Betting Apps Case: బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. రాత్రికి రాత్రే సీన్ మారిపోయిందిగా!
తెలంగాణలో బెట్టింగ్‌లపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ప్రచార కర్తల మాటలు నమ్మి దాదాపు 980 మంది యాప్ ద్వారా మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయితే బెట్టింగ్ నిర్వాహకులు మాత్రం వేర్వేరు పేర్లతో ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ బెట్టింగ్ యాప్‌లను విస్తృతంగా..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిషేధిత బెట్టింగ్, జూదం యాప్‌ల కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు చేయడంతో బెట్టింగ్ యాప్స్ ప్రొమోట్ చేసిన ప్రముఖ సినీ నటుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. చూస్తే లిస్ట్ కాస్త పెద్దది గానే ఉంది. ఎందుకంటే టాలీవుడ్‌లో ప్రముఖ హీరోల నుంచి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారకర్తలుగా ఉన్నారు. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మీతో సహా మొత్తం 25 మంది నటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ కేసులో చిక్కుకున్నారు. అయితే ఎంక్వైరీ ఇంకా మొదలుకాలేదు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో బుల్లితెర నటులు, యాంకర్లు హర్షసాయి, విష్ణుప్రియ, లోకల్ బాయ్ నాని ఇలా 11మందిపై కేసు నమోదైంది. సెలబ్రెటీలపై నమోదవుతున్న వరుస కేసుల నేపథ్యంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
వీటన్నింటికీ మూల కారణం యాప్‌లే కాబట్టి వాటి నిర్వాహకుల్ని కూడా నిందితులుగా చేర్చి విచారణకు పిలవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ కేసులో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల్ని కూడా నిందితులుగా చేర్చుతూ మియాపూర్ పోలీసులు చర్యలు చేపట్టారు. మొత్తం 19 యాప్‌ల పేర్లను నిందితుల జాబితాలో జతచేశారు. జంగ్లీ రమ్మీ డాట్‌కామ్, ఏ23, యోలో247డాట్‌కామ్, ఫెయిర్‌ప్లే, జీత్‌విన్, వీఎల్‌బుక్, తాజ్77, వీవీబీబాక్, ధని బుక్365, మామ247, తెలుగు365, యెస్365, జై365, వీవీబుక్, ఓకేవిన్, జెట్‌ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్రా365 తదితర యాప్‌ల పేర్లను ఇందులో చేర్చారు. అలాగే బెట్టింగ్ యాప్‌లకు ప్రచారకర్తలుగా నటించిన పలువురు నటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులిచ్చి విచారించే ముందు పోలీసులు న్యాయసలహా తీసుకున్నారు. మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన ఆ తర్వాత సెలబ్రిటీలను విచారణకు పిలవనున్నట్లు సమాచారం.
కాగా తెలంగాణలో బెట్టింగ్‌లపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ప్రచార కర్తల మాటలు నమ్మి దాదాపు 980 మంది యాప్ ద్వారా మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయితే బెట్టింగ్ నిర్వాహకులు మాత్రం వేర్వేరు పేర్లతో ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ బెట్టింగ్ యాప్‌లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీనిపై సీరియస్ అయిన రేవంత్ సర్కార్ నిర్వహకులపై కొరడా జులిపించింది. పలు కోణాల్లో నిర్వాహకులను విచారించి తెలంగాణ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే.. వారిపై ముందుగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దీంతో ఖాకీలు యాప్ నిర్వాహకుల జాడను పసిగట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే 5 యాప్‌ల వివరాలు గుర్తించిన పోలీసులు.. త్వరలోనే మిగిలిన వాటి వివరాలు కూడా సేకరించనున్నారు. యాప్ యజమానులు తెరపైకి వస్తే.. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు ఈ కేసుల్లో కేవలం సాక్షులుగా మిగలనున్నారు. అంటే బెట్టింగ్ యాప్ కేసులో వాటిని ప్రమోట్ చేసిన ప్రముఖులంతా ఇకపై సాక్షులుగా మారబోతున్నారన్నమాట. ఒకవేళ ఇదే జరిగితే కేసులు నమోదైన సెలబ్రిటీలంతా కేవలం సాక్ష్యం చెప్పి వెళ్లిపోతారంతే. మొత్తం సీన్ అంతా బెట్టింగ్ యాప్ కంపెనీలపై నడుస్తుంది.. కాబట్టి చర్యలన్నీ వారిపైనే ఉండబోతున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.