టెన్త్ పరీక్ష కేంద్రంలో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్.. ఐదుగురు డీబార్, 16 మంది టీచర్లు సస్పెండ్!
పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పుతున్నారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడమే లక్ష్యంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులకు చూసిరాతకు సహకరిస్తు రెడ్ హ్యాండెడ్ గా బుక్కయ్యారు. ఈ వ్యవహారంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు విద్యార్థులను డిబార్ చేయటంతో పాటు 14మంది ఉపాధ్యాయులు, ఒక నాన్ టీచింగ్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడటం జిల్లాలో పెద్ద చర్చకు దారి తీస్తుంది..

కుప్పిలి, మార్చి 23: గతంలో విద్యార్థులు చూసిరాతలు రాస్తే చూసి చూడనట్టు వదిలేసే ఇన్విజిలేటర్లు ఉండేవారు. దానికి కొన్నేళ్ల ముందు పేపర్ చాలా టఫ్ గా ఉందని 20 బిట్లు హెల్ప్ చేస్తే 35 మార్కులతో పాసవుతాడని కొన్ని చోట్ల సాయం చేసే ఇన్విజిలేటర్లు ఉండేవారు. కానీ ఇపుడు వారి వ్యవహార శైలి IIIT(ట్రిపుల్ ఐటి)లో సీట్లు కోసం 10th క్లాస్ పరీక్షల్లో విద్యార్థి ఏకంగా మెరిట్ మార్కులు సాధించేలా చూసిరాతకు సహకరించే స్థాయికి చేరుకుంది. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాల 10th క్లాస్ పరీక్షా కేంద్రoలో జరిగిన ఈ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. తోటి ఉపాధ్యాయులు సిగ్గుపడేలా, విద్యాశాఖలోని లోపాలను ఎత్తి చూపేలా నిలుస్తుంది ఈ ఘటన. కుప్పిలి మోడల్ స్కూల్ లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి A, B అని రెండు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. గతం నుండి ఈ పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 17 నుండి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కాగా కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో పదో తరగతి పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి నుంచి DEO కి ఫిర్యాదు అందింది.
సదరు విద్యార్థి DEO కృష్ణ చైతన్యకు ఫోన్ చేసి తాను మెరిట్ స్టూడెంట్‌నని తనకు ఐఐఐటీ లో సీటు సంపాదించాలన్న ఆశయం ఉందని కానీ పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతుందని కావున తనకు IIIT సీటు వస్తాదా రాదా అన్న అనుమానం కలుగుతుందని చెప్పాడట. సదరు విద్యార్థి ఫిర్యాదుకి స్పందించిన DEO రెండు రోజుల పాటు అక్కడి పరిస్థితులపై ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. జిల్లాలోని అదే మండలంలో IIIT ఉంది. ఇక్కడ పదోతరగతి పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు దక్కుతాయి. దాంతో ఐఐఐటి లో సీట్లు పొందేందుకు ఉపాధ్యాయుల సహకారంతో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు అధికారులకు ఉప్పందిoది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం DEO ఆధ్వర్యంలో నాలుగు టీమ్ లు కుప్పిలి గ్రామoలో రైడ్ చేశాయి. మోడల్ స్కూల్ లో రెండు పరీక్ష కేంద్రాలతో పాటు స్థానిక ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలపైన దాడి చేయగా మొత్తం వ్యవహారం బయట పడింది. మోడల్ స్కూల్ A పరీక్షా కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు, B పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. పట్టుబడిన ఐదుగురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
ఇక స్థానిక ZP ఉన్నత పాఠశాలలో రైడ్ చేసిన అధికారులకు నిర్ఘాంత పోయేలా ఆరోజు జరుగుతున్న ఇంగ్లీష్ పరీక్ష పేపర్ కి సంబంధించి వచ్చిన ప్రశ్నలు ఓ పేపర్ పై రాసి ఉండగా దొరికాయి. ఆ ప్రశ్నలకు గైడ్ చూసి ఆ ఉపాధ్యాయుడు స్లిప్పులపై జవాబులు రాస్తూ ఉండగా పట్టుబడ్డారు. ZP ఉన్నత పాఠశాల నుండి ఉపాధ్యాయులు స్లిప్పులు రాసి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు పంపిస్తున్నట్లు గ్రహించిన పరీక్ష కేంద్రాలలోని 9మందిపై, ZP ఉన్నత పాఠశాలలోని ఐదుగురుపై మొత్తం 15 మందిపై DEO చర్యలకు ఉపక్రమించారు. కుప్పిలి మోడల్ స్కూల్ ఏ, బీ కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధానోపాధ్యాయులను, రెండు కేంద్రాల్లోనూ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరినీ, ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహిస్తున్న నలుగురిని, నాన్ టీచింగ్ సిబ్బంది ఒకరిని .మరియు చూసిరాతకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణపై కుప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని మరో నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక కుప్పిలి ZP ఉన్నత పాఠశాలలో క్లర్క్ గా పనిచేస్తున్న బలివాడ కిషోర్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. IIIT లో సీటు వచ్చేలా పదోతరగతి పరీక్షలలో విద్యార్ధులు మెరిట్ మార్కులు పొందేలా సహకరించేందుకు ఒక్కో విద్యార్థి నుండి రూ.పది వేలు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ చర్యలు కోసం విద్యాశాఖ అధికారులు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసారు. దీంతో ఈ ఘటన పై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ ఆంటూ బయటకు వచ్చిన వాస్తవానికి ఈ స్కూల్ లోని స్టాఫ్ ను ఎవరిని పరీక్షల విధులకు ఉపయోగించలేదు. దీనికి తోడు ఈ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసిన విద్యార్థులలో మోడల్ స్కూల్ విద్యార్థులతో పాటు కొయ్యాం, కుప్పిలి స్కూల్స్ విద్యార్థులు ఇదే పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాస్తున్నారు.
మొత్తానికి విద్యార్థులు క్రమ శిక్షణ తప్పుతున్నారని, చెప్పిన బుర్రకెక్కటం లేదని ఇటీవల విజయనగరం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు తనను తానూ శిక్షించుకుంటూ గుంజీలు తీసి, పొర్లు దండాలు పెట్టిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే.. తాజాగా IIIT లో సీట్లు కోసం ఏకంగా ఉపాధ్యాయులే చూసిరాతకు సహకరించటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అధికారులకు తెలియకుండా జిల్లాలో ఎన్ని చోట్ల ఇలా మాస్ కాపీయింగ్ జరుగుతుందోనన్న చర్చ నడుస్తోంది. మెరిట్ ఆధారంగా IIIT సీట్లు దక్కటం, శత శాతం ఉత్తీర్ణత వంటి లక్ష్యాలు కారణoగా ఉపాద్యాయులు ఒత్తిడికి గురై అడ్డదారులు తొక్కుతున్నారన్న వాదన ఉంది. ఏది ఏమైనా పరీక్షలను మరింత పటిష్ట వంతంగా జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.