Narendra Singh Tomar: వాళ్ల మరణాలు రికార్డుల్లో లేవు.. పరిహారం సాధ్యం కాదు: కేంద్రం కీలక ప్రకటన
Central Govt - Parliament: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో దాదాపు 750 మంది రైతులు మరణించారు. అయితే.. వారందరి

Central Govt – Parliament: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో దాదాపు 750 మంది రైతులు మరణించారు. అయితే.. వారందరి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ రైతు సంఘాలు సహా విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదంటూ కేంద్రం స్పష్టంచేసింది. ఈ ఆందోళనల్లో మరణించిన రైతులకు రూ.25 లక్షల చొప్పున సాయం అందజేస్తున్నారా..? లేదా..? అని విపక్షాలు పార్లమెంట్‌లో ప్రశ్నించాయి. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైతుల మరణాలకు సంబంధించిన విషయంపై ఎలాంటి రికార్డు లేదని, అందువల్ల రైతుల కుటుంబాలకు సాయం అందించడం కుదరదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం పార్లమెంటుకు తెలియజేశారు.
వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సోమవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న ప్రకటన చేశారు. ఈ సందర్భంగా క్షమాపణలు సైతం చెప్పారు. అనంతరం పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదటిరోజున ఉభయసభల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే.. ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కొంతమంది రైతులు మరణించారని వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలంటూ విపక్షాలు ప్రభుత్వాన్ని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
కాగా.. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసినప్పటకీ.. రైతు సంఘాలు ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నాయి. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, ఆందోళనల్లో తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని, విద్యుత్ చట్టంపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: