TG SSC Paper Leak Case 2025: టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలో ట్విస్ట్.. ప్రశ్నాపత్రం బయటకు ఎలా వచ్చిందంటే?
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజు 10 నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నల్గొండ జిల్లా పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెల్లడైనాయి. అసలు ఈ రోజు ఏం జరిగింది అనే విషయం..

నల్గొండ, మార్చి 24: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తొలి పరీక్ష రోజే.. ఎగ్జాం ప్రారంభమైన 10 నిమిషాలకే తెలుగు ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లీకేజ్ వ్యవహారంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. నకిరేకల్ గురుకుల పాఠశాలలో తెలుగు ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు కూడా. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తొలుత తేల్చినా.. పోలీసులు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నప్పటికీ పరీక్ష సెంటర్లోకి ఫోన్ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనలో ఇద్దరు అధికారులను విధుల నుంచి తొలగించారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్‌ను, డిపార్ట్‌మెంటల్ అధికారి రామ్మోహన్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్‌గా ఉన్న టీజీటీ సుధారాణిని కూడా సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ప్రశ్నాపత్రం ఇచ్చిన విద్యార్ధిని కూడా డీబార్ చేశారు. ఇప్పటికే ప్రశ్నపత్రం లీక్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ బాలుడు, జిరాక్స్ కేంద్రం నిర్వాహకుడు ఉన్నారు.
అసలారోజు ఏం జరిగిందంటే..
పరీక్ష జరుగుతున్న గది వద్దకు బాలుడు గోడ దూకి వచ్చినట్లు తెలుస్తుంది. అనంతరం విద్యార్థి పరీక్ష రాస్తుండగా కిటికీలో నుంచి ప్రశ్నపత్రం ఫొటో తీసి, అనంతరం ఈ ప్రశ్నపత్రం కాపీని ఆ బాలుడు జిరాక్స్ కేంద్రంలో ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల నుంచి 5 సెల్‌ఫోన్లు, జిరాక్స్ యంత్రం, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తన ప్రమేయం లేకపోయినా డిబార్ చేశారని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని, తానేం తప్పుచేశానని లబోదిబోమని విలపిస్తున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.