passes Away: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు శరత్ బాబు మృతి..

Rajitha Chanti

|

Updated on: May 22, 2023 | 9:40 PM

Actor Sarath Babu Passes Away: కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో కొన్ని నెలలుగా చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైద్యుల సూచనతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి మార్చారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా ఆయన కోలుకోలేకపోయారు.

Actor Sarath Babu Passes Away: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు శరత్ బాబు మృతి..
Sarath Babu

గత కొద్ది రోజులుగా ఏఐజీ హాస్పిటల్‏లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హీరో శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో కొన్ని నెలలుగా చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైద్యుల సూచనతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి మార్చారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా ఆయన కోలుకోలేకపోయారు. సుమారు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. శరత్ బాబు మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 May 2023 09:14 PM (IST)

    ఆయనతో నాకు ఎంతో అనుబంధం ఉంది.. మెగాస్టార్ చిరంజీవి.

    వెండితెర ‘జమిందార్’, ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా ప్రగాఢ సంతాపం. అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.

  • 22 May 2023 08:58 PM (IST)

    శరత్‌బాబు మృతి పట్ల కళ్యాణ్ రామ్ సంతాపం..

    ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు.. ప్రేక్షకుల మనసులలో ఆయన పోషించిన పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి. కళ్యాణ్ రామ్.

  • 22 May 2023 08:50 PM (IST)

    శరత్ బాబు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం..

    సీనియర్ నటుడు శరత్ బాబు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్ధాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో 220 కి పైగా చిత్రాల్లో నటించిన శరత్ బాబు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని సీఎం అన్నారు. శరత్ బాబు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • 22 May 2023 08:35 PM (IST)

    ఆయనతో మాకు ప్రత్యేక బంధం ఉంది.. మంచు విష్ణు

    శరత్ బాబు గొప్ప నటుడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో మాకు ప్రత్యేక బంధం ఉంది. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అందరం అండగా ఉందాం అని అన్నారు మంచు విష్ణు.

  • 22 May 2023 08:31 PM (IST)

    పరిశ్రమకు తీరని లోటు…బాలకృష్ణ

    ‘శరత్ బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

  • 22 May 2023 08:18 PM (IST)

    సన్నిహితుడిని కోల్పోయాను.. రజినీకాంత్..

    ఈ రోజు నేను నా సన్నిహితుడు, అద్భుతమైన వ్యక్తి శరత్‌బాబును కోల్పోయాను. ఇది కోలుకోలేని నష్టం. అతని ఆత్మకు శాంతి కలగాలి.. అంటూ రజినీకాంత్ ట్వీట్ చేశారు.

  • 22 May 2023 07:59 PM (IST)

    శరత్ బాబు మృతి పట్ల సాయి ధరమ్ సంతాపం..

    వెర్సటైల్ యాక్టర్ శరత్ బాబు గారు మృతి చెందడం బాధాకరం. ఆయన సినిమా ప్రపంచానికి చేసిన సేవలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

  • 22 May 2023 07:53 PM (IST)

    శరత్ బాబు మృతి పట్ల నాని సంతాపం..

    శరత్ బాబు గారూ గాత్రం, ఆయన నటనలోని ఉనికి, వెచ్చదనం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. నాని..

  • 22 May 2023 07:42 PM (IST)

    శరత్ బాబు మృతి పట్ల మోదీ సంతాపం..

    శ్రీ శరత్ బాబు గారు బహుముఖ, సృజనాత్మకత కలిగిన వ్యక్తి. ఆయన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో అనేక భాషలలో ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. ఆయన మృతి పట్ల బాధ కలిగింది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియచేశారు ప్రదానీ మోదీ.

  • 22 May 2023 07:32 PM (IST)

    ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. ఎన్టీఆర్..

    ప్రముఖ నటుడు శరత్‌బాబుగారి మరణవార్త వినడం బాధాకరం. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి. అంటూ ట్వీట్ చేశారు తారక్.

  • 22 May 2023 07:29 PM (IST)

    శరత్ బాబు మరణం..

    శరత్ బాబు పార్తివదేహానికి నివాళులర్పించిన రఘు బాబు

  • 22 May 2023 07:20 PM (IST)

    శరత్ బాబు మరణం..

    శరత్ బాబు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన జయసుధ

  • 22 May 2023 07:13 PM (IST)

    శరత్ బాబు నాకు అత్యంత ఆప్తులు.. రాజేంద్ర ప్రసాద్

    శరత్ బాబు నాకు అత్యంత ఆప్తులు. తెలుగు తో పాటు అనే క భాషల్లో నటించిన గొప్ప నటుడు. నా పెళ్లి, నా కెరీర్ ఎదుగుదలలో శరత్ బాబు కీలక వ్యక్తి. అనారోగ్యం బారిన పడి మరణంతో పోరాడి ఓడిపోయారు. నాకు నా కుటుంబానికి ఆయన మరణం తీరని లోటు. అన్నారు రాజేంద్ర ప్రసాద్.

