PM Modi: తెలుగు టు అస్సామీ.. 11 భాషల్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏం అన్నారంటే..?
మన్ కీ బాత్ చరిత్రలో మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఒకేసారి 11 భారతీయ భాషల్లోకి అనువదించారు. వందేమాతరం గొప్పదనం, ఛఠ్ పూజ శుభాకాంక్షలు, స్వదేశీ కుక్కల శౌర్యం గురించి ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. భారత్ టెక్నాలజీలో ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పే ఈ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలో చదవాల్సిందే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి మన్ కీ బాత్‌లో మాట్లాడారు. ఈ 127వ ఎపిసోడ్‌లో ఛఠ్ పూజ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వందేమాతరం భారతదేశపు శక్తివంతమైన ప్రతిబింబాన్ని చూపుతుందని మోదీ అభివర్ణించారు. ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రధాని మోదీ సందేశాన్ని ఏఐ టెక్నాలజీ సహాయంతో 11 భారతీయ భాషలలోకి అనువదించారు. అంటే మోదీ ప్రసంగం 11 భాషల్లో వినిపించింది అన్నమాట.
ఈ భాషల్లో ప్రసంగం
ఏఐ సహాయంతో మలయాళం, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, గుజరాతీ, బెంగాలీ, తమిళం, మరాఠీ, అస్సామీ, ఒరియాతో సహా మొత్తం 11 భాషలలో మోదీ ప్రసంగం ఒకేసారి వినిపించింది. దీని వలన దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వారి మాతృభాషలో ప్రధాని సందేశాన్ని వినగలిగారు. పాఠ్యాంశాలను 11 భాషల్లోకి అనువదించడానికి ఏఐని ఉపయోగించడాన్ని ప్రధాని ప్రశంసించారు. భవిష్యత్తులో ఏఐ కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రపంచాన్ని నడిపించగల సామర్థ్యం ఆధునిక భారతదేశానికి ఉందని ఈ చర్య ద్వారా ప్రభుత్వం ప్రదర్శించింది. గత కొన్ని సంవత్సరాలుగా, భారత్ ఏఐ వంటి ఆధునిక రంగాలలో పెట్టుబడులను పెంచుతోంది.
మన్ కీ బాత్‌లోని ముఖ్యాంశాలు
వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా భవిష్యత్ తరాలకు దాని విలువలను అందించాలని మోదీ పౌరులను కోరారు. సాంస్కృతిక, ఆర్థిక కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్‌లలో శిక్షణ పొందిన స్వదేశీ కుక్కల శౌర్యం, పరాక్రమాన్ని ప్రధాని కొనియాడారు. సోషల్ మీడియా ప్రపంచం సంస్కృత భాషకు కొత్త ప్రాణం పోశాయని, చాలా మంది యువత రీల్స్ ద్వారా ఈ భాషను వాడుతూ అవగాహన పెంచుతున్నారని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




