రోడ్లపై నమాజ్ చేస్తే.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!
రోడ్లపై నమాజ్ చేయడాన్ని యూపీ ప్రభుత్వం నిషేధించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారి పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఇలాంటి వారు కొత్త పాస్‌పోర్ట్ పొందడానికి కోర్టు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవల్సి ఉంటుందని తెలిపారు. గత ఏడాది కూడా ఈద్ సందర్భంగా..

లక్నో, మార్చి 28: ఎవరైనా రోడ్లపై నమాజ్ చేస్తే వారి పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని మీరట్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వీధుల్లో ప్రార్థనలు చేయడానికి అనుమతి లేదని, ఎవరైనా అలా దొరికితే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని మీరట్ ఎస్పీ ఆయుష్ విక్రమ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మత పెద్దలు, ఇమామ్‌లకు విజ్ఞప్తి చేశామని, ప్రజలు మసీదులలో మాత్రమే ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు. ఈ ఆదేశాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత సంవత్సరం ఇలాంటి ఉల్లంఘనలకు సంబంధించి 200 మందిపై కేసులు నమోదైనట్లు గుర్తుచేశారు. వారిలో 80 మందికి పైగా వ్యక్తులను గుర్తించామన్నారు. ఈ ఏడాది కూడా రోడ్డుపై నమాజ్ చేసే వారిపై నిఘా ఉంచామన్నారు. పోలీసులు ఆయా ప్రదేశాల్లో డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా సున్నితమైన ప్రాంతాలను పర్యవేక్షిస్తారు. పోలీసులు సోషల్ మీడియాను కూడా పర్యవేక్షిస్తారు. నెట్టింట పుకార్లు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు.
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారి పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఇలాంటి వారు కొత్త పాస్‌పోర్ట్ పొందడానికి కోర్టు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవల్సి ఉంటుందని తెలిపారు. గత ఏడాది కూడా ఈద్ సందర్భంగా కొంతమంది వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ గుర్తు చేసుకున్నారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండటానికి అన్ని సున్నితమైన ప్రాంతాలలో అదనపు భద్రతా దళాలను మోహరిస్తారని అన్నారు. లక్నో, సంభాల్, అలీఘర్ సహా ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో రోడ్లు, ప్రమాదకరమైన భవనాలపై ప్రార్థనలను నిషేధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై జనం గుమిగూడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సంభాల్ ఎస్పీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్కే పోలీసుల తాజా ప్రకటనపై ఘాటుగా స్పందించారు. ఎంపీ జియావుర్ రెహమాన్ బార్కే నమాజ్ విషయంలో హైకోర్టుకు వెళతామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జయంత్ చౌదరి కూడా ‘1984 ఆర్వెల్లియన్ వైపు మళ్లుతోన్న పోలీసింగ్!’ అంటూ సోషల్ మీడియాలో పోలీసుల ప్రకటనపై నిరసన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పోలీసులు పాస్‌పోర్ట్‌లను జప్తు చేస్తామనడం సరికాదన్నారు. ప్రజల సమ్మతిని పొందడానికి వారితో సున్నితంగా వ్యవహరించాలని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.