BJP vs Congress: రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రియాంక కౌంటర్..
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూపేందుకు యత్నిస్తోంది బీజేపీ. అయితే హస్తం పార్టీ సైతం అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది. కాంగ్రెస్ ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టాలని చూస్తుందని మోదీ ఆరోపస్తుంటే.. ఆయన మరోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం ఖాయమంటున్నారు ప్రియాంక గాంధీ.
పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ రగడ కొనసాగుతూనే ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లింల రిజర్వేషన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్ర కొల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. కర్నాటకలో ముస్లింలను ఓబీసీల్లో చేర్చారని మండిపడ్డారు. దీంతో ఓబీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్నాటక మోడల్ అమలవుతుందని హెచ్చరించారు ప్రధాని మోదీ..
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి మోదీ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో కూటమికి మూడండెకల సీట్లు కూడా రావు, కాని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇండియా కూటమి అధికారం లోకి వస్తే ఏడాదికి ఓ ప్రధాని ఉంటారని సెటైర్లు విసిరారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులవుతారని అన్నారు మోదీ.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ.. మోదీ అన్ని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. తన జీవితంలో చాలామంది ప్రధానులను చూశానని, కానీ ఇంత పచ్చి అబద్ధాలను చెప్పే ప్రధానిని చూడడం ఇదే తొలిసారి అని అన్నారు. బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని వల్సాద్ సభలో ప్రియాంక ఆరోపించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు, మంత్రులు ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా చెబుతున్నారు, బీజేపీ అధికారంలోకి వస్తే అదే నిజమవుతుందన్నారు ప్రియాంక.
ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం రాజకీయ పార్టీల మధ్య చర్చనీయ అంశంగా మారింది. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ పదే పదే చెప్తోంది. అయితే ఓటరు ఎవరి మాట వింటాడనే విషయం తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..