Bus Fire: కర్నూలు ఘటన మరవక ముందే.. తగలబడిన మరో స్లీపర్ బస్సు.. ఎక్కడంటే
Agra Lucknow bus fire: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మరణించిన దుర్ఘటన మరువక ముందే దేశంలో మరో బస్సు ప్రమాదం వెలుగు చూసింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు మొత్తం పూర్తిగా కాలిపోగా.. ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మరణించిన దుర్ఘటన మరువక ముందే దేశంలో మరో బస్సు ప్రమాదం వెలుగు చూసింది. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకొని ప్రమాదానికి గురైంది. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను వెంటనే కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది. అయితే ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడినట్టు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే..70 మంది ప్రయాణికులతో బస్సు ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండాకు వెళ్తోంది. సరిగ్గా రెవ్రి టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంకి రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దించాడు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది.
రోడ్డుపై బస్సు తగలబడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సహాయంతో రోడ్డు పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బస్సు యజమాని ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసి అందదిని వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




