ఇంటర్ పరీక్షల రద్దు నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం! ఇకపై అలా చేస్తే తాటతీసుడే..
అస్సాం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు పుట్టించాయి. మార్చి 21వ తేదీన జరగవల్సిన 11వ తరగతి మ్యాథమెటిక్స్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. దీంతో మార్చి 24 నుంచి ఈ నెల 29 వరకు జరిగే మొత్తం 36 సబ్జెక్టుల పరీక్షలన్నిటినీ రద్దు చేసినట్లు..

గువాహటి, మార్చి 25: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అస్సాం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు పుట్టించాయి. మార్చి 21వ తేదీన జరగవల్సిన 11వ తరగతి మ్యాథమెటిక్స్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. దీంతో మార్చి 24 నుంచి ఈ నెల 29 వరకు జరిగే మొత్తం 36 సబ్జెక్టుల పరీక్షలన్నిటినీ రద్దు చేసినట్లు విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు ప్రకటించారు.
కాగా హయ్యర్ సెకండరీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 6న ప్రారంభమై మార్చి 29 వరకు కొనసాగాల్సి ఉంది. షెడ్యూల్ చేసిన పరీక్షకు ఒక రోజు ముందు గణిత పత్రం లీక్ అయింది. ప్రశ్నాపత్రం లీక్, ప్రోటోకాల్ ఉల్లంఘన కారణంగా ఫస్ట్ ఇయర్ పరీక్షలు 2025 (మార్చి 24 నుంచి 29 వరకు) మిగిలిన అన్ని సబ్జెక్టులు రద్దు చేస్తున్నాం అని అని విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు తన ట్విటర్ ఖాతా పోస్ట్‌లో తెలిపారు. పరీక్షల కొత్త షెడ్యూల్‌కు సంబంధించి తదుపరి చర్యలను సోమవారం జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా 11వ తరగతి గణిత ప్రశ్నపత్రాల సీల్‌ను నిర్ణీత సమయానికి ముందే పగలగొట్టి, లీక్‌కు దారితీసిన కారణంగా అస్సాం రాష్ట్ర పాఠశాల విద్యా బోర్డు (ASSEB) 10 జిల్లాల్లోని 15 ప్రైవేట్ పాఠశాలల అనుబంధాన్ని సస్పెండ్ చేసింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పాఠశాలలపై కూడా చర్యలకు ఉపక్రమించినట్లు మంత్రి పెగు తెలిపారు. ఈ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 11వ తరగతి విద్యార్థుల అడ్మిషన్లను కూడా నిషేధించినట్లు పెగు వివరించారు. అంతేకాకుండా ఇకపై ఎవరైనా లీకేజీలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
పరీక్షల నియంత్రణాధికారి (ఇన్-ఛార్జ్) రంజన్ కుమార్ దాస్ జారీ చేసిన ASSEB ఉత్తర్వు ప్రకారం పాఠశాలల ఇన్స్పెక్టర్లు, లీడ్ కాలేజీల ప్రిన్సిపాల్స్ గణిత ప్రశ్నాపత్రం చేరింది. మార్చి 20న పరీక్షకు ఒకరోజు ముందు సీలు చేసిన ప్రశ్నాపత్ర ప్యాకెట్లను తెరిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరీక్ష మార్చి 21 రెండవ సెషన్‌లో జరగాల్సి ఉంది. మిగిలిన పరీక్షలలో ప్రశ్నాపత్రాల లీకేజీ జరగలేదు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలన్నీ పరీక్ష జరుగుతున్న అస్సాంలోని ఆయా సంస్థల ఆధీనంలో ఉన్నాయని అన్నారు. అందువల్ల మార్చి 24 నుంచి మార్చి 29 వరకు జరగాల్సిన హయ్యర్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్ష మిగిలిన అన్ని సబ్జెక్టులను రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. లీకేజీ వ్యవహారంలో 18 సంబంధిత విద్యా సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు దాస్ తెలిపారు. అయితే అన్ని చోట్ల ప్రశ్నపత్రాలను లీక్ చేశారని అనుకోవట్లేదు. బహుశా ఒకటి లేదా రెండు కేంద్రాలు మాత్రమే ప్రశ్నపత్రాలను లీక్ చేసి ఉండవచ్చు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసుల దర్యాప్తు తర్వాత నిందితుల వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. కాగా గత వారం అస్సాంలోని బార్పేట జిల్లాలో 9వ తరగతి ఇంగ్లీష్ వార్షిక పరీక్ష ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో లీక్ కావడంతో దానిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
బీజేపీ పాలిత అస్సాం రాష్ట్రంలో వరుస పేపర్ లీకేజీలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎస్‌ఎంఎస్‌ఎస్, ఏఏఎస్‌యూ.. అస్సాం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. విద్యా శాఖ మంత్రి పెగు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర పాఠశాల విద్యా మండలి చీఫ్ ఆర్‌సీ జైన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు యువతరం భవిష్యత్తును కాపాడటంలో హిమాంత బిశ్వశర్మ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకేజీలు సర్వసాధారణమైపోయాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సంగీత దాస్ ఆరోపించారు. 2019లో ఇలాగు ప్రశ్నాపత్రాలు లీకైతే సెబా, కౌన్సిల్ రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటైంది. కానీ నాటి అధికారి జైన్‌పై ఎటువంటి దర్యాప్తు జరగలేదు. ఈ అవినీతి అధికారి మళ్ళీ ASSEB ఛైర్మన్ అయ్యాడు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు జైన్‌ను సస్పెండ్ చేయాలి. పెగు రాజీనామా చేయాలి అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సంగీత దాస్ డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకేజీలో అస్సాం ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టిస్తుందని సత్రా ముక్తి సంగ్రామ్ సమితి (SMSS) ప్రధాన కార్యదర్శి ప్రాంజల్ కలిత వ్యంగ్యాస్త్రాలు విసిరాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.