AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meerpet Murder Case: మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మహిళను చంపి ముక్కముక్కలుగా నరికి మృతదేహం మాయం చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో డీఎన్‌ఏ రిపోర్టు తాజాగా పోలీసుల చేతికి చేరింది. నిందితుడు గురుమూర్తి భార్య మాధవిని హత్య చేసి, బాడీని ముక్కలుగా నరికి..

Meerpet Murder Case: మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!
Meerpet Murder Case
Srilakshmi C
|

Updated on: Mar 26, 2025 | 9:46 AM

Share

హైదరాబాద్, మార్చి 25: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్‌పేట మహిళను చంపి ముక్కముక్కలుగా నరికి మృతదేహం మాయం చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో డీఎన్‌ఏ రిపోర్టు తాజాగా పోలీసుల చేతికి చేరింది. నిందితుడు గురుమూర్తి భార్య మాధవిని హత్య చేసి, బాడీని ముక్కలుగా నరికి ఉడకబెట్టి, ఎముకలను పొడిగా చేసి చెరువులో కలిపేసి ఎలాంటి ఆధారాలు దొరకవులే అనుకున్నాడు. కానీ నిందితుడి పాపం చిన్న రక్తం చుక్క రూపంలో బయటపడింది. ఇంట్లో ఓ మూల దొరికిన టిష్యూతో గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. మాధవి డీఎన్‌ఏ.. పిల్లలు, తల్లి డీఎన్‌ఏతో మ్యాచ్‌ అయినట్టు ఫోరెన్సిక్‌ అధికారులు తేల్చడంతో గురుమూర్తికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది.

మరోవైపు ఈ కేసులో కోర్టు విచారణ త్వరగా పూర్తి చేసి నిందితుడికి శిక్షపడేందుకు రాచకొండ పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ కేసు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపేలా న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తులో లోపాలకు అవకాశం లేకుండా రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నిందితుడి వాంగ్మూలం, సీసీ కెమెరాలతో పాటు డీఎన్‌ఏ రిపోర్టు సహా అన్ని ఆధారాల సేకరణ దాదాపు పూర్తయింది. త్వరలోనే ఛార్జిషీటు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ కేసులో అసలేం జరిగిందంటే..

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్టా గురుమూర్తి, వెంకట మాధవి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. కుటుంబంతో గురుమూర్తి హైదరాబాద్‌లోని మీర్‌పేటలో ఓ అపార్ట్మెంట్‌లోఉంటున్నారు. పాత గొడవలతో భార్యపై కక్ష్య పెంచుకున్న గురుమూర్తి ఈ ఏడాది జనవరి 16న మాధవి తల గోడకేసి మోది చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికి వేడి నీటిలో ఉడకబెట్టి, కాల్చి, పొడిచేసి జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు. ఆ తర్వాత గురుమూర్తి తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకాలు ఆడాడు. మీర్‌పేట పోలీసులు తొలుత మిస్సింగ్‌ కేసుగానే పరిగణించి దర్యాప్తు చేపట్టగా.. అసలు బండారం బయటపడింది. అనుమానంతో గురుమూర్తిని ప్రశ్నించగా ఏ మాత్రం జంకుబొంకు లేకుండా తానే హత్య చేశానని, ఆధారాలు దొరికితే అరెస్టు చేసుకోమని పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో పోలీసులు హత్య జరిగిన ఇంట్లో ఆధారాల కోసం జల్లెడ పట్టారు.

ఇవి కూడా చదవండి

అనుకున్నట్లు గానే ఓ చోట రక్తం చుక్క, ఒకేఒక వెంట్రుక ఫోరెన్సిక్‌ టీంకు దొరికింది. సేకరించిన రక్తం నమూనా మాధవి పిల్లల డీఎన్‌ఏతో మ్యాచ్‌ అయ్యింది. దీంతో మాధవి హత్యకు గురైనట్లు శాస్త్రీయంగా నిర్ధారనైంది. 2 నెలల తరువాత డీఎన్‌ఏ రిపోర్టు మంగళవారం పోలీసులకు చేరింది. దీనిని నేరుగా కోర్టుకు అందజేస్తామని ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపారు. సభ్య సమాజంలో గురుమూర్తి లాంటి పశువులు నేరం చేసి సులువుగా తప్పించుకోవచ్చని కలలు కంటారు. కానీ నిజం, నిప్పు దాస్తే దాగేవి కావనే విషయం తాజా సంఘటన రుజువు చేసింది. కోర్టు నిందితుడికి ఏ శిక్ష విధిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.