  • 22 May 2023 07:00 PM (IST)

    మాటల రావడం లేదు.. రాధిక శరత్ కుమార్..

    మాటలు రావడం లేదు.. కానీ చాలా బాధగా ఉంది. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. రాధిక శరత్ కుమార్.

  • 22 May 2023 06:56 PM (IST)

    మంచి నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది.. పవిత్ర లోకేష్..

    శరత్ బాబు గారినీ ఇలా చూస్తే భాదగా ఉంది. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఎన్నో సినిమాల్లో నటించారు. మంచి నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది అన్నారు పవిత్ర లోకేష్..

  • 22 May 2023 06:52 PM (IST)

    శరత్ బాబు మృతి పట్ల సీనియర్ నటుడు నరేష్ సంతాపం..

    శరత్ బాబు అందగాడు, గొప్పనటుడు. సాగర సంగమంలో అద్భుతంగా నటించారు. ఆయనను చూసి ఈర్ష పడేవాడిని. చక్కిలిగింతలు పెడితే నవ్వేసేవాడు. మళ్ళీ పెళ్లిలో నటించాలంటే డబ్బులు తోసుకొనని చెప్పి నటించారు. పవిత్రని నన్ను సంతోషంగా ఉండండి అని దీవించారు. మంచి మిత్రుడు, గొప్ప నటుడిని కోల్పోయాను. ఆయనతో అఖరు సినిమా అంటే బాధపడాల, సంతోష పడాలో అర్ధం కావడం లేదు. అని అన్నారు నరేష్.

  • 22 May 2023 06:33 PM (IST)

    శరత్ బాబు మృతి పట్ల రవితేజ సంతాపం..

    “సున్నితమైన హృదయం, ఎప్పుడూ నవ్వుతూ ఉండే గొప్ప మనిషి మీరు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాము.. మా హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అంటూ ట్వీట్ చేశారు రవితేజ.

  • 22 May 2023 06:31 PM (IST)

    శరత్ బాబు మృతి పట్ల ప్రకాష్ రాజ్ సంతాపం..

    ‘ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీతో పనిచేయడం అద్భుతంగా ఉండేది.. నా కెరీర్‌లో ఆయన ఆప్యాయత , ప్రోత్సాహాన్ని మర్చిపోలేను. రెస్ట్ ఇన్ మీస్ సర్’ అంటూ సంతాపం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్.

  • 22 May 2023 06:16 PM (IST)

    శరత్ బాబు పార్థివ దేహానికి నివాళి అర్పించిన హీరో శివబాలాజీ..

    శరత్ బాబు పార్థివ దేహానికి నివాళి అర్పించారు హీరో శివబాలాజీ. ‘శరత్ బాబు గారితో కలిసి ఒక సినిమాను చేశాను. 2004 లోనే ఆయన ఫుడ్ విషయంలో ఎలా కేర్‏ గా ఉండాలి అని చెప్పేవాళ్లు. సాగర సంగమంలో ఆయన చేసిన పాత్ర నాకు ఎంతో ఇష్టం. శరత్ బాబు గారి నుంచి డిస్ప్లేన్ను ఈతరం ఆర్టిస్టులు లందరూ నేర్చుకోవాలి’ అని అన్నారు.

  • 22 May 2023 05:49 PM (IST)

    ఫిలిం ఛాంబర్‏కు చేరుకున్న శరత్ బాబు పార్థివ దేహం..

    ఫిలిం ఛాంబర్‏కు చేరుకున్న శరత్ బాబు పార్థివ దేహం. భిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం అనంతరం.. రాత్రి 7.30 తర్వాత చెన్నైకి తరలించనున్నారు కుటుంబసభ్యులు.. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకలోకాన్ని అలరించిన గంభీర స్వరం మూగబోయింది. తిరిగిరాని లోకాలకు తరలివెళ్లింది. శరత్‌బాబు మనతో లేకపోవచ్చు. కానీ నాలుగున్నరదశాబ్దాలకుపైగా ఆయన నటించిన పాత్రలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి.

  • 22 May 2023 05:38 PM (IST)

    ఫిలిం ఛాంబర్‌కు శరత్‌‍బాబు పార్థివదేహం..

    ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యుల అంగీకరించారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్‌కు శరత్ బాబు పార్థివదేహం తరలిస్తున్నారు. ఫిలిం ఛాంబర్ నుంచి రాత్రి 7.30 తర్వాత చెన్నైకి తరలించనున్నారు.

