కన్న తండ్రిని చంపిన కూతురు.. ప్రియుడితో కలిసి దారుణం! ఎక్కడంటే..
ఓ కూతురు చెస్తున్న తప్పుడు పనులను ఆ తండ్రి చూస్తూ ఉండలేకపోయాడు. కూతురిని మందలించాడు. దీంతో కోపంతో ఆ కూతురు దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి ఏకంగా కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గురువారం (మార్చి 20) వెలుగులోకి వచ్చింది..

మండపేట, మార్చి 21: పిల్లలు తెలిసీ తెలియక చేసే పనులు ఎక్కడ వారి భవిష్యత్తును నాశనం చేస్తాయేమోనన్న ఆరాటంలో తల్లిదండ్రులు వారిని నయానో భయానో చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పెద్ద వారి కాఠిన్యం చిన్నతనంలో మనకు నచ్చకపోయినా.. ఎదిగాక వారెంత మేలు చేశారో అర్ధమవుతుంది. అయితే తాజాగా ఓ కూతురు చెస్తున్న తప్పుడు పనులను ఆ తండ్రి చూస్తూ ఉండలేకపోయాడు. కూతురిని మందలించాడు. దీంతో కోపంతో ఆ కూతురు దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి ఏకంగా కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గురువారం (మార్చి 20) చోటుచేసుకుంది. టౌన్ సీఐ దారం సురేష్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..
మండపేట 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి కాపురం ఉంటున్నాడు. ఆయన కుమార్తె వస్త్రాల వెంకట దుర్గ. ఆమె రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు కుమార్తెను మందలించాడు. అయితే తండ్రి తన క్షేమం కోసమే చెప్పాడన్న విషయం మరిచి.. మందలించిన తండ్రిపైనే కక్ష్య పెట్టుకుంది. దుర్గ ప్రియుడితో కలిసి తండ్రిని చంపడానికి పథకం పన్నింది. మార్చి16న తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. సురేష్ తనతోపాటు స్నేహితుడు తాటికొండ నాగార్జునను కూడా వచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు ఛాతిపై కూర్చొని పీక నులిమి హత్య చేశారు.
అనంతరం ఏమీ తెలియనట్టు తండ్రి నిద్రలోనే కన్నుమూసినట్లు దుర్గ నాటకం ఆడసాగింది. అయితే మృతుడి సోదరుడు సూరా పండు అక్కడికి చేరుకుని చూడగా.. సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించాడు. వెంటనే దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. దీంతో నిందితులు ముగ్గురూ విశాఖపట్నం పారిపోతుండగా అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో రామచంద్రపురం కోర్టుకు తరలించారు. కోర్టు వారికి14 రోజుల రిమాండ్ విధించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.