Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: ఓరి దేవుడా.. కొంపముంచిన ట్రంప్‌ అంకుల్..! విద్యాశాఖ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అమెరికా విద్యా శాఖను రద్దు చేస్తూ గురువారం సంతకం చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వ్యయం తగ్గించేందుకు పలు రకాల చర్యలు చేపట్టిన ట్రంప్‌ విద్యాశాఖలో భారీగా కోతలు పెట్టారు. దీనిలో భాగంగా అక్కడి విద్యాశాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు..

Donald Trump: ఓరి దేవుడా.. కొంపముంచిన ట్రంప్‌ అంకుల్..! విద్యాశాఖ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ
US President Donald Trump
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 21, 2025 | 11:45 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా విద్యా శాఖను రద్దు చేశారు. ఈ మేరకు సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వ్యయం తగ్గించేందుకు పలు రకాల చర్యలు చేపట్టిన ట్రంప్‌ విద్యాశాఖలో భారీగా కోతలు పెట్టారు. దీనిలో భాగంగా అక్కడి విద్యాశాఖను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం వైట్ హౌస్‌లో స్కూల్‌ విద్యార్ధులతో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రభుత్వ విద్య, విద్యార్థి రుణాలు, సమాఖ్య నిధుల భవిష్యత్తు గురించి ట్రంప్‌ కీలక అంశాలు ప్రస్తావించారు. అనంతరం విద్యాశాఖ మూసివేత ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘మేము విద్యాశాఖను వీలైనంత త్వరగా దానిని మూసివేస్తాం. ఆ అధికారాలు రాష్ట్రాలకు తిరిగి ఇస్తాం’ అని ప్రకటించారు. విద్యా కార్యదర్శి లిండా మెక్‌మహాన్‌ మాట్లాడుతూ.. ‘విద్యా శాఖను మూసివేయడానికి, రాష్ట్రాలకు విద్యా అధికారాన్ని తిరిగి ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు’ వెల్లడించారు.

ఈ ఆర్డర్ ప్రభావం ఏ మేర ఉంటుందనేది అస్పష్టంగానే ఉన్నప్పటికీ, ఏజెన్సీ గణనీయంగా తగ్గుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. విద్యాశాఖ రద్దు చేసినప్పటికీ విద్యార్థి రుణాలు, ప్రమాదంలో ఉన్న విద్యార్థులకు నిధులు వంటి కీలక విధులను మాత్రం కొనసాగిస్తామని అన్నారు. ట్రంప్ కూడా దీనికి మద్దతు ఇచ్చారని తెలిపారు. కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించగలిగే వివిధ ఇతర ఏజెన్సీలు, విభాగాలకు తిరిగి పంపిణీ చేస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి

తాజా ఉత్తర్వుల వల్ల విద్యా శాఖలోని ఉద్యోగుల్లో సగం మందిని ఇంటికి పంపించవల్సి ఉంటుంది. ఈ విషయం గతంలోనే ప్రభుత్వం తెలిపింది. విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్‌మాన్‌ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే ఆ పని మొదలుపెట్టారు. ఈ శాఖలో మొత్తం 4,100 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో ఇప్పటికే 1300 మంది సిబ్బందిని తొలగించారు. బుధవారం సాయంత్రం తొలగించిన ఉద్యోగులకు ప్రభుత్వం ఇమెయిల్ పంపించింది కూడా. ఇందులో వ్యక్తిగత వస్తువులను సేకరించడానికి, ప్రభుత్వం జారీ చేసిన పరికరాలను తిరిగి ఇవ్వడానికి సమయం షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తికి ప్యాక్ చేయడానికి 30 నిమిషాల సమయం ఇవ్వబడింది. ఈ సమయంలో ఉద్యోగులు తమ వద్ద ఉన్న ప్రభుత్వ వస్తువులు తిరిగి ఇవ్వావల్సి ఉంటుంది. ఈ ఆర్డర్‌ను ఓ ఉద్యోగి నిరసిస్తూ.. ముఖం మీద చెంపదెబ్బ కొట్టడం, మమ్మల్ని తన్నడం వంటిదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ట్రంప్ ఉత్తర్వుల వల్ల దాదాపు 50 మిలియన్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. బిలియనీర్లకు పన్ను చెల్లింపుల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారని నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు బెక్కీ ప్రింగిల్ ఈ చర్యను ఖండించారు. ట్రంప్ చర్యలు విజయవంతమైతే తరగతి పరిమాణాలను పెంచడం, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను తగ్గించడం, ఉన్నత విద్యను మరింత ఖరీదైనదిగా మార్చడం, విద్యాను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేకుండా చేయడం, వికలాంగ విద్యార్థులకు ప్రత్యేక విద్యా సేవలను తీసివేయడం వంటివి అమలులోకి వస్తాయి. ఇది విద్యార్థుల పౌర హక్కుల రక్షణలను కాలరాయడమేనని ఆమె అన్నారు. ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయం అటు డెమోక్రట్లకు కూడా మింగుడు పడటం లేదు. ట్రంప్‌ తీసుకున్న అత్యంత విధ్వంసకర, వినాశకరమైన చర్యల్లో ఇది ఒకటిగా వారు పేర్కొన్నారు. తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మహాన్ స్పష్టం చేశారు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.