  • 22 May 2023 05:32 PM (IST)

    ఫిలిం ఛాంబర్ కు పార్ధివదేహం తరలింపు..

    ఏఐజి హాస్పిటల్ నుంచి శరత్ బాబు పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు కుటుంబసభ్యులు..

  • 22 May 2023 05:22 PM (IST)

    ఫిలిం ఛాంబర్ వద్ద శరత్ బాబు పార్థివ దేహం ఉంచేందుకు ఏర్పాట్లు..

    ఫిలిం ఛాంబర్ వద్ద శరత్ బాబు పార్థివ దేహం ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. టెంట్ వేసి పార్థివ దేహం ఉంచేందుకు ఏర్పాటు చేయగా.. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో 6 గంటలకు శరత్ బాబు పార్థివ దేహం తీసుకురానున్నారు. రెండు గంటల పాటు ఫిలిం ఛాంబర్ వద్ద పార్థివదేహం ఉండనుంది. అనంతరం.. తర్వాత చెన్నై తరలించనున్నారు శరత్ బాబు కుటుంబ సభ్యులు.

  • 22 May 2023 05:16 PM (IST)

    శరత్ బాబు మృతి పట్ల సోము వీర్రాజు సంతాపం..

    300 కి పైగా అనేక సందేశాత్మక చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసులు గెలిచిన సీనియర్ నటులు శరత్ బాబు. వారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు సోము వీర్రాజు

  • 22 May 2023 05:15 PM (IST)

    AIG హాస్పిటల్ కి చేరుకున్న శివాజీ రాజా..

    శరత్ బాబు పార్థివ దేహానికి శివాజీ రాజా నివాళి అర్పించారు.

  • 22 May 2023 05:12 PM (IST)

    శరత్ బాబు మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం..

    సీనియర్ నటులు శరత్ బాబు మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శరత్ బాబు వందలాది సినిమాలలో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారని.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు.. శరత్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూన్నానని రేవంత్ రెడ్డి అన్నారు.

  • 22 May 2023 05:10 PM (IST)

    శరత్ బాబు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం..

    తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

  • 22 May 2023 04:56 PM (IST)

    చాలా విషాదకర వార్త.. మురళి మోహన్..

    శరత్ బాబు మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యం. ఆయన ఇకలేరు అనే వార్త బాధగా ఉంది. 6 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ కి తరలించనున్నారు. రెండు గంటల పాటు ఫిలిం ఛాంబర్ లో పార్థివదేహమ్ ఉండనుంది.. తర్వాత చెన్నై కి తరలించనున్నామన్నారు మురళిమోహన్..

  • 22 May 2023 04:36 PM (IST)

    ఫిలిం ఛాంబర్ కు శరత్ బాబు పార్ధీవ దేహాం..

    శరత్ బాబు పార్దీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్ వద్దకు తీసుకువచ్చేందుకు ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించారు. మరికొద్ది సేపట్లో ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో సినీ పరిశ్రమ ప్రముఖుల సందర్శనార్థం శరత్ బాబు పార్థివదేహం తీసుకురానున్నారు.

  • 22 May 2023 04:26 PM (IST)

    శ‌ర‌త్ బాబు మృతికి చంద్ర‌బాబు సంతాపం…

    శ‌ర‌త్ బాబు మ‌ర‌ణ వార్త దిగ్బ్రాంతి క‌లిగించింది. ఆయ‌న మృతి సినీరంగానికి తీర‌ని లోటు. శ‌ర‌త్ బాబు ఆత్మ‌శాంతికై ప్రార్ధిస్తున్నాను అన్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

  • 22 May 2023 04:18 PM (IST)

    ఒంటరిగా ఉండేందుకే ఇష్టం..

    స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతాననే శరత్‌బాబు ఏడు పదుల వయసులోనూ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టకపోయినా, చేసిన ప్రతి పాత్రనూ ప్రేమించే చేశానని అనేవారు శరత్‌బాబు. సీనియర్‌ నటి రమాప్రభతో వివాహం జరిగింది. దశాబ్దంన్నరకు పైగా కలిసున్నారు. విబేధాలతో విడిపోయారు. అసలు తన దృష్టిలో అది పెళ్లే కాదంటారు శరత్‌బాబు. ఆ తర్వాత నంబియార్‌ కుమార్తెను వివాహం చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె నుంచి విడిపోయారు శరత్‌బాబు.

  • 22 May 2023 03:54 PM (IST)

    శరత్ బాబు మృతి ఇండస్ట్రీకి తీరని లోటు.. పోసాని కృష్ణమురళి..

    సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మనిషి , అజాత శత్రువు అయినా శరత్ బాబు మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

  • 22 May 2023 03:48 PM (IST)

    శరత్ బాబుకు కలిసి రాని పెళ్లిళ్లు..

    కెరీర్‌ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే రమాప్రభను వివాహం చేసుకున్నారు శరత్‌బాబు. అప్పటికే రమాప్రభ హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నంబియార్‌ కుమార్తె స్నేహను పెళ్లాడారు. పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు

  • 22 May 2023 03:39 PM (IST)

    వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై నటప్రస్థానం..

    సిల్వర్‌స్క్రీన్‌ మీద వెలుగుతూ టీవీల్లో నటించిన నటుల్లో శరత్‌బాబుది ప్రత్యేకమైన స్థానం. తమిళ దూరదర్శన్‌లో వచ్చే పలు ధారావాహికల్లో నటించారు. తెలుగులోనూ పలు సీరియళ్లలో నటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కి తరలి వచ్చినప్పుడు ఇక్కడికి రాలేదు శరత్‌బాబు. తెలుగును మించి తమిళంలో సినిమా, టీవీ అవకాశాలు ఉండటంతో చెన్నైలోనే స్థిరపడ్డారు.

  • 22 May 2023 03:23 PM (IST)

    శరత్ బాబు డైలాగ్ చెప్పే తీరు ఇష్టమన్న డైరెక్టర్ కె.విశ్వనాథ్..

    బాలచందర్‌, కె.విశ్వనాథ్‌, రజనీకాంత్‌, చిరంజీవి సినిమాల్లో శరత్‌బాబు పాత్రలను జనాలు అంత తేలిగ్గా మార్చిపోలేరు. సోషల్‌ సినిమాలు మాత్రమే కాదు పౌరాణిక, జానపద, భక్తి చిత్రాలతోనూ మెప్పించారు శరత్‌బాబు. గంభీరమైన స్వరంతో ఆయన చెప్పే డైలాగులకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. తెలుగు, తమిళంలో ఆయన డైలాగులు చెప్పే తీరు తనకు చాలా ఇష్టమని కె.విశ్వనాథ్‌ పలు సందర్భాల్లో చెప్పారు. తెలుగులో సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం చిత్రాల్లో సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌గా నందులు అందుకున్నారు. తమిళనాడు, కేరళ స్టేట్‌ అవార్డులు కూడా అందుకున్న ఘనత ఆయనది.

  • 22 May 2023 03:06 PM (IST)

    హీరోగానే కాదు.. విలన్‏గానూ మెప్పించిన శరత్ బాబు..

    మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయారమ్మా బంగారయ్యా… మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, స్వాతిముత్యం, జీవనజ్యోతి… అభినందన, స్వాతిచినుకులు, ఆపద్బాంధవుడు, నువ్వు లేక నేను లేను… శంకర్‌దాదా జిందాబాద్‌, శ్రీరామదాసు, ఆట, శౌర్యం, సాగరసంగమం… షిరిడిసాయి, ఎంత మంచివాడవురా, వకీల్‌ సాబ్‌ చిత్రాల్లోని పాత్రలకు మంచి గుర్తింపుదక్కింది. హీరోయిన్లకు సోదరుడిగా, మధ్యతరగతి మనిషిగా, ప్రలోభాలకు గురైన వ్యక్తిగా, హీరోకి స్నేహితుడిగా, ప్రతినాయకుడిగా, సిట్చువేషన్స్ కి తగ్గట్టు ప్రవర్తించే వ్యక్తిగా ఎన్నో రకాల పాత్రల్లో మెప్పించారు శరత్‌బాబు.

  • 22 May 2023 02:54 PM (IST)

    250కిపైగా సినిమాలు.. అతనే ఓ ఆల్ రౌండర్..

    శరత్‌బాబు పూర్తి పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జులై 31న ఆమదాలవలసలో జన్మించారు. 1973లో రామరాజ్యంతో సినీ రంగ ప్రవేశం చేశారు శరత్‌బాబు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు. కేవలం హీరోగానే కాకుండా.. అనేక పాత్రలలో కనిపించి మెప్పించారు.

  • 22 May 2023 02:47 PM (IST)

    శరత్ బాబు కన్నుమూత..

    ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి.. సినీప్రియులను అలరించిన అలనాటి నటుడు శరత్‌బాబు… తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు.. లంగ్స్ ఇష్యూతోనూ ఇబ్బంది పడుతున్న ఆయన కొంత కాలంగా చెన్నైలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో… వైద్యుల సూచన ప్రకారం ఈ నెల 20న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్‌కు శరత్‌బాబును షిఫ్ట్‌ చేశారు.

Published On - May 22,2023 2:45 PM

Follow us