Mallikarjun Kharge: నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున్‌ ఖ‌ర్గే బాధ్యతలు స్వీకరించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే.. 98వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Mallikarjun Kharge: నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు..
Mallikarjun Kharge
Follow us

|

Updated on: Oct 26, 2022 | 12:01 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున్‌ ఖ‌ర్గే బాధ్యతలు స్వీకరించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే.. 98వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 24 ఏళ్ల త‌రువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఖర్గే నిలిచారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ కీలక నేతలంతా హాజరైన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనకు బాధ్యత‌లు అప్పగించారు. గతవారం జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌ పై మల్లికార్జున ఖర్గే గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా నేతలంతా ఖర్గేను అభినందించి.. శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు. తాను చిత్తశుద్ధితో తన విధులను ఇంతకాలం నిర్వర్తించానని.. అదేవిధంగా ఖర్గే కూడా నిలుస్తారని పేర్కొన్నారు. అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ.. మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సర్టిఫికెట్ అందజేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం.. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తన మీద విశ్వాసం ఉంచి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజని.. ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని రక్షించడమే మనందరి లక్ష్యం అని పేర్కొన్నారు. తన అనుభంతో అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. అంతా కలిసి పార్టీని ఉన్నతస్ధాయికి తీసుకెళ్లాలని సూచించారు. రాత్రింబవళ్లు కష్టపడి పార్టీకోసం పనిచేస్తానని.. సోనియా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. తొలిసారిగా పార్టీ చీఫ్‌గా మాట్లాడిన ఖర్గే, “ఒక కార్మికుడి కొడుకు, సాధారణ కాంగ్రెస్ కార్యకర్త పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడం అనేది.. ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమని ఖర్గే పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఖర్గే పేర్కొన్నారు. దేశ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే రాహుల్‌ భారత్ జోడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్‌ తో లక్షలాది మంది కలిసి నడుస్తున్నారని తెలిపారు. రాహుల్‌ భారత్ జోడో యాత్ర లక్ష్యాన్ని వృధా కానివ్వమని ఖర్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అంతకుముందు.. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లి ఖర్గే సహా పలువురు నేతలు మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..