National Herald case : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ..
ED - Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. జూలై మధ్య నాటికి విచారణలో
ED – Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. జూలై మధ్య నాటికి విచారణలో పాల్గొనాలని సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం జారీ చేసిన తాజా నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో విచారణ అంశంపై బుధవారం ఈడీకి లేఖ రాశారు సోనియా గాంధీ. కరోనా సోకడంతో తన ఆరోగ్య బాగోలేదని, విచారణను వాయిదా వేయాలని ఈడీని కోరారు. ఈ లేఖపై స్పందించిన ఈడీ.. సోనియా గాంధీ అభ్యర్థనను అంగీకరించింది. కోవిడ్‌తో బాధపడుతున్న ఆమెను విచారించడానికి ఇది సరైన సమయం కాదని భావించిన ఈడీ.. విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా సమన్లు జారీ చేసిన ఈడీ.. జులై మధ్యలో విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఈడీ పేర్కొంది.
కరోనా సోకడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. జూన్ 12న ఆమెకు ముక్కు నుండి రక్తస్రావం కావడంతో అదే రోజు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. జూన్ 2న ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ.. తాజాగా సోమవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, జూన్ 8వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకావాల్సి ఉండగా.. ఆమెకు కోవిడ్ సోకడంతో విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు సోనియా గాంధీ. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఈడీ.. విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. అయితే, సోనియా గాంధీ ఇప్పటికీ అనారోగ్యపరమైన కారణాలతో ఇబ్బందిపడుతుండటంతో.. విచారణకు హాజరుకాలేనని మరోసారి ఈడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విచారణను జులైకి మార్చింది ఈడీ.
ఇకపోతే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు విచారించింది ఈడీ. దాదాపు 51 గంటల పాటు జరిగిన విచారణలో.. అనేక లావాదేవీలకు సంబంధించి ